iDreamPost
android-app
ios-app

చ‌ర్చ‌లకు రైతు సంఘాలు సిద్ధం.. కానీ అజెండా అదే..!

చ‌ర్చ‌లకు రైతు సంఘాలు సిద్ధం.. కానీ అజెండా అదే..!

ఎముక‌లు కొరికే చ‌లిలోనూ ఉద్య‌మ వేడి పుట్టిస్తున్నారు రైతులు. 30 రోజులుగా నిరస హోరు కొనసాగిస్తున్నారు. ఉద్య‌మ తీవ్ర‌త‌కు మోడీ స‌ర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్ప‌టికే ఐదు సార్లు చ‌ర్చ‌లు జ‌రిపినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో మ‌రో సారి చ‌ర్చ‌ల‌కు వ‌ర్త‌మానం పంపింది. కేంద్రం లేఖ‌పై కొద్ది రోజులుగా అంత‌ర్గ‌త స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్న రైతులు సంఘాలు ఎట్ట‌కేల‌కు ఓ నిర్ణ‌యం తీసుకున్నాయి. కేంద్రంతో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మేన‌ని చెప్పాయి. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు సంబంధిత వర్గాలతో చర్చించేందుకు తాము సిద్ధమని ప్రకటించాయి. గ‌తంలో మాదిరిగానే ఇప్పుడు కూడా త‌మ ప్ర‌ధాన ఎజెండా కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ క్రమంలో చ‌ర్చ‌ల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది. కేంద్రం కూడా దీన్ని ఇంకా సాగ‌దీయ‌కూడ‌ద‌నే ఉద్దేశంలో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

చ‌ర్చ‌ల‌కు అంగీక‌రించిన రైతు సంఘాలు తమ ఎజెండాకు సంబంధించి నాలుగు అంశాలతో కూడిన లేఖను కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శికి పంపించాయి. ఈ మేరకు… ‘‘కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై చర్చ జరపాలి. జాతీయ రైతు కమిషన్ సూచించిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్‌కు సవరణలు చేయాలి. ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుంచి రైతులను మినహాయించాలి. అదే విధంగా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ‘విద్యుత్ సవరణ బిల్లు 2020’ ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయడంపై చర్చించాలి’’ అని లేఖలో తమ డిమాండ్లను పొందుపరిచాయి.

దేశ రాజధాని సరిహద్దులో సుమారు నెల రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాతలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. రైతు డిమాండ్లను నెరవేర్చాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు రైతు సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి చర్చలకు ఆహ్వానించగా, రైతులు ఈ మేరకు సానుకూలంగా స్పందించారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు త‌ప్పా.. వేరే ఆప్ష‌న్ లేద‌ని గ‌తంలో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో కూడా రైతు సంఘాలు చెప్పాయి. ర‌ద్దు మాత్రం కుద‌ర‌ద‌ని మ‌రిన్ని స‌వ‌ర‌ణ‌లు సూచిస్తే ప‌రిశీలిస్తామ‌ని కేంద్ర ప్ర‌తినిధులు తెలిపారు. స‌యోధ్య కుద‌ర‌క‌పోవ‌డంతో చ‌ర్చ‌లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. ఇప్పుడు కూడా రైతు సంఘాల ఎజెండాలో చ‌ట్టాల ర‌ద్దు ప్ర‌ధానంగా ఉంది.. ఈ క్ర‌మంలో చ‌ర్చ‌లు ఎలా జ‌రుగుతాయ‌నేది దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది.