iDreamPost
android-app
ios-app

Chandrababu – బాబు ఏ అవకాశం వదులుకోవడం లేదుగా..?!

  • Published Nov 19, 2021 | 1:22 PM Updated Updated Mar 11, 2022 | 10:34 PM
Chandrababu – బాబు ఏ అవకాశం వదులుకోవడం లేదుగా..?!

ఎప్పుడెప్పుడు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల దృష్టిలో పడదామా అని పరితపించిపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామంటూ స్పందించడం ద్వారా బీజేపీ దృష్టిలో పడడానికి ఆయన ప్రయత్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటనను విడుదల చేశారు.

కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులు ఇన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా మద్దతు తెలుపకుండా, ప్రభుత్వ చర్యను ఖండించకుండా మౌనం వహించిన బాబు ఇప్పుడు ఏకకాలంలో అటు రైతులను, ఇటు బీజేపీ పెద్దలను సంతృప్తి పరచడానికి అన్నట్టు వెంటనే స్పందించారు. రైతుల ఆందోళనలను గుర్తించి చట్టాలను వెనక్కు తీసుకోవడం సముచితమన్నారు. రైతుల సంక్షేమానికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని, వాటి మీద దృష్టి పెడుతున్నామని ప్రధాని చెప్పడం అభినందనీయమని మోదీని మెచ్చేసుకున్నారు. పనిలో పనిగా అమరావతి రైతుల పాదయాత్రను కూడా ప్రస్తావించి దానికి ఎప్పటిలా ప్రచారం కల్పించాలని యత్నించారు.

బాబుకు మూడే లక్ష్యాలు..

2019లో అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు మూడు లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా బీజేపీకి దగ్గరై రాష్ట్రంలో 2024లో అధికారం చేపట్టడం, తనయుడు లోకేశ్‌కు పట్టాభిషేకం చేయడం, అమరావతిని ఏకైక రాజధానిగా నిలపడం. ఈ లక్ష్యాల సాధనకు ఆయన రకరకాల ఎత్తులు వేస్తున్నారు. తన రాజ్యసభ సభ్యులను బీజేపీలో కలిపేయడం, కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనకపోవడం వంటి చర్యల ద్వారా వారికి దగ్గరవడానికి చేసిన యత్నాలు ఫలితం ఇవ్వలేదు. అందుకని ఇలా సందర్భం దొరికినప్పుడు వారిని మెచ్చుకుంటున్నారు.

Also Read : Chandrababu, AP Assembly – అసెంబ్లీకి రానప్పుడు రాజీనామా చేయొచ్చు కదా..? చంద్రబాబు ప్రశ్న ..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం, రాష్ట్రానికి ప్రత్కేక హోదా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేటుకు కట్టబెట్టడం, పెట్రో ధరలు పెంపు వంటి కేంద్ర నిర్ణయాలపై ఎప్పుడూ చంద్రబాబు స్పందించలేదు. అందుకే ఇపుడు సాగు చట్టాలపై రద్దుపై స్పందించడం కేవలం రాజకీయ ఎత్తుగడ అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

రైతుల పాదయాత్రకు పెద్ద స్థాయిలో సంఘీభావం అట!

సందట్లో సడేమియాలా ఆంధ్రప్రదేశ్‌లో 34 వేల ఎకరాలు రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన రైతులు 700 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు 13 జిల్లాల నుంచి పెద్ద స్థాయిలో సంఫీుభావం వస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. అది రైతుల పాదయాత్ర కాదని, ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆందోళన అని వైఎస్సార్‌ సీపీ నేతలు, మూడు రాజధానులకు మద్దతుగా 400 రోజులకు పైబడి నిరసన దీక్షలు చేస్తున్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు చేస్తున్న విమర్శలకు ఆయన సమాధానం చెప్పడం లేదు.

చంద్రబాబు డబ్బు ఖర్చు పెట్టి దొంగ పాదయాత్రలు నిర్వహిస్తున్నారని వారు విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. 13 జిల్లాల నుంచి పెద్ద స్థాయిలో సంఫీుభావం వస్తోందని తరచుగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌, అనుంగు మీడియా ప్రచారం చేస్తున్నారు. కేవలం 29 గ్రామాలకు చెందిన కొందరి సమస్య అని రాష్ట్రంలో జనానికి ఎప్పుడో అర్థమైంది. అందుకే ఎవరూ పట్టించుకోవడం లేదు.

Also Read : Nellore ,Tdp Leader- మొన్న ఆత్మహత్యాయత్నం.. నిన్న అరగుండు, అర మీసం.. చర్చనీయాంశంగా మారిన టీడీపీ నేత!

పైగా విశాఖను పరిపాలనా రాజధాని చేయాలని అటు ఉత్తరాంధ్రలో, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని ఇటు రాయలసీమలో ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. వీటిని పట్టించుకోకుండా అమరావతి రైతుల మహా పాదయాత్రకు స్పందన ఆహో.. ఓహో అంటే ఎవరు నమ్ముతారు? పదే పదే అదే అబద్ధం చెబితే వాస్తవం అనుకుంటారనే గోబెల్‌ థీయరీని చంద్రబాబు ఫాలో అవుతున్నారు తప్ప ఆ పాదయాత్రను ఇతర జిల్లాల్లో ఎవరూ పరిగణలోకి తీసుకోవడం లేదన్న సంగతి ఆయనకూ తెలుసు. సినిమా ఇన్ని రోజులు ఆడింది అని పబ్లిసిటీ చేసినట్టు 100, 200.. 600.. 700 రోజులు అంటూ ప్రకటనలు చేస్తూ జనం దృష్టిని ఆకర్షించడానికి యత్నిస్తున్నారన్న వైఎస్సార్‌ సీపీ విమర్శలపై ఆయన ఎందుకు స్పందించడం లేదో?

మళ్లీ అవే లెక్కలు..

అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల ద్వారా ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్ల ఆస్తి సమకూరినట్టు అయిందని చంద్రబాబు మళ్లీ పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధితో 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు, ఉపాధి వస్తాయని లెక్క తేల్చారు.. కేంద్రం తరహాలోనే రాజధాని రైతుల ఆందోళనను ఏపీ ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని తెలిపారు. సాగు చట్టాలను ఉపసంహరించుకున్నట్టే మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్రం వెనక్కు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులపై స్పష్టమైన వైఖరితో ఉంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతుల పేరుతో కోర్టులో టీడీపీ వేసిన పిటీషన్లపై న్యాయ పోరాటం చేస్తోంది. అయినా పాదయాత్ర సూపర్‌హిట్‌ అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు శతవిధాలా యత్నిస్తున్నది ఎవరి ప్రయోజనం కోసమో సులభంగానే అర్థమౌతోంది. అయినా ఆయన పాత పల్లవినే మళ్లీ మళ్లీ అందుకుంటున్నారు.

Also Read : Rakesh Tikait – రాకేష్ తికాయత్.. మోదీ మెడలు వంచిన ఒకే ఒక్కడు