దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మరోసారి జైలుపాలయ్యారు. నిన్న టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టను నిరసిస్తూ చింతమనేని ప్రభాకర్ ధర్నాకు దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. అనుమతి లేకుండా ధర్నా చేసిన చింతమనేని అరెస్ట్ చేసిన పోలీసులు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిన్న సాయంత్రం నుంచి స్టేషన్‌లోనే ఉంచారు. ఈ రోజు ఉదయం కోర్టులు తెరుకున్న వెంటనే చింతమనేని న్యాయస్థానంలో హజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది.
ఇటీవల చింతమనేని దాదాపు 50 రోజుల జైలు జీవితం గడిపి వచ్చారు. అధికారులతో దురుసుగా ప్రవర్తించడంతోపాటు పాత కేసుల్లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం మీద బెయిల్ పొందిన చింతమనేని 50 రోజుల తర్వాత విడుదలయ్యారు. తాజాగా మరోసారి 14 రోజులు జైలుపాలయ్యారు.
చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక దందాను అడ్డుకోబోయిన తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన తర్వాత చింతమనేనికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతకు ముందు వరకూ ఆయన పశ్చిమ గోదారి జిల్లాకే సుపరిచితులు, వనజాక్షిపై దాడి ఘటన సంచలనం కావడంతో చింతమనేని వార్తల్లో నిలిచారు. అప్పటి నుంచి ఆయన ప్రతి కదలిక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అబ్యయ్య చౌదరిపై చింతమనేని ఓడిపోయారు.