Idream media
Idream media
కరోనాను ఎలా కట్టడి చేయాలో తెలియక ఇతర రాష్ట్రాలు తికమకపడుతూ మళ్లీ లాక్‌డౌన్ పెట్టాలనే ఆలోచన చేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ పకడ్బంధీ వ్యూహంతో ముందుకు వెళుతోంది. వైరస్ వ్యాప్తిని వీలైనంత మేరకు అరికట్టడంతోపాటు వైరస్ సోకిన వారికి వైద్య సేవల్లో ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తూ ప్రజలకు భరోసా ఇస్తోంది. ఒక వేళ వైరస్ సోకినా తమకేదీ కాదనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది. వైరస్‌ను ఎదుర్కొవడానికి కావాల్సిన ఆత్మసై్థర్యం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ద్వారా ప్రజలకు కలుగుతోందని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. దేశ, విదేశాల్లో ఉన్న ఏపీ వాసులు ఇప్పుడు తమకు సురక్షితమైన ప్రాంతం ఏపీనేని భావిస్తున్నారంటే జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలే కారణమని చెప్పవచ్చు.
వైరస్ వ్యాప్తి రాబోయే రెండు నెలల్లో ఇంకా పెరుగుతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఏపీ సర్కార్ తాజాగా చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్లను (సీసీసీ) ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం జిల్లాకు కనీసం 1000 బెడ్లు సిద్ధం చేస్తోంది. జిల్లాలో రెండు లేదా మూడు చోట్ల ఈ వెయి బెడ్లు పాజిటివ్ రోగులకు చికిత్స చేసేందుకు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే ప్రతి జిల్లాలో కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం దానికి అదనంగా ఈ కోవిడ్ కేర్ సెంటర్లు పని చేయనున్నాయి.
స్వల్ప, మధ్య స్థాయి లక్షణాలతో కరోనా సోకిన వారు ఇళ్లలోనే చికిత్స తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. 10 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు వారు మాత్రమే ఇళ్లలో చికిత్స తీసుకోవచ్చు. వారికి టెలిమెడిసిన్ ద్వారా ఉచిత వైద్యం అందిచడంతోపాటు సీసీసీ కో ఆర్డినేటర్లు ప్రత్యకంగా పర్యవేక్షించనున్నారు. 10 ఏళ్ల లోపు, 60 ఏళ్లు పై బడిన వారు మాత్రం ఎలాంటి లక్షణాలున్నా సరే సీసీసీలో చికిత్స అందించనున్నారు.
తీవ్ర స్థాయి లక్షణాలతోపాటు దీర్ఘకాలిక, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఏ వయస్సు వారైనా, స్వల్ప, మధ్య స్థాయి లక్షణాలు ఉన్నా కోవిడ్ కేర్ సెంటర్‌కు చికిత్స కోసం రావాల్సి ఉంటుంది. వైద్యుల పర్యవేక్షణలో వీరికి చికిత్స అందిస్తారు. ఇక్కడే ఈసీజీ, ఎక్స్‌రే, ఇతర పరీక్షలు చేసేందుకు అవసరమైన ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సీసీసీ రాష్ట్ర ప్రత్యేక కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.
ఇంట్లో ఉన్న ఐసోలేషన్ రోగుల పల్స్, బీపీ, ఎస్పీఓ 2 (ఆక్సిజన్ శాతం), బ్లడ్ షుగర్ లెవెల్స్ తమను తాము పరీక్షలు చేసుకొని పర్యవేక్షించుకోవాలని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆ ప్రాంతానికి చెందిన కోవిడ్ సెంటర్, ఏఎన్ఎం ద్వారా అతడికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న ఐసోలేషన్ రోగులను పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన టెలీ కన్సల్టేషన్ కేంద్రాలు పనిచేయనున్నాయి. ఇవి కరోనా బాధితులను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు న్యూట్రిషన్, సైకలాజికల్ మద్దతు కోసం మార్గదర్శకత్వం కూడా ఇవ్వనున్నాయి. ఇంట్లో ఐసోలేషన్ ఉన్న రోగికి కష్టం కలిగితే, అతడిని మరింత మెరుగైన చికిత్స కోసం కోవిడ్ ఆస్పత్రులకు తరలించనున్నారు. ఇంటి ఐసోలేషన్ 28 రోజుల్లో పూర్తి చేసిన తర్వాత కోవిడ్ పరీక్ష స్వయంగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం బాధితులకు ఏఎన్ఎం సహాయం చేసేలా ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేసింది.