Idream media
Idream media
ఉప్పల్ నియోజకవర్గంలోని ఓ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి ఓటు కు నోటు ఇస్తున్నట్లు తెలిసి జనం ఎగబడ్డారు. ఒకేసారి వచ్చిన జనంతో ఆ అభ్యర్థి తరఫు అనుచరులు కంగారుపడి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఓ డివిజన్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆ పార్టీ నేత ఓటరు స్లిప్పుల పేరుతో నోట్లను పంచుతున్నట్లు తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి అక్కడికి వెళ్లడంతో వివాదం మొదలైంది. చినికి చినికి గాలి వానై అది టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. కూకట్ పల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు టీడీపీ నేతలు కూడా ప్రలోభాలకు తెర తీశారు. ఇలా ఆదివారం సాయంత్రం ప్రచారం ముగిసినప్పటి నుంచీ ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఆ పార్టీ నేతలను, ఈ పార్టీ.. ఈ పార్టీ నేతలను ఆ పార్టీ నేతలూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. ఇది ఘర్షణకు దారి తీస్తోంది.
ఖర్చు పెట్టేవారిదే విజయం..?
టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉధృత స్థాయిలో జరిగిన గ్రేటర్ ప్రచార పోరులో ఇక ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిదే పైచేయిగా మారింది. దీంతో ఎంతయినా ఖర్చు పెట్టేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. డబ్బులు తీసుకున్న వారు.. సదరు వ్యక్తికే ఓటు వేస్తారా..? లేదా అనేది పక్కనబెడితే.. కొన్ని చోట్ల అధికార పార్టీ అభ్యర్థులు అంగన్ వాడీ టీచర్ల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. ఇతర పార్టీల నాయకులు తమ ముఖ్య అనుచరుల ద్వారా ఈ తతంగం నడిపిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ రూ. 500 నోట్లను పంచుతున్న టీఆర్ఎస్ పార్టీ నేతలను బీజేపీ కార్యకర్తలు పట్టుకున్న వీడియోలు, బీజేపీ నేతలు డబ్బులు పంచుతూ పట్టుబడిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే తాయిలాల పంపిణీ ద్వారా అభ్యర్థులు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటర్లే డిమాండ్ చేసి మరీ…
ఇదిలా ఉండగా.. కొన్ని చోట్ల ఓటర్లే డిమాండ్ చేసి మరీ అభ్యర్థులను డబ్బులు అడుగుతున్నారు. కాలనీ, అపార్టమెంట్ అసోసియేషన్లు అయితే తమ నివాస సముదాయాలకు కావాల్సినవి కొని పించుకుంటున్నారు. 80 ఓట్లు గల ఓ అపార్టమెంట్ అసోసియేషన్ లిఫ్ట్ మరమ్మతుల నిమిత్తం ఓ అభ్యర్థి నుంచి రూ. 40 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. గతంలో కాలనీల్లో డబ్బు పంపకాలు పెద్దగా ఉండేవి కావు. ఈసారి కొన్ని ప్రాంతాల్లో కాలనీవాసులు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా అభ్యర్థులు చెబుతున్నారు. గెలుపు కోసం వారు కూడా సరే అంటున్నారు. ఈ ప్రలోభాల పర్వం ఏ పార్టీకి కలిసి వస్తుందో, ఏ పార్టీకి నష్టం చేస్తుందో, లబ్ది పొందిన వారు ఆ అభ్యర్థికే ఓటు వేస్తారా..? పోలింగ్ బూత్ లోకి వెళ్లాక నచ్చిన అభ్యర్థికే ఓటు గుద్దుతారా..? అనేది వారికే తెలియాలి.