iDreamPost
iDreamPost
భారతీయ ఐటీ ఇండస్ట్రీ పితామహుడిగా భావించే, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఫకీర్ చంద్ కోహ్లి కన్నుమూసారు. ఆయన వయసు 96 ఏళ్లు. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ ఫౌండర్, మొదటి సీఈవోగా విశిష్ట సేవలు అందించిన ఫకీర్ చంద్ కోహ్లీ భారత్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించారు. 1991లో లెజెండరీ ఐటి కంపెనీ ఐబీఎం సంస్థను భారత్‌కు తీసుకురావడంలో ఆయన పాత్ర మరువలేనిది. టాటా-ఐబీఎం జాయింట్ వెంచర్ ద్వారా భారత్‌లో హార్డ్‌వేర్ తయారీని ప్రారంభించేందుకు కృషి చేశారు.
1924 మార్చి 19న బ్రిటిష్ ఇండియా ప్రస్తుత పాకిస్తాన్లోని పెషావర్ లో జన్మించిన ఫకీర్ చంద్ కోహ్లి అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. లాహోర్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలోని ప్రభుత్వ కళాశాల నుండి బిఎ, బిఎస్సి విద్యను పూర్తిచేసి గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం 1948 లో క్వీన్స్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యారు. 1950 లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)నుండి తన MS పూర్తి చేసి 1951 సంవత్సరంలో భారత్ తిరిగి వచ్చి టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరారు. జేఆర్‌డీ టాటా ప్రోద్భలంతో 1969లో టీసీఎస్ ను ఏర్పాటు చేశారు ఆ తరువాత టీసీఎస్ మొట్టమొదటి సీఈవోగా నియమితులయ్యారు. 1996లో టీసీఎస్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
Also Read: మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్ చరిత్ర
1985 లో కోహ్లీ కు సింగపూర్ కంప్యూటర్ సొసైటీ ఫెలోషిప్ గౌరవం లభించింది. 1973-74 సంవత్సరాలలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ డైరెక్టర్ల బోర్డులో ఇండియా కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నారు . ఆ తరువాత కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలు అందించారు. 1976 లో సింగపూర్‌లో జరిగిన ప్రాంతీయ కంప్యూటర్ కాన్ఫరెన్స్‌కు చైర్మన్ గా, 1988 ఢిల్లీలో జరిగిన ప్రాంతీయ కంప్యూటర్ కాన్ఫరెన్స్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 1989 లో, కోహ్లీ సౌతీస్ట్ ఆసియా రీజినల్ కంప్యూటర్ కాన్ఫెడరేషన్కు సలహాదారుగా నియమితులయ్యారు. 1995-96 మధ్యకాలంలో ఐటీ రంగ మండలి నాస్కామ్‌కు ప్రెసిడెంట్‌గానూ వ్యవహరించారు. తన 75 సంవత్సరాల వయసులో 1999 లో పదవీ విరమణ పొందారు.
Also Read: సగం బడ్జెట్ ! ఆచరణ దూరంలో పార్టీల గ్రేటర్ హామీలు
భారత్‌లో ఐటీ ఇండస్ట్రీని 100 బిలియన్ డాలర్లకు పెంచిన ఘనత ఆయనకు దక్కుతుంది. రిటైర్మెంట్ తరువాత ఓ ఇంటర్వ్యూలో ఎఫ్‌సీ కోహ్లీ మాట్లాడుతూ తాను ఐటీ రంగానికి దూరం కాలేదని టెక్నాలజీ అనేది ఓ నదీ ప్రవాహం లాంటిదని అది కొనసాగుతూనే ఉండాలని. దీన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చని పేర్కోన్నారు. కోహ్లీ రిటైర్మంట్ తరువాత అక్షరాస్యత ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వయోజన విద్య మీద దృష్టి పెట్టారు. వివిద కారణాల వలన విద్యకు దూరమైన వయస్సు మళ్ళిన వారి చేత మళ్ళీ పలకా బలపం పట్టించారు. ఐటీ రంగంలో భారతీయ టెక్నాలజీ విప్లవానికి పునాదులు వేసిన కోహ్లీ మరణంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఐటీ రంగానికి కోహ్లీ చేసిన సేవలు మరవలేనివని, ఈ దేశానికి చెందిన రాబోయే అనేక తరాల ఐటీ నిపుణలు కోహ్లికి రుణపడి ఉంటారంటూ యావత్ ఐటీ రంగం ఆయన మరణానికి నివాళి అర్పించింది.