Idream media
Idream media
మూడేళ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తన సమస్యను పరిష్కరించడం లేదంటూ కడప జిల్లాలో ఓ రైతు ఏకంగా తహశీల్దార్ చాంబర్‌లో తనపై పెట్రోల్ పోసుకున్నాడు. కొండాపురం మండలంలోని బుక్కపట్నం గ్రామం 122 సర్వేనంబర్‌లో 10.94 ఎకరాల డీకేటీ భూమి ఉంది. ఇందులో 3.50 ఎకరాల భూమికి గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి గండికోట ప్రాజెక్టు కింద ముంపు పరిహారం తీసుకున్నాడు. మిగిలిన భూమిపై వివాదం ఉంది. ఇందులో 3.50 ఎకరాలు తన తండ్రి పేరుతో ఉందని, చాలాకాలం నుంచి తమ అనుభవంలో ఉందని, ఆ భూమిని తన తల్లి పేరుమీద ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటూ బుడిగి ఆదినారాయణ(46) అనే రైతు హైకోర్టును ఆశ్రయించారు. మూడేళ్ల నుంచి ఆన్‌లైన్‌లో భూమిని నమోదు చేయాలంటూ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆదినారాయణ పెట్రోల్ బాటిల్‌తో తహశీల్దార్ చాంబర్‌లోకి ప్రవేశించి, తహశీల్దార్ మాధవకృష్ణారెడ్డి ఎదుట తన ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆదినారాయణను పక్కకు లాగి నీళ్లు చల్లి పోలీసులకు అప్పగించారు. 1989 నుంచి ఆ భూమి మా తండ్రి అనుభవంలో ఉన్నా ఆన్‌లైన్ చేయకపోవడంతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు చెప్పారు. అయితే ఈ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని తహశీల్దార్ చెప్పారు. అది డీకేటీ భూమి అని వివరించారు.