iDreamPost
iDreamPost
దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన రైతు ఉద్యమానికి కేంద్రం వెనక్కి తగ్గింది. పంజాబ్, హర్యానా సహా ఉత్తరాది రాష్ట్రాల రైతులు సాగించిన పోరాటానికి ప్రధాని మోడీ క్షమాపణలు కూడా చెప్పారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న సంగ్రామంలో తొలుత బెట్టు చేసినా చివరకు ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. అయితే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేందుకు ముందుకు వచ్చినప్పటికీ రైతు ఉద్యమం మాత్రం ఆగలేదు. తొలుత పార్లమెంట్ లో ఈ చట్టాల రద్దు ప్రక్రియ పూర్తి చేయాలని, ఉద్యమంలో చనిపోయిన వారిని ఆదుకోవాలని, కేసులు ఎత్తివేయాలని పలు డిమాండ్లు ముందుకు తెచ్చారు. అన్నింటికీ మించి కనీస మద్ధతు ధర చట్టబద్ధం చేసేందుకు చట్టాన్ని తీసుకురావాలని మెలిక పెట్టారు. కేంద్ర విద్యుత్ చట్టం ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా ఉద్యమం ప్రారంభించిన నాటి నుంచి ఈ అంశాలను తమ డిమాండ్లలో ఉంచారు. అయితే ఉద్యమం ప్రధానంగా ఆ మూడు చట్టాలకు సంబంధించినదే కాబట్టి చర్చ వాటి చుట్టూ తిరిగింది. కేంద్రం కూడా వాటి వరకే స్పందించింది. అయినప్పటికీ ఇప్పుడు మిగిలిన డిమాండ్లను ముందుకు తీసుకురావడం చర్చనీయాంశం అవుతోంది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికల ముంగిట మోడీ ప్రభుత్వం దిగివచ్చినప్పటికీ రైతు ఉద్యమ నేతలు మాత్రం ససేమీరా అంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. కిసాన్ మోర్చాలోని కొన్ని సంఘాలకు భిన్నాభిప్రాయాలున్నప్పటికీ నేటికీ ఉద్యమంలో కొనసాగుతున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది.
మోడీ ప్రభుత్వం ఈ చట్టాల విషయంలో ఉపసంహరణకు సిద్ధపడి, చివరకు క్షమాపణలు కూడా చెబుతుందని ఎవరూ ఊహించలేదు. అయినా రైతు సంఘాలు ఉద్యమం ఉపసంహరించుకోకుండా మరిన్ని డిమాండ్లు ముందుకు తీసుకురావడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే కనీస మద్ధతు ధర చట్టం కోసం 2011లోనే నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ అప్పటి ప్రధానిని కలిశారు. ముఖ్యమంత్రుల బృందంతో కలిసి ఆయన ఈ డిమాండ్ చేశారు. కానీ ఆ తర్వాత ప్రధాని బాధ్యతల్లోకి వచ్చి ఏడేళ్లయినా దానికి ఆయన సిద్ధం కాకపోవడం ఈ ఉద్యమ డిమాండ్ కి కారణమవుతోంది.
దేశంలో ప్రస్తుతం 23 ప్రధాన పంటల్లో 21 పంటలకు కనీస మద్ధతు ధర అమలు కావడం లేదని కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. ముఖ్యంగా దేశం పప్పు దినుసులు, నూనె గింజల్లో దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తోంది ఆయా పంటలకు ఎంఎస్పీ ఉంటే సాగు పెరగడమే కాకుండా, దేశానికి ఉపయోగపడుతుందని రైతు సంఘాల వాదన.
కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎంఎస్పీ విషయంలో దిగివచ్చే సూచనలు ప్రస్తుతానికి కనిపించకపోవడంతో రైతు ఉద్యమ భవిష్యత్తు ఏంటన్నది కీలకంగా మారింది. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న నిరసనలకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా దేశమంతా రైతు సంఘాలు వివిధ రూపాల్లో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. దాంతో తదుపరి కనీస మద్ధతు ధర చట్టం డిమాండ్ ఏ రీతిలో సాగుతుందన్నది దేశంలో రైతుల భవితవ్యాన్ని నిర్దేశించబోతోంది.
Also Read : New Farm Act – సాగు చట్టాల రద్దుకు తొలి అడుగు పడింది…