ఒక యాక్సిడెంట్ కేసులో రైలింజన్ ను సీజ్ చేశారు అస్సాంలోని అటవీశాఖ అధికారులు. అదేమైనా చిన్నా చితకా వాహనమా సీజ్ చేయడానికి..అనుకుంటున్నారా.. కానీ అటవీ అధికారులుకు రైల్ ఇంజిన్ సీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. దానికి కారణం ఒక యాక్సిడెంట్.
వివరాల్లోకి వెళితే సెప్టెంబర్ 27 వ తేదీ అర్ధరాత్రి రైలు పట్టాలు దాటుతున్న ఓ ఏనుగుతో పాటు దాని పిల్లను కూడా రైలు ఇంజిన్ బలంగా ఢీకొట్టడంతో పాటు కిలోమీటర్ దూరం వరకూ ఏనుగులను ఈడ్చుకుని వెళ్ళింది. దీంతో ఆ రెండు ఏనుగులు మృతిచెందాయి. దాంతో అస్సాం అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా రైల్ ఇంజిన్ కూడా సీజ్ చేశారు. అవసరం అయినప్పుడు ఇంజిన్ ను తమకు అప్పగించాలని రైల్వే అధికారులకు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
రైలు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సిన మార్గంలో 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు తేలడంతో లోకోపైలట్, అసిస్టెంట్ లోక్‌పైలట్‌ను ఈశాన్య సరిహద్దు రైల్వే(ఎన్‌ఎఫ్‌ఆర్) సస్పెండ్ చేసింది. రైల్వే అధికారులు చేసిన విచారణలో కూడా రైలింజన్ 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు తేలింది. కాగా వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఈ కేసుపై విచారణ జరుపుతున్నట్లు అటవీశాఖ ఉన్నతాధికారి రాజీవ్‌దాస్ వెల్లడించారు.