iDreamPost
android-app
ios-app

గోపీచంద్ 29కి పర్ఫెక్ట్ కాంబో

  • Published Jan 07, 2021 | 7:09 AM Updated Updated Jan 07, 2021 | 7:09 AM
గోపీచంద్ 29కి పర్ఫెక్ట్ కాంబో

మాచో హీరోగా పేరున్న గోపీచంద్ గట్టిగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి దశాబ్దం దాటుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలకు ధీటుగా ఓపెనింగ్స్ సాధించిన ఈ అల్ రౌండర్ గత కొంతకాలంగా వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు. మూస కథలను ఎంచుకోవడం, దర్శకులు పదే పదే ఇతన్ని మాస్ హీరోగా అతి బిల్డప్ తో ప్రెజెంట్ చేయడం లాంటివి తగిన మూల్యాన్ని చెల్లించేలా చేశాయి. డైరెక్టర్ ఎవరైనా సరే ఫ్లాప్ కామన్ అయిపోయింది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సీటీ మార్ మీదే తన ఆశలన్నీ. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తమన్నా హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

ఇవాళ మరో ఇంటరెస్టింగ్ కాంబోతో గోపీచంద్ ముందుకు వచ్చాడు. యువి సంస్థ, గీతా ఆర్ట్స్ 2 సంయుక్త నిర్మాణంలో మారుతీ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మారుతీ ప్రతి రోజు పండగే తర్వాతే ఇదే బ్యానర్ లో వెంటనే సినిమా చేయడం విశేషం. ఏడాది పాటు వేచి చూసిన మారుతీ మధ్యలో ఇతర హీరోలతో ట్రై చేశాడు కానీ లాక్ డౌన్ తో పాటు ఇతరత్రా కారణాల వల్ల ఏదీ ఓకే కాలేకపోయింది. గత ఏడాది చివర్లో ప్రతి రోజు పండగే తో ఊహించని బ్లాక్ బస్టర్ అందించిన మారుతీకి ప్రాజెక్ట్ వెంటనే సెట్ అవుతుందనుకుంటే ఇంత ఆలస్యం కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాంబోలో ఇది మూడో సినిమా. అందుకే అంచనాలు కూడా పాజిటివ్ గా ఉన్నాయి. షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. మారుతీ కాబట్టి ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు. అన్నీ కుదిరితే ఈ ఏడాది రెండో సగంలోనే విడుదల ఉండే అవకాశం ఉంది. ఇక సీటీ మార్ విషయానికి వస్తే సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాని వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం పూర్తయ్యింది. మణిశర్మ సంగీతం ఆకర్షణగా నిలవబోతోంది. ఇప్పుడు ఈ రెండు హిట్టు కొట్టగలిగితే మునుపటి ఫామ్ ని అందుకోవడం గోపీచంద్ కు పెద్ద కష్టం కాదు.