iDreamPost
iDreamPost
ఇవాళ రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతున్న మాస్టర్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. 200 కోట్ల కెపాసిటీ ఉన్న సినిమాని ఇలా కేవలం 16 రోజుల్లోనే ఆన్ లైన్ లో తీసుకురావడం పట్ల తమిళనాడు పంపిణీదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు వెర్షన్ లాభాలు వచ్చాయి కాబట్టి ఇక్కడి నిర్మాతకు ఎగ్జిబిటర్లకు వచ్చిన నష్టమేమి లేదు. పైపెచ్చు డిజాస్టర్ టాక్ తో భారీ లాభాలు వచ్చాయి. క్రాక్ కూడా ఈ రోజే రావాల్సింది కానీ హీరో ప్లస్ టీమ్ నుంచి వచ్చిన ప్రత్యేక అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఫిబ్రవరి 5కి వాయిదా వేశారు. అయినా కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ 20 రోజులకే రావడం టాలీవుడ్ లో ఇదే మొదటిసారి.
ఒకప్పుడు దూరదర్శన్ మాత్రమే ప్రేక్షకులకు వినోద సాధనంగా ఉన్నప్పుడు ఏదైనా కొత్త సినిమా రావాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలలు ఎదురు చూడాల్సి వచ్చేది. క్రేజ్ ఉన్న స్టార్ హీరోలవైతే ఒక్కోసారి ఏడాది దాటినా టెలికాస్ట్ జరిగేది కాదు. పైపెచ్చు తమ సినిమా ప్రసారం అయ్యేలా నిర్మాతలు ఫాలో కావలసిన నిబంధనలు, ఆఫీసు చుట్టూ తిరగాల్సిన ప్రహసనాలు చాలా ఉండేవి. శాటిలైట్ ఛానల్స్ వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. వాటి ప్రతినిధులు నిర్మాతల గుమ్మం దగ్గర ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. లక్షల నుంచి హక్కుల కోసం కోట్లు గుమ్మరించే దాకా వెళ్ళింది. ఒక్కోసారి బయటికి కనిపించని వేలాలు కూడా జరిగేవి.
ఇక ఓటిటి రంగప్రవేశంతో ఇదంతా ఇంకో మలుపు తీసుకుంది. ఇప్పుడు కొత్త సినిమాల బుల్లితెర ప్రసారాలు డిజిటల్ స్ట్రీమింగ్ పేరుతో ఏకంగా వారాల్లోకి వచ్చేశాయి. మాములుగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద హీరోల సినిమాలను ఓ రెండు వారాల తర్వాత చూసేందుకు ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అప్పటికంతా టికెట్లు సులువుగా దొరికే అవకాశం ఉండటం, పెంచిన రేట్లు తగ్గించడం లాంటి కారణంగా చెప్పుకోవచ్చు. కానీ ఇలా మూడు వారాలు గడవక ముందే ఓటిటిలో వచ్చేయడం ఎంతవరకు న్యాయమని థియేటర్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. చూస్తుంటే హాలీవుడ్ లో కొన్ని సంస్థలు చేస్తున్నట్టు థియేటర్ ప్లస్ ఓటిటి ఒకే రోజు రిలీజ్ లాంటి ట్రెండ్ ఇక్కడ మొదలైనా ఆశ్చర్యం లేదు. వండర్ విమెన్ 1984ని అలాగే విడుదల చేసింది సదరు సంస్థ. ఇక్కడ రాకుంటేనే మంచిది