iDreamPost
android-app
ios-app

ఇండో పాక్ లవ్ స్టోరీకి కనకవర్షం – Nostalgia

  • Published Feb 11, 2021 | 11:22 AM Updated Updated Feb 11, 2021 | 11:22 AM
ఇండో పాక్ లవ్ స్టోరీకి కనకవర్షం – Nostalgia

మనకు శత్రుదేశం అనగానే ఠక్కున గుర్తొచ్చేది పాకిస్థాన్. ఆ జట్టుతో క్రికెట్ ఉన్న రోజు ఆట మీద అంతగా అవగహన లేని వాళ్ళు కూడా టీవీ సెట్లకు అతుక్కుపోవడం సర్వసాధారణం. అలాంటిది రెండు దేశాల మధ్య ఓ జంట ప్రేమకథను తెరమీద చూపించి మెప్పించడం సులభమా. ఆ మధ్య పూరి ఇలాంటి లైన్ ను తీసుకుని తన కొడుకు ఆకాష్ తో మెహబూబా తీసి ఎలా దెబ్బ తిన్నాడో చూసాంగా. కానీ సరైన విధంగా తెరకెక్కితే ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో నిరూపించిన సినిమా ‘గదర్ ఎక్ ప్రేమ్ కథ’. సన్నీ డియోల్, అమీషా పటేల్ హీరో హీరోయిన్లుగా అమ్రిష్ పూరి మెయిన్ విలన్ గా అనిల్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ వార్ మూవీకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి.

1947 ప్రాంతంలో దేశవిభజన జరిగినప్పుడు రేగిన మతకల్లోల్లాల్లో బూటా సింగ్ అనే సైనికుడి విషాద ప్రేమ కథ ఆధారంగా గదర్ స్టోరీని రాసుకున్నారు. రైలులో శవాల గుట్టలను మోసుకుంటూ తన వాళ్ళను కోల్పోయి ఒంటరిగా వచ్చిన ఓ పాకిస్థానీ అమ్మాయిని ఇక్కడ ఓ సిఖ్ యువకుడు ఆదరించి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆమె తల్లితండ్రుల మాయ మాటలు నమ్మి తనను పాక్ కు పంపించాక మోసపోయానని గుర్తించి కొడుకుతో సహా అక్కడికి బయలుదేరతాడు. ప్రాణాలకు తెగించి భార్యను వెంటతెచ్చుకుని తన వీరత్వాన్ని ప్రేమను ఋజువు చేసుకుంటాడు. సిఖ్ పౌరుషాన్ని పాక్ గడ్డపై చూపిస్తాడు.

2001 జూన్ 15న అమీర్ ఖాన్ ‘లగాన్’తో పాటు అదే రోజు విడుదలైన గదర్ ఇప్పటిదాకా ఇండియాలో అత్యధిక శాతం జనం థియేటర్లలో చూసిన సినిమాల్లో హం ఆప్కే హై కౌన్, బాహుబలి 2 తర్వాత షోలే, డిడిఎల్, 3 ఇడియట్స్ ను నెట్టేసి మరీ మూడో స్థానంలో ఉంది. అప్పట్లోనే సుమారుగా 10 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయని వరల్డ్ రికార్డు నమోదు చేసుకుంది. చాలా తక్కువగా ఉన్న టికెట్ ధరలకు 150 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టడం చిన్న విషయం కాదు.సంగీత దర్శకుడు ఉత్తమ్ సింగ్ ఇచ్చిన పాటలు ఊరువాడా మారుమ్రోగిపోయాయి. 500 అమ్మాయిలకు ఆడిషన్లు చేసి అమీషా పటేల్ ను తీసుకున్నారు. గదర్ నుంచి స్ఫూర్తితోనే ఇంద్రలో చిరంజీవి పునీత్ ఇస్సార్ కు వార్నింగ్ ఇచ్చే షౌకత్ అలీ ఖాన్ ఎపిసోడ్ ని సెట్ చేసుకున్నారు. సన్నీ డియోల్ నటవిశ్వరూపం ఘాయల్ తర్వాత గదర్ లోనే చూడొచ్చు.