iDreamPost
iDreamPost
మొన్న దసరా పండగ సందర్భంగా సితార సంస్థ పవన్ కళ్యాణ్ తో తీయబోయే తమ 12వ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మలయాళం బ్లాక్ బస్టర్ అయ్యప్పనుం కోషియం రీమేక్ అని చెప్పనప్పటికీ దర్శకుడిగా సాగర్ చంద్రను ఫిక్స్ చేయడంతో ఇంకే అనుమానాలు లేనట్టే. ఎప్పుడో హక్కులు కొన్న సదరు బ్యానర్ దీన్ని కాదని ఇంకో కథతో ముందుకు వెళ్లే అవకాశం ఇప్పటికిప్పుడు లేదు. అందులోనూ ఈ రీమేక్ కు భారీ బడ్జెట్ అక్కర్లేదు ప్లస్ తక్కువ లొకేషన్లలో వేగంగా పూర్తి చేయొచ్చు. అందుకే క్రిష్ ప్రాజెక్ట్ కన్నా ముందే దీన్ని తెరకెక్కించమని పవన్ చెప్పినట్టుగా అంతర్గత సమాచారం. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మిగిలాయి.
ముందుగా టైటిల్. చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో మోహన్ బాబుతో కలిసి నటించిన యాక్షన్ సూపర్ హిట్ మూవీ బిల్లా రంగానే దీనికి ఫిక్స్ చేయబోతున్నట్టు తెలిసింది. అయితే అఫీషియల్ గా చెప్పడానికి ఇది సమయం కాదు కాబట్టి ఇంకా క్లారిటీ లేదు. ఈగోలతో గొడవలు పడే కథ కనుక ఇది యాప్ట్ అనే చెప్పొచ్చు. ఒరిజినల్ వెర్షన్ లో పవన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు లవ్ ట్రాక్ ఉండదు. భార్య పాత్రలో హీరోయిన్ ఉంటుంది. అది కూడా హక్కుల కోసం పోరాడే వనితగా ప్రత్యేకంగా డిజైన్ చేశాడు దర్శకుడు. ఇప్పుడీ రోల్ కోసం సాయి పల్లవిని అనుకున్నట్టుగా వినికిడి. తను విన్నది కానీ ఇంకా ఓకె చెప్పిందా లేదా అనే క్లారిటీ రావాల్సి ఉంది.
మరో అసలైన ప్రశ్న రెండో హీరోగా ఎవరు నటిస్తారనేది. ముందు రవితేజ అన్నారు. తర్వాత రానా పేరు వినిపించింది. ఫ్రెష్ గా లిస్ట్ లో పవన్ వీరాభిమాని నితిన్ ఉండొచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి. కథ ప్రకారం ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురిలో ఎవరు చేసినా పెద్దగా రిస్క్ ఉండదు. కాకపోతే ఈ పాత్రే కాస్త నెగటివ్ షేడ్స్ తో కనిపిస్తుంది. అందులోనూ సెకండ్ హాఫ్ లో పోలీస్ క్యారెక్టర్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకునే ఎవరైనా ఓకే చెప్పాల్సి ఉంటుంది. అందుకే బిల్లారంగా టీమ్ వీటన్నంటి మీద హోమ్ వర్క్ చేస్తోందట. మరోవైపు తమన్ త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది.