iDreamPost
iDreamPost
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం జరిగింది. బీజేపీకి మరోషాక్ తగిలింది. మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేసి వారం రోజులు కూడా గడవకుండానే మరో సీనియర్ నేత పార్టీ నుంచి బయటికి వచ్చారు. మాజీ మంత్రి, సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పెద్దిరెడ్డి చాలా రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితుల వల్ల బీజేపీలో కొనసాగేందుకు తన మనసు అంగీకరించడం లేదన్న ఆయన.. కాషాయ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండేళ్లు తనను పార్టీలో కొనసాగించినందుకు బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.
అసంతృప్తితోనే బయటికి..
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి 1994, 1999లో వరుసగా రెండుసార్లు గెలిచారు పెద్దిరెడ్డి. ఉమ్మడి ఏపీలో చంద్రబాబునాయుడు హయాంలో మంత్రిగానూ పని చేశారు. 2019 జూన్‌లో టీడీపీని వీడి బీజేపీలో చేరారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే అటు తెలంగాణలో, ఇటు హుజూరాబాద్‌లో రాజకీయ పరిణామాలు అనుహ్యంగా మారిపోయాయి. బీజేపీలోకి ఈటల రాక పెద్దిరెడ్డికి ఇబ్బందికరంగా మారింది. కనీసం తనతో చర్చించకుండానే ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చుకొన్నారని ఆయన పార్టీ నాయకత్వంపై బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలోనే ఉంటానని, అయితే ఈటలకు మద్దతు ఇవ్వబోనని కామెంట్ చేశారు. కానీ ఉన్నట్టుండి నిర్ణయం మార్చుకున్నారు. అయన రాజీనామాతో కరీంనగర్ రాజకీయాల్లో, బీజేపీలో చర్చనీయాంశమయ్యారు.
ఎటు వైపు దారి?
బీజేపీలోకి ఈటల రాకను తీవ్రంగా వ్యతిరేకించిన పెద్దిరెడ్డి.. పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ లో చేరుతారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేయడంతో ఆయన తర్వాత స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. అక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలబడ్డ ఈటల రాజేందర్.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి.. ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది కీలకంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ఇద్దరూ గతంలో టీడీపీలో పని చేసిన వారే. రెండు వైపులా ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతోంది. మరి పెద్దిరెడ్డి ఎటు వైపు వెళ్తారో తెలియాల్సి ఉంది. రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ తరఫున హుజూరాబాద్ అభ్యర్థిగా నిలబడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇవన్నీ కాకుండా స్వంతంత్ర అభ్యర్థిగా పోటీలోకి వస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read : ఆ సీనియర్ నేత బీజేపీలోనూ ఇమడలేకపోయారా..?