ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు చంద్రబాబు 36 గంటల వెరైటీ దీక్ష చుట్టూనే తిరుగుతున్నాయి. కావాలని అధికార పక్ష నేతలను బూతులు తిట్టింది కాక తిరిగి 36 గంటల దీక్ష చేసి చంద్రబాబు తన నేతలందరినీ రప్పించి వారి చేత మళ్ళీ విమర్శల వర్షం మొదలు పెట్టించారు.
అందులో భాగంగానే అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పరిటాల సునీత ఇన్నాళ్లూ ఓపిగ్గా ఉన్నామని, ఇంకా ఓపికతో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు చేశారు. పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నా.. అధికారంలో వచ్చాక శాంతిగా ఉండమని చంద్రబాబు చెప్పారని, ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే.. ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని
పరిటాల రవిని చంపిన వాళ్లు రోడ్ల మీద తిరుగుతోన్నా చంద్రబాబు మీద గౌరవంతో గొడవలు పెట్టుకోలేదని తమ ఫ్యాక్షనిజాన్ని బయట పెట్టే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అంటూనే అధికారంలోకి వచ్చాక గంట కళ్లు మూసుకుంటే చాలని మేము ఏంటో చూపిస్తామని కూడా కామెంట్ చేశారు.
ఇప్పుడైనా సరే మీ పని మీరు సైగ చేయండని చెబితే మంత్రులను తిరగనివ్వమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాక చంద్రబాబు కాళ్ల కింద ఉండే వ్యక్తులు వంశీ, నాని వంటి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు.
టీడీపీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ సాంకేతికంగా టీడీపీలో కొనసాగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన వైసీపీ కోసం పనిచేస్తున్నారు.ఇక వంశీ మొదట్లో పరిటాల రవి అనుచరుడిగా ఉండేవారు. ఈ క్రమంలోనే సునీతను ఆయన వదిన అని పిలుస్తారు.
తాజా వ్యాఖ్యల నేపథ్యంలో దమ్ము, మొగతనం ఉంటే వచ్చి నారా లోకేష్‌ను గన్నవరంలో పోటీ చేయాల్సిందిగా చెప్పాలని ఆయన సునీతను కోరారు. సాధారణ ఎన్నికల దాకా ఆగడం ఎందుకు, ఇప్పుడే తాను రాజీనామా చేస్తానని, తన వదిన పరిటాల సునీత వచ్చి గన్నవరంలో లోకేష్‌నో, చంద్రబాబునో పోటీకి దించి గెలిపించుకునే ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు. పరిటాల సునీతను తాను వదినగానే భావిస్తానని చెప్పిన వంశీ ఆమె కృష్ణ సారథ్యం వహిస్తారో, శల్య సారథ్యం వహిస్తారో చూద్దామని చెబుతూ తన ఖాళీ లెటర్ హెడ్ మీద సంతకం చేసి టీవీ చానెల్ ప్రతినిధికి ఇచ్చారు.
దానిపై రాజీనామా చేస్తున్నట్లు రాసి పరిటాల సునీత స్పీకర్‌కు ఇవ్వాలని వంశీ కోరారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును పరిటాల సునీత చదివి వినిపించినట్లున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు సాయంత్రం పడుకుంటే పొద్దున ఉన్నాడా, లేదా అని తట్టి లేపాల్సిన వయస్సులో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తల్లికీ ,గర్భస్థ శిశువుకు మధ్య గొడవ పెట్టగలిగే సమర్థుడు చంద్రబాబు అని ఆయన అన్నారు. గన్నవరానికో, గుడివాడకో తానూ కొడాలి నాని మొదటివాళ్లమూ కాదు, చివరి వాళ్లమూ కాదని వంశీ అన్నారు. వంశీ కామెంట్స్ సహా ఆయన చేసిన సవాల్ ఆసక్తికరంగా మారింది. ఆయన దమ్మున్న సవాల్ చేశారని విశ్లేషకులు సైతం ఇప్పుడు అభిప్రాయ పడుతున్నారు. నిజమే మరి ఏదో జరిగిపోతుంది అని భావిస్తూ కామెంట్లు చేస్తున్న టీడీపీ నేతలు నిజంగా సత్తా ఉంటే వంశీ సవాల్ స్వీకరించే ప్రయత్నం చేయచ్చు. కానీ అది అంత ఈజీ అయితే కాదు అనుకోండి.
Also Read : Vamsi Challenge – వంశీ సవాల్‌ను పరిటాల సునీత స్వీకరిస్తారా..?