నిన్నంతా ఉప్పెన మాయలో పడిపోయి ఇంకేదీ పట్టించుకోలేదు కానీ మరో సినిమా ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ కూడా దాంతో పాటే విడుదలయ్యింది. హీరో కాని హీరో పాత్రలో జగపతిబాబు నటించడంతో అంత క్రేజ్ రాలేదు కానీ ట్రైలర్ చూసినవాళ్లకు మాత్రం ఇదేదో ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టు అనే యాంగిల్ లో కొంత ఆసక్తి రేపింది. కిషోర్ మద్దాలి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామిలతో పాటు మరో చిన్న బేబీ కీలక క్యారెక్టర్లు పోషించిన ఎఫ్సియుకెకు భీమ్స్ సంగీతం అందించారు. మరి ఉప్పెన ప్రవాహంలో కొట్టుకుపోయేలా కనిపించిన ఈ సినిమా ఎలా ఉందో జనాన్ని మెప్పించేలా ఉందో లేదో సింపుల్ రిపోర్ట్ లో చూసేద్దాం
కండోమ్స్ కంపెనీ ఓనర్ అయిన ఓ పెద్దాయన లేట్ వయసులో ఓ సెక్స్ వర్కర్ వల్ల మళ్ళీ తండ్రవుతాడు. ఇంటర్వెల్ నుంచి ఈ ఎపిసోడ్ తోనే ఈ మహత్తర చిత్ర రాజం కంటిన్యూ అవుతుంది. కొడుకు ప్రేమకథ ఒకవైపు ఇతగాడి బిడ్డతో ట్రాక్ మరోవైపు వెరసి ఓ బూతుని అక్షరాలు మార్చి చాలా తెలివిగా టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా రకరకాలుగా సాగుతుంది. సరే లైన్ ఎలా ఉన్నా చెప్పే విధానం బాగుంటే ఆదరణ దక్కుతుందని చాలా సార్లు రుజువయ్యింది కదా. కానీ ఇందులో దర్శకుడు అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. చిత్ర విచిత్రమైన సన్నివేశాలు, అర్థం లేని బూతు కంటెంట్ తో చివరిదాకా ఓపికకు పరీక్ష పెట్టాడు.
ఇంతోటి కథకు నిడివి 2 గంటల 50 నిమిషాలంటే నమ్మడం కష్టమే. కానీ అదే నిజం. అసలు ఏ నమ్మకంతో ఎడిటర్ తో పని లేకుండా తీసిన ఫుటేజీని మొత్తం ఇలా ప్రేక్షకుల పైకి రుద్దారో అర్థం కాదు.రెండు గంటలు ఉంటేనే భరించడం కష్టమనే ఈ ప్లాట్ కు అదనంగా అరవై నిముషాలు జోడించిన దర్శక రచయితలకు వీర తాళ్లు వేయాల్సిందే. క్రియేటివిటీ అంటే మన మెదడులో ఉన్న చెత్తనంతా తెరమీద చూపడం కాదని కొందరు ఇప్పటి తరం దర్శకులు తెలుసుకోవాలి. లేదంటే గంటకే బయటికి వచ్చేసి ఇలాంటి వాటిలో నటించిన ఆర్టిస్టుల సినిమాలన్నింటి మీద పబ్లిక్ నెగటివ్ అభిప్రాయం ఏర్పరుచుకునే ప్రమాదం ఉంది.