త్వరలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో అధికారం చేజిక్కించుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటిస్తున్న తాయిలాలు చర్చనీయాంశం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో వ్యూహాలు సిద్ధం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల నేపథ్యంలో హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భారీ ప్రకటన చేశారు. గోవా రాజధాని పనాజీ చేరుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం ఏర్పడితే హిందువులకు అయోధ్యకు ఉచితంగా యాత్ర చేసే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. తాను ఇటీవల అయోధ్యను సందర్శించానని, ఆ తర్వాత తనకు ఈ ఆలోచన వచ్చిందని కేజ్రీవాల్ చెప్పారు.
పనాజీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ గోవాలో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే హిందువులకు అయోధ్యకు, క్రైస్తవులకు వేలంకిణికి ఉచిత యాత్ర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. సాయిబాబా పట్ల భక్తి ఉన్న ముస్లింల కోసం షిర్డీ ట్రిప్, అది వద్దనుకున్న వారి కోసం అజ్మీర్ షరీఫ్ దర్గాలకు ఉచిత యాత్ర చేసే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అయితే ఆయన చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. గెలిస్తే గోవా ప్రజల అభివృద్ధి కోసం ఏం చేస్తానో చెప్పడం మానేసి ఈ యాత్రల గోల ఏంటో?. అసలు సామాన్యుడి చేతికే అధికారం అంటూ తెరమీదకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటూ ప్రకటించడం హాస్యాస్పదం కాక ఇంకేంటి?
అంతకు ముందే గోవా యూత్ ను ఆకట్టుకునే విధంగా ఏడు హామీలు ఇచ్చారు. ఎమ్మెల్యే సంబంధికులకు కాదు గోవా వాసులకు ఉద్యోగాలు కల్పిస్తామని, కుటుంబానికో ఉద్యోగం ఆ ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేటు ఉద్యోగాల్లో 80 శాతం గోవా వాసులకే ప్రాధాన్యత సహా కరోనాతో నిరుద్యోగులైన పర్యాటక శాఖకు చెందినవారికి రూ.5 వేల ఆర్థిక సహాయం, మైనింగ్ నిషేధంతో ప్రభావితులైన వారికి రూ.5 వేల ఆర్థిక సహాయం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం.” అంటూ అరవింద్ కేజ్రీవాల్ హామీలు ఇచ్చారు. అవి నమ్మరేమో అనే ఉద్దేశంతోనే ఇప్పుడు మతాల వారీగా హామీలు గుప్పిస్తున్నారు.
ఇక హామీల తర్వాత కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేసిన కేజ్రీవాల్ ‘‘రెండు పార్టీలూ అవినీతి మయమేనని అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడదు, ఎందుకంటే మాట్లాడితే జైల్లో పెడతారని తెలుసని అన్నారు. 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వంలో ఉండి ఒక్క కాంగ్రెస్ మంత్రి, సీఎంపై ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? అని ప్రశ్నించిన ఆయన రెండూ కలిసే ఉంటాయనీ అన్నారు. “సత్యపాల్ మాలిక్ (గోవా మాజీ గవర్నర్) సంవత్సరం పాటు గవర్నర్‌గా ఉన్నప్పుడు గోవాలో ప్రతి పనిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రిని అవినీతి సిఎం అని ఆయన (బిజెపి) సొంత పార్టీ గవర్నర్ ఆరోపించారంటే పరిస్థితి ని అర్థం చేసుకోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద కేజ్రీ తీర్థ యాత్రల ఆఫర్ ఆయనను గట్టిగా టార్గెట్ చేసే అవకాశాలున్నాయి.
Also Read : Will Not Let Farmers Die By Suicide – మంచి మాట కేజ్రీవాల్… అదే జరిగితే దేశం మీకు జై కొడుతుంది..