iDreamPost
android-app
ios-app

పొంగుతున్న వాగులు.. రాకపోకలకు ఇబ్బందులు

  • Published Aug 13, 2020 | 8:02 AM Updated Updated Aug 13, 2020 | 8:02 AM
పొంగుతున్న వాగులు.. రాకపోకలకు ఇబ్బందులు

వర్షాల ప్రభావానికి వాగులు పొంగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రా బోర్డర్‌లోని వాగులు, వంకలకు వరద ముంచెత్తుతోంది. దీంతో ఆంధ్రా–ఒరిస్సాల మధ్య జాతీయ రహదారిపైకి నీరు చేరుకుంది. చింతూరు మండలం కుయిగూరు వాగుకు వరదపొంగుకు రావడంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపుగా అన్ని వాగులకు వరదనీరు వస్తుండడంతో లోతట్టు గ్రామాల్లోకి కూడా రాకపోలకు వీలు కావడంలేదు.

ఆంధ్రా ఏజెన్సీలోని కూనవరం పరిధిలోని శబరి, గోదావరిలకు వరదపోటు తగిలింది. దీంతో కొండ్రాజుపేట, బోదునూరు సమీపంలోని వాగుల్లో కూడా నీటిమట్టం పెరగడంతో వాటికి సమీపంలో ఉన్న గిరిజన గ్రామాల్లోకి రాకపోలకు నిలిచిపోయాయి. రోడ్లతో సమానంగా ఉండే కల్వర్టుల మీదుగా దాదాపు అది అడుగుల ఎత్తువరకునీరు పారుతోందని స్థానికులు చెబుతున్నారు. నిరంతరంగా వర్షాలు పడుతుండడంతో గిరిజన గూడేల్లో వంట చెరుకుకు లభించక ఇబ్బందులు పడుతున్నారు.

కాగా ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 34.1 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఎగువవ ప్రాంతాల్లో నుంచి ఇంకా వరదనీరు వచ్చేందుకు అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద మరింతగా గోదావరికి వరద పెరగనుందంటున్నారు. పోలవరం, ధవళేశ్వరం తదితర దిగువ ప్రాంతాలకు కూడా గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. భద్రాద్రి పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద 11 గేట్లు ఎత్తివేసారు. 32,885 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

ధవళేశ్వరం వద్ద గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 3000, 2150, 5000 క్యూసెక్కుల చొప్పన నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి 4.05 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. అంటే రోజుకు దాదాపు 38 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.