iDreamPost
android-app
ios-app

జైళ్లలో జన్మించిన గ్రంధాలు

  • Published Aug 15, 2020 | 3:41 AM Updated Updated Aug 15, 2020 | 3:41 AM
జైళ్లలో జన్మించిన గ్రంధాలు

ఎటువంటి యుద్దంలో అయినా సరే, గెలిచినా ఓడినా కాలం మాత్రం వృధా చేయకూడదని నెపోలియన్ అభిప్రాయం. భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది దేశ స్వాతంత్రం కోసం బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడి జైల్లలో మగ్గిపోయారు. అయితే వారు జైల్లలో ఉన్న సమయాన్ని వ్యర్ధం చేయకుండా అప్పటి సమాజంతో పాటు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఎన్నో అమూల్యమైన పుస్తకాలను రచించారు.

స్వత్రంత్ర పోరాటాన్ని అహింస అనే ఆయుధంతో ఉరుకులు పెట్టించిన మహాత్మాగాంధీని బ్రిటీష్ ప్రభుత్వం అనేకసార్లు జైలులో నిర్భంధించింది. గాందీజీ ఎరవాడ జైలులో ఉన్న సమయంలో “సత్యశోధన” పేరుతో స్వీయ చరిత్రను రాసి భావితరాలకు అందించారు. భారత దేశ తొలి ప్రధాని అయిన పండిట్ జవహరలాల్ నెహ్రూ మహాత్మా గాంధి అడుగుజాడల్లో బ్రిటీష్ తో పోరాడి నిర్బందానికి గురైనా జైలు నుంచే “గ్లింప్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ”, “డిస్కవరీ ఆఫ్ ఇండియా” అనే అద్భుతమైన గ్రంధాలను రచించారు.

భారత జాతీయోద్యమపితగా పేరుగడించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు దాన్ని నేను పొంది తీరుతాను అని బ్రిటీష్ అధికారులని ఎదిరించి, అరెస్ట్ అయి బర్మాలోని మండలే జైలులో శిక్షను అనుభవిస్తూ ఉండగా, “గీతా రహస్యం” పేరున గ్రంధాన్ని రచించారు. అలాగే భారతదేశ స్వతంత్ర సంగ్రామ కాలంలో ఏళ్ళతరబడి జైలు జీవితం గడిపిన తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ తన “స్వీయ చరిత్ర”ను జైలులోనే రచించారు.

భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రిగా సేవలు అందించి, మహాత్మాగాంధీ చేత భారత ప్లాటోగా పిలిపించుకున్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాంచీలో బ్రిటీష్ నిర్భంధంలో ఉండగా “తర్జమనుల్ ఖురాన్” పేరున ఖురాన్ వాఖ్యానం రచించారు. భారత స్వతంత్రపోరాటంలో పాల్గోన్న రాజకీయ పార్టీల్లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రధానమైన పార్టీ .ఆంధ్ర రాష్ట్రోద్యమానికి భీజం వేసిన భోగరాజు పట్టాభి సీతారామయ్య సైతం “ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చరిత్ర”ను వెల్లురు జైలులో శిక్ష అనుభవిస్తునప్పుడు రచించారు.

భూదానోద్యమ పితామహుడిగా దేశం నలుమూలలా పాదయాత్ర చేసి భూమిని పేదలకు పంచిన ఆచార్య వినోభా భావే 1932లో దూలే జైలులో ఉన్న సమయంలో తోటి కారాగార వాసులకి తన మాతృభాషైన మరాఠీలో చెప్పిన గీత ఉపన్యాసాలను “గీత్ ప్రవచన్”గా రూపొందించారు . ఈ గ్రంధాన్ని అనేక భాషల్లో దేశవిదేశాల్లో అనువాధం కూడా చేశారు. లాల్ బహుద్దుర్ శాస్త్రి “మేడం క్యూరీ జీవిత చరిత్ర”ను జైలులోనే హిందీలోకి అనువదించారు. “క్విట్ ఇండియా చరిత్ర”ను కూడా జైలులోనే ప్రారంభించినా అది పూర్తికాలేదు.

రెండవ ప్రపంచ యుద్దానికి ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూరోప్ లో నిర్భంద జీవితాన్ని గడుపుతున్నప్పుడు 1935లో “ది ఇండియన్ స్ట్రగుల్” పేరితో పుస్తకాన్ని రచించారు. అయితే ఈ పుస్తకాన్ని ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వం ఇండియాలో నిషేధించింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం 1948లో ఈ పుస్తకాన్ని భారత్ లో విడుదల చేశారు. భారత దేశ విప్లవ నిప్పు కణిక భగత్ సింగ్ సైతం 23 ఏళ్ల వయస్సులోనే ఉరి కంభాన్ని ముద్దాడే కొద్ది నెలల ముందు “నేను నాస్తికుడిని ఎందుకు అయ్యాను” అంటూ తన భావాలను గ్రంధస్తం చేశారు.

ఆంద్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాల్ రెడ్డి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి జైలు జీవితం గడిపారు, ఇదే సమయంలో ఆయన రవింద్రనాద్ ఠాగూర్ రచించిన గ్రంధాలను తెలుగు భాషలోకి అనువధించారు. సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ఉన్నవ లక్ష్మీనారాయణ, కారాగార వాసంలోనే “మాలపల్లి” అనే అపూర్వమైన తెలుగు నవలను రచించారు. ఈ నవల మద్రాస్ ప్రభుత్వం చేతిలో రెండుసార్లు నిషేదానికి గురైంది.

మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం లెనిన్ , సర్ వాల్టర్ రాలీ, ఫ్రెంచ్ విప్లవవాది విక్టర్ హ్యుగో, నల్సన్ మండేలా, మార్టిన్ లూధర్ కింగ్ మొదలైన వారు తమ జైలు జీవితంలో అమూల్యమైన గ్రంధాలను రచించి భావితరాలకు అందించారు ..