iDreamPost
iDreamPost
అస్తవ్యస్తంగా సాగిపోతున్న భారత ఎన్నికల సరళని విప్లవాత్మకమైన సంస్కరణలతో గాడిలో పెట్టిన మనిషి, ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు ప్రాముఖ్యతను చాటి చెప్పటమే కాకుండా ఎన్నికల నిబంధనావళిపై సామాన్య ప్రజల్లో కూడా అవగాహన కల్పించిన వ్యక్తి. సంచలన నిర్ణయాలతో రాజకీయ నేతలకు సైతం చెమటలు పట్టించిన వ్యక్తి. ఆయనే కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ తిరునళ్లై నారాయణ అయ్యర్ శేషన్. భారత ఎన్నికల కమీషన్ గురించి చెప్పాలంటే… శేషన్‌కు ముందు, ఆయన తర్వాత అని చెప్పాల్సిందే!
కేరళలోని పాలక్కాడ్ జిల్లా తిరునెళ్లాయిలో 1932 డిసెంబరులో జన్మించిన టీఎన్ శేషన్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ పూర్తి చేశారు. 1955 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన శేషన్. తొలుత 1989లో 18వ కేబినెట్ సెక్రటరీగా పని చేశారు ఆ తరువాత భారత ఎన్నికల సంఘానికి 10వ సీఈసీగా 1990 డిసెంబర్ 12న బాధ్యతలు స్వీకరించారు.
ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టిన శేషన్ ఎన్నికల రంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అర్హులైన ఓటర్లకు గుర్తింపు కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎన్నికల నిబంధనావళి అమలు కావడానికి చర్యలు తీసుకున్నారు. అభ్యర్థుల ఖర్చుపై పరిమితి విధించారు. ఓటుకు నోట్లు ఇస్తూ ఓటర్లను ప్రలోభపెట్టడం, ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ లాంటి అనైతిక చర్యలపై ఉక్కుపాదం మోపారు. ఎన్నికల ప్రచారంలో లౌడ్ స్పీకర్లు వినియోగించడాన్ని నిషేధించారు. మతపరమైన ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవడాన్ని నిలుపు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాబోయే ముందు రోజు శేషన్ మతవిశ్వాసాలు ఉన్నప్పటికీ తన ఆఫీసు గదిలో దేవుళ్లు, దేవతల విగ్రహాలు, క్యాలండర్లు అన్నీ తొలగించారు.
మధ్యప్రదేశ్‌లోని ఒక నియోజకవర్గంలో అప్పటి గవర్నర్ తన తనయుడి తరపున ప్రచారం చేయడంతో శేషన్ అక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. అలాగే కొన్ని గంటల్లో పోలింగ్ మొదలవుతుందనగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయడం శేషన్ సంచలన నిర్ణయాల్లో ఒకటి. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అధికారాలను గుర్తించేవరకూ దేశంలో ఏ ఎన్నికలూ జరగవని టీఎన్ శేషన్ 17 పేజీల ఆర్డర్స్ జారీ చేయడం ఆరోజుల్లో ఒక సంచలనం. ఆయన ఏ పదవిలో పనిచేసినా ఆ విభాగం పనితీరును ఎంతగానో మెరుగుపరిచేవారు. సంచలనాలతో అదే స్థాయిలో వివాదాలతో ఆరేళ్ళు ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహించిన టీఎన్ శేషన్ ప్రథమ వర్ధంతి నేడు.