ప్రేమకథలు చెప్పడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విలక్షణ శైలి. అయితే వీటిని హ్యాండిల్ చేయడంలో సౌఖ్యం కన్నా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ డెబ్యూ చేస్తున్న దర్శకులు ఇలాంటి కథలను ఎంచుకున్నప్పుడు అన్ని కోణాల్లో విశ్లేషణ చేసుకోవాలి. సరిగ్గా ప్రేక్షకుల మనసులో ముద్ర వేయగలిగాం అంటే చాలు స్థిరపడిపోయినట్టే. ఇటీవలే ఉప్పెన రూపంలో మంచి ఉదాహరణ చూశాం కదా. అలా అని లవ్ స్టోరీని ఎంచుకున్న దర్శకులందరూ సక్సెస్ అవుతారని కాదు. దానికి చాలా లెక్కలు కావాలి. విభిన్నతతో పాటు సహజత్వం ఉట్టిపడినపుడే విజయం దక్కుతుంది. పది కాలాలు ఆ సినిమా గురించి చెప్పుకుంటారు.
1995వ సంవత్సరం. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న సమయంలో కృష్ణవంశీ డైరెక్టర్ గా తన డెబ్యూ కోసం ఎదురు చూస్తున్నారు. నిజానికి అనుకోకుండా ఒక రోజుతోనే తనను లాంచ్ చేయాలనుకున్నారు వర్మ. కానీ అది కొంత భాగం షూటింగ్ అయ్యాక స్క్రిప్ట్ తో పాటు నిర్మాణానికి సంబంధించిన కారణాల వల్ల వర్మనే దాన్ని టేకప్ చేసి పూర్తి చేశారు. అలా చేయడం వల్లే బడ్జెట్ పెరిగినప్పటికీ వర్మ బ్రాండ్ మీద సినిమా బాగా సేల్ అయ్యింది. ఇచ్చిన మాట ప్రకారమే తన స్వంత బ్యానర్ పై కృష్ణవంశీ రాసుకున్న గులాబీ కథను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఒక్క చంద్రమోహన్ తప్ప అందరూ పెద్దగా తెలియని క్యాస్టింగ్ నే తీసుకున్నారు.
ఎవరూ ఊహించలేని హ్యూమన్ ట్రాఫికింగ్(మహిళల అపహరణ-వ్యభిచారం)అంశాన్ని తీసుకోవడం దగ్గరే కృష్ణవంశీ సగం విజయం సాధించారు. ఆ పాయింట్ ని చాలా న్యాచురల్ గా, అప్పుడే మారుతున్న యువతరం అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన తీరు అందరికీ తెగ నచ్చేసింది. నూతనత్వం కోసం తీసుకున్న కొత్త సంగీత దర్శకుడు శశిప్రీతం అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ఎవరి వాక్ మెన్, టేప్ రికార్డర్లు చూసినా ఇవే సాంగ్స్. గాయని సునీత పాడిన ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో ఆవిడ స్థాయిని అమాంతం పెంచేసింది. మేఘాలలో తేలిపొమ్మన్నది పాట పిక్చరైజేషన్ లో కొత్త ట్రెండ్ సృష్టించింది. జెడి చక్రవర్తి, మహేశ్వరి జంట ఓ రేంజ్ లో క్లిక్ అయ్యింది. నెగటివ్ షేడ్ లో బ్రహ్మాజీ పాత్ర కూడా బాగా పండింది. అందుకే ప్రేమకథలో గులాబీది ప్రత్యేక స్థానం