iDreamPost
iDreamPost
ముగ్గురు హీరోలను ఒకే సినిమాలో డీల్ చేసినప్పుడు వ్యవహారం మాములుగా ఉండదు. అందులోనూ యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ని మిక్స్ చేసి మెప్పించడం ఇంకా కష్టం. వాటిని సరిగ్గా బ్యాలన్స్ చేసి ఎంటర్ టైన్మెంట్ కు లోటు లేకుండా చూసుకుంటే ప్రేక్షకులు కనకవర్షం కురిపించడం ఖాయం. దానికో మంచి ఉదాహరణ 2001లో విడుదలైన హనుమాన్ జంక్షన్. అంతకు ముందు ఏడాది మలయాళంలో తెన్కాశిపట్టణం అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. రఫీ మెకార్టిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కేరళలో రికార్డులు సృష్టించింది. అప్పటికే హిట్లర్ లాంటి రీమేకులతో మంచి ట్రాక్ రికార్డు ఉన్న నిర్మాత ఎడిటర్ మోహన్ దీని హక్కులు కొన్నారు. ఎక్కడా రాజీపడకుండా తీయాలని ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టే క్యాస్టింగ్ ను భారీగా సెట్ చేసుకున్నారు.
కొడుకు ఎం రాజాని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించారు. తోటపల్లి మధు సంభాషణలు సమకూర్చగా, చికుబుకురైలే పాట పాడి పాపులారిటీ సంపాదించుకున్న పీటర్ హెయిన్స్ సంగీతం సమకూర్చారు. కథ విషయానికి వస్తే కృష్ణ(అర్జున్) దాసు(జగపతిబాబు)అనాథలైన ప్రాణ స్నేహితులు. హనుమాన్ జంక్షన్ ఊరిని తమ గుప్పిట్లో ఉంచుకుని మంచి చేస్తూ ఆధిపత్యంలో ఉంచుకుంటారు. దాసు చెల్లెలు(విజయలక్ష్మి) ఇద్దరికీ పంచప్రాణాలు. ఆ ఊరికి పాటలు పాడేందుకు వచ్చిన సంగీత(లయ)వీళ్ళ అతి చేష్టల వల్ల అక్కడే ఇరుక్కుపోతుంది. ఉద్యోగం కోసం వచ్చిన శత్రు(వేణు తొట్టెంపూడి)వాళ్ళ చెల్లిని ప్రేమించి తన రూట్ క్లియర్ కావాలంటే ముందు ఈ ఇద్దరి పెళ్లి చేయాలని నిర్ణయించి కొన్ని ఎత్తుగడలు వేస్తాడు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కామెడీ.
హనుమాన్ జంక్షన్ సక్సెస్ కు ప్రధాన కారణం అందులో ఉన్న హాస్యం. ఎక్కడా అసభ్యత లేకుండా అంత తారాగణం ఉన్నా ప్రతి ఒక్కరిని వాడుకుంటూ వాళ్ళ వాళ్ళ టైమింగ్ కు తగ్గట్టు అద్భుతమైన సన్నివేశాలు పేర్చుకోవడం. ఒరిజినల్ వెర్షన్ కు పెద్దగా మార్పులు చేయనప్పటికీ నటీనటులను ఎంచుకోవడంలో ఎం రాజా తన అభిరుచిని చూపించారు. సెకండ్ హాఫ్ లో ఎల్బి శ్రీరామ్, ఎంఎస్ నారాయణ, వేణులు చేసిన ఆవు కామెడీకి సినిమా హాళ్లలో ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యాయి. జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, కోవై సరళ, అలీ, వేణు మాధవ్, తదితరులు ఈ హాస్య యజ్ఞంలో పాలు పంచుకున్నారు. లయతో పాటు మరో హీరోయిన్ గా నటించిన స్నేహకు హనుమాన్ జంక్షన్ మంచి పేరు తీసుకొచ్చింది. దీని తర్వాత దర్శకుడు ఎం రాజా తెలుగులో మరో సినిమా డైరెక్ట్ చేయలేదు. పూర్తిగా తమిళ రంగానికే అంకితమైపోయారు. రామ్ చరణ్ ధృవ తమిళ వెర్షన్ డైరెక్టర్ ఈయనే.