iDreamPost
iDreamPost
ఇటీవలి కాలంలో రాష్ట్రం పై అప్పుల భారం పెరిగిపోయింది అంటూ పలు విపక్షాలు ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే . ఇటీవల కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెటేతర అప్పులు లక్ష కోట్లు చేసింది అంటూ టీడీపీ పార్టీ నేతలు , కొన్ని మీడియా సంస్థలు నిర్విరామంగా వార్తలు ప్రచురించాయి .
అయితే ఇందులో నిజం ఎంత , వైసీపీ అంత తీవ్ర స్థాయిలో అప్పులు చేసిందా , అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేసిన అప్పులెన్ని , గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రం పై మోపిన అప్పులెన్ని , FRBM పరిధి బయట టీడీపీ హయాంలో చేసిన అప్పులెన్ని , అధికారం కోల్పోయేనాటికి చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా తర్వాత ప్రభుత్వం పై మోపిన భారం ఎంత , ఇప్పటివరకూ ఎవరూ దృష్టి సారించని అంశం అయిన స్థానిక సంస్థల నిధుల దుర్వినియోగం వెనుక ఎవరి పాత్ర ఉంది అనేది కూలంకషంగా విశ్లేషిస్తే కళ్ళు చెదరక మానవు .
ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి FRBM(బడ్జెట్ ) పరిధిలో ఉమ్మడి రుణభారంలో ఏపీ వాటాగా 58 శాతం 86340 కోట్ల రూపాయల అప్పు నిర్ణయించగా 2019 లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి అది 2,48,000 కోట్లకు చేరుకొంది . ఇది కాక బడ్జెట్ పరిధి వెలుపల వివిధ కార్పొరేషన్ల పేరిట 64,000 కోట్ల మేర అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం దీనితో పాటు గుత్తేదార్లకు , వివిధ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు 48,000 కోట్ల రూపాయల మేర చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం పై ఆ భారం నెట్టేసి పోయింది . ఇదీ స్థూలంగా చూస్తే టీడీపీ హయాంలో మనకు కనపడుతున్న అప్పు .
FRBM పరిధి వెలుపల వివిధ కార్పొరేషన్ల పేరిట ఎడాపెడా అప్పులు చేసిన బాబు ఇందుకోసం నిబంధనలు అతిక్రమించి పలు అడ్డదారుల్లో ప్రయాణించారు . రహదారుల నిర్వహణ కోసం అంటూ రోడ్ కార్పోరేషన్ పేరిట అప్పులు తెచ్చిన బాబు ఆ నిధుల్ని దారి మళ్లించి ఎన్నికల తాయిలంగా పసుపు కుంకుమ అంటూ ఖర్చు పెట్టారు . లేని ప్రకృతి వ్యవసాయాన్ని zbnf(జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) అంటూ కాగితాల మీద చూపి BNP పరిబాస్ నుండి 15000 కోట్ల అప్పు సంక్షన్ చేయించుకొన్నారు . ఇందుకోసం ముందస్తు ప్రణాళికతో ప్రతి గ్రామంలో కట్టించి వృధాగా వదిలేసిన వర్మికంపోస్టు షెడ్స్ కోసం షుమారు వెయ్యి కోట్ల స్థానిక సంస్థల నిధులు బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది . ఇహ అమరావతి బాండ్ల పేరిట బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ లో నగారా భజాయించి మరీ ఏ రాష్ట్రమూ తీసుకోని పదిన్నర శాతం వడ్డీకి రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన బాబు ఇందుకు స్టాక్ ఎక్సేంజి కి కమిషన్ కూడా కట్టారు .
Also Read : మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యలో చంద్రబాబు..?
ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ పరిధి వెలుపల లక్ష కోట్ల రూపాయల పై చిలుకు అప్పులు చేసింది అంటూ టీడీపీ , అనుబంధ మీడియా విస్తృత ప్రచారం చేయగా ఇదే అంశం పై టీడీపీ ఎంపీ కనకమేడల పార్లమెంట్ లో ప్రశ్నించగా FRBM పరిధిలోని అప్పు కాకుండా వివిధ బ్యాంకుల నుండి ఏపీ ప్రభుత్వం 56 వేల కోట్ల మేర అప్పు చేసిందని కేంద్రం సమాధానం ఇచ్చింది .
అప్పు వాస్తవం కానీ గమనించాల్సిన అంశాలు..
టీడీపీ ప్రభుత్వం అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా అప్పులు చేసి నిధులు విస్తృతంగా దుర్వినియోగం చేయటమే కాకుండా , నీరు చెట్టు , కృష్ణా గోదావరి పుష్కరాలు , పదే పదే శంఖుస్థాపనలు , ప్రారంభోత్సవాలు , నిరర్ధకమైన దీక్షలు , పోరాటాలు , బిజినెస్ సమ్మిట్లు , విదేశీ యాత్రల వంటి కార్యక్రమాలతో అంతులేని అవినీతి ద్వారా తన కార్యకర్తలకు , నాయకులకు దోచిపెట్టటమే కాక అపరిమితమైన దుబారా చేశారు అన్నది జగమెరిగిన సత్యం .
ఫలితంగా టీడీపీ దిగిపోయేనాటికి రాష్ట్ర ప్రభుత్వం పై ఉన్న అప్పు మొత్తంగా 3,60,000 కోట్లకు చేరింది .
ఈ రుణభారం పై ప్రతి ఏడూ చెల్లించాల్సిన వడ్డీ భారం 20,000 కోట్ల పైమాటే . ఇది కాక అప్పులో ఏటా కొంతభాగం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది .
ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్థానిక సంస్థల నిధులు కాజేయటం ఒకెత్తు .
రాష్ట్రవ్యాప్తంగా 13371 గ్రామ పంచాయితీలు , 676 మండలాలు , 126 వరకూ కార్పోరేషన్ , మునిసిపాలిటీ , నగర పంచాయితీలు ఉండగా ప్రతి ఒక్క స్థానిక సంస్థకు సొంత ఆదాయ వనరులు జనరల్ ఫండ్ రూపంలో ఉండటంతో పాటు ఆర్ధిక సంఘాల ద్వారా , ఇతర పథకాల కింద కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఆయా సంస్థలకు కేటాయింపులు జరుగుతాయి . అయితే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ హెడ్ ఆఫ్ అకౌంట్ కి అనుసంధానం అయ్యి ఉంటాయి . స్థానిక సంస్థల తీర్మానం మేరకు పనులు జరిగి బిల్లుల చెల్లింపు జరిపేటప్పుడు స్థానిక సంస్థ నుండి cfms లో అప్లోడ్ చేసిన పిమ్మట ఉమ్మడి ఖాతా నుండి ప్రభుత్వం ఆయా మొత్తాన్ని రిలీజ్ చేస్తుంది .
2019 మే ముప్పైన వైసీపీ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు ఖాజానాలో 100 కోట్ల రూపాయల నిధులు మాత్రమే ఉన్నాయి . వచ్చే ప్రభుత్వానికి అప్పులు చేసే అవకాశం కూడా లేదు , అవకాశం ఉన్నంత మొత్తం అప్పులు మేమే చేసేసాం , వచ్చే ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేదు అని సాక్షాత్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వటం గమనార్హం .ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో వచ్చే ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేదు అని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సైతం వ్యాఖ్యానించారు .
Also Read : కర్నూలు టీడీపీలో నిశ్శబ్దం ఎటు దారి తీయనుంది?
చంద్రబాబు నాటికి ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉంటే ఏపీ ఖజానాకు అనుబంధంగా ఉన్న దాదాపు 14200 స్థానిక సంస్థల నిధులు ఏమయ్యాయి . లక్షల్లో ఉండాల్సిన పంచాయతీల నిధులు , కోట్లలో ఉండే మండల , మున్సిపాలిటీల నిధులు ఖజానాలో లేకుండా ఎక్కడికి పోయాయి . ఇవన్నీ కూడా దారి మళ్లించబడ్డాయి అనేది స్పష్టం . ఇవన్నీ క్రోడీకరిస్తే ఎంతవుతుందో ఆర్ధిక శాఖ నిపుణులు లెక్క గడితే కళ్ళు చెదిరేంత మొత్తం బాబు దుర్వినియోగం చేసిన వైనం బట్టబయలు అవుతుంది .
నాడు బాబు చేసిన పాప ఫలితంగా నేటికీ స్థానిక సంస్థలు అభివృద్ధి కార్యకలాపాలకు నిధులు లేక చేసిన బిల్లులు చెల్లించలేక కునారిల్లుతున్నాయి . ఎప్పటికప్పుడు వచ్చిన ఆదాయంతో అరాకొరాగా నెట్టుకొస్తున్నా తమ నిధులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఎప్పుడు వస్తాయా అని ప్రస్తుత ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నాయి .
ఇన్ని సమస్యల మధ్య అధికారం చేపట్టిన వైసీపీకి అప్పులు తేవడం తప్పనిసరి అయ్యింది . రైతు , డ్వాక్రా రుణమాఫీ హామీలు ఇచ్చిన బాబు చేసిన మోసం వలన పెరిగిపోయిన వడ్డీలతో కునారిల్లిన వ్యవసాయ , డ్వాక్రా రంగాలతో పాటు పలు వెనకబడ్డ వర్గాల కోసం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనకడుగు వేయకపోవడం , కొత్తగా ఇచ్చిన రెండున్నర లక్షల ఉద్యోగాల వలన జీతాల భారం పెరగడం , గడచిన రెండేళ్లలో కరోనా కారణంగా , లాక్ డౌన్ వలన దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ వ్యాపార రంగం దెబ్బతినడంతో ఆదాయం పడిపోవడం , గత ప్రభుత్వ అప్పుల పై వడ్డీ చెల్లింపు భారం వెరసి ఈ ప్రభుత్వానికి చుట్టుకొన్న తలనొప్పులు లెక్కకు మిక్కిలిగా తయారయ్యాయి .
సానుకూల అంశాలు ఏంటంటే గత ప్రభుత్వ హయాంలోలాగా విపరీత దుబారాకి పోకుండా , అవినీతికి పెద్దగా ఆస్కారం లేకుండా రూపాయి రూపాయి ఎంచి జాగ్రత్తగా ఖర్చు చేస్తుండటం , సంక్షేమ పథకాలతో పాటు , కొన్ని రంగాలకు ఇస్తున్న ఆర్ధిక చేయూతతో మార్కెట్ కోలుకోవడం వంటి పరిణామాలతో రాష్ట్ర ఆదాయం మెరుగు పడుతుండటం మంచి పరిణామం అని చెప్పొచ్చు .
గత ఏడాది ప్రస్తుత ఏడాది మార్చ్ , ఏప్రిల్ నెలల ఆదాయం పోల్చి చూస్తే రెండు సార్లు కరోనా కోరల్లో చిక్కుకొని ఉన్నా పోయినేడు కన్నా ఈ ఏడు మార్చ్ ఏప్రిల్ నెలల ఆదాయం రెండు వేల కోట్లు ఎక్కువ ఉండటం చూస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు చక్కబడతాయని ఆశించొచ్చు .
Also Read : టీడీపీలో కలకలం.. దర్శి ఇంఛార్జి పదవికి పమిడి గుడ్‌బై