iDreamPost
android-app
ios-app

నాగ్ ‘మురళీ’ని కాపీ కొట్టిన ‘గజినీ’ – Nostalgia

  • Published Jan 08, 2021 | 7:50 AM Updated Updated Jan 08, 2021 | 7:50 AM
నాగ్ ‘మురళీ’ని కాపీ కొట్టిన ‘గజినీ’ – Nostalgia

కొన్ని బ్లాక్ బస్టర్స్ చూస్తూ అందులో లీనమైపోయినప్పుడు పాత సినిమాల తాలూకు జ్ఞాపకాలు అంత సులభంగా గుర్తుకు రావు. తర్వాత ఎప్పుడో టీవీలోనో యూట్యూబ్ లోనో చూసినప్పుడు అరె మొన్న చూసిన మూవీలో అచ్చం ఇవే సీన్లు ఉన్నాయే అని ఆశ్చర్యపోతాం. ఇప్పటి యువతరానికి ఇవి అంతగా ఫ్లాష్ కావు కానీ రెగ్యులర్ గా చూసే మూవీ లవర్స్ మాత్రం ఠక్కున గుర్తు పడతారు. ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దాం. సూర్య హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 2005లో విడుదలైన ‘గజిని’ గుర్తుందిగా. తెలుగులోనూ అద్భుతమైన స్పందన తెచ్చుకుని భారీ వసూళ్లు రాబట్టడం అప్పట్లో ఒక సంచలనం. సూర్యకు టాలీవుడ్ లో గొప్ప గుర్తింపు వచ్చింది దీని వల్లే.

ఇందులో సూర్య ఆసిన్ ల మధ్య లవ్ ట్రాక్ అప్పట్లో చాలా ఫ్రెష్ గా అనిపించి మళ్ళీ మళ్ళీ చూసే రేంజ్ లో మురుగదాస్ దాన్ని చిత్రీకరించాడు. మొబైల్ కంపనీ ఓనరైన హీరోని అతనికి తెలియకుండా హీరోయిన్ తన లవర్ గా చెప్పుకుని మంచి అవకాశాలు పాపులారిటీ సంపాదించుకుంటుంది. ఆమెను నిలదీద్దామని బయలుదేరిన హీరో తన మంచితనం చలాకీతనం చూసి కరిగిపోయి తన అసలు ఐడెంటిటీ దాచిపెడతాడు. మాములు వాడిగా పరిచయం చేసుకుని ప్రేమలో పడేస్తాడు. ఆ తర్వాత కథ వేరే మలుపు తిరుగుతుంది. ఈ ట్రాక్ ఎప్పుడో 1988లోనే ఓ నాగార్జున సినిమాలో వచ్చిందంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ.

బాలకృష్ణతో వరుసగా సినిమాలు చేయడంలో పేరు తెచ్చుకున్న నిర్మాత ఎస్ గోపాలరెడ్డి నాగార్జున హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘మురళీకృష్ణుడు’. హీరోయిన్ రజనీ. పైన చెప్పిన తరహాలోనే సేమ్ ఇదే ట్రాక్ ఈ సినిమాలోనూ ఉంటుంది. లవ్ స్టోరీ కూడా ఇంచుమించు ఇదే స్టైల్ లో సాగుతుంది. కాకపోతే గజినీ లాగా యాక్షన్ రివెంజ్ స్టోరీ కాదు. ప్రేమకథ అంతే. అప్పట్లో భారీ హిట్ కాకపోయినా మురళీకృష్ణుడు కమర్షియల్ గా వర్కవుట్ అయ్యింది. కెవి మహదేవన్ సంగీతం సమకూర్చగా గణేష్ పాత్రో సంభాషణలు రాశారు. ఇప్పుడోసారి మురళీకృష్ణుడు చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వడం ఖాయం. అంతగా గజినీతో పోలికలు కనిపిస్తాయి. ఒకవేళ నాగ్ మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యుంటే గుర్తుపడతారని గజినీలో ఈ ట్రాక్ మార్చి ఉండేవాళ్ళేమో.