ఖాళీ మెదడు దెయ్యాల కొంపతో సమానమని ఒక సామెత ఉంది. తెలుగుదేశం నేతల్లో కొందరికి ఈ సామెత అతికినట్లు సరిగ్గా సరిపోతుంది. అధికారం రుచి మరిగిన నేతలు రెండున్నరేళ్లుగా చేతిలో అధికారం లేక.. అధికార పార్టీ, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకు పడదామంటే సరైన అంశాలు దొరక్క.. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతున్నారు. వారి ఖాళీ మెదళ్ళలోకి నిజంగానే దెయ్యాలు దూరి వారి నాలుకలను అడ్డదిడ్డంగా అష్టవంకర్లు తిప్పేస్తున్నాయి. మనసుకు ఏది తోస్తే అది వాగేసేలా చేస్తున్నాయి.
అధికారంలో లేమన్న ఫ్రస్ట్రేషన్లో తాము వాగుతున్న పిచ్చి ప్రేలాపనలు ప్రజల్లో తమను మరింత చులకన చేస్తున్నాయన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతోంది. మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు ఇటీవలి కాలంలో విచక్షణ మరిచి.. ఒళ్లు తెలియకుండా మాట్లాడుతుండటాన్ని ఆ పార్టీ కార్యకర్తలే తప్పు పడుతున్నారు. గౌరవనీయమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అనరాని మాటలు అనడం తగదని.. ఎంత ప్రత్యర్థులైనా సంస్కారయుతంగానే విమర్శలు చేయాలని అంటున్నారు.
విచక్షణ కోల్పోయి వికృత వాదం
రాజకీయ పార్టీలు.. అందులోనూ అధికార ప్రతిపక్షాలు అన్న తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు సహజం. గతంలో ఇవన్నీ పార్టీలపరంగా సైద్ధాంతికంగా జరిగేవి. రాను రాను రాజకీయాల్లో సిద్ధాంతాలు పోయి వ్యక్తిగత అంశాలు చొరబడ్డాయి. నాయకులు పరస్పరం వ్యక్తిగత అంశాలపై విభేదించుకోవడం గత కొంతకాలంగా సాగుతోంది. టీడీపీ నేతలు ఇటీవల మరింత హద్దు మీరారు. విచక్షణ కోల్పోతున్నారు. విమర్శలు చేయాలన్న ఆవేశంలో పత్రికల్లో రాయలేని, సభ్య సమాజం ఉచ్చరించడానికి సిగ్గుపడే పదజాలాన్ని బహిరంగంగానే ప్రయోగిస్తూ తమ నోటి దురద తీర్చు కుంటున్నారు.
గుంటూరు జిల్లా నకరికల్లులో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం స్థాయి నేతను ఉద్దేశించి వాడిన పదజాలాన్ని స్వయంగా ఆ పార్టీ శ్రేణులే తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. అసభ్య పదజాలంతో దూషించడం ద్వారా ప్రత్యర్థిని అవమానించడం మాట అటుంచి.. ముందు మనం ప్రజల్లో హీనమైపోతామని అంటున్నారు. సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన నేత ఉచ్చనీచాలు మరచి.. వాచాలత్వం ప్రదర్శించడం ఆయనకే నగుబాటు అని అంటున్నారు. ఆయన తీరువల్ల పార్టీ పట్ల ప్రజల్లోనూ చులకన భావం ఏర్పడుతుందని.. టీడీపీలో సంస్కారహీనులే నేతలుగా చెలామణీ అవుతున్నారన్న చులకన భావం ప్రజల్లో పాతుకు పోతుందని.. అది అంతిమంగా పార్టీకే చేటు చేస్తుందని వాపోతున్నారు.
మొదటి నుంచీ నోటి దురుసుతనం
తెలుగుదేశం నేతగా, మాజీమంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడికి తొలి నుంచీ చెయ్యి జోరు, నోటి దురుసుతనం ఎక్కువే. ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత అది మరింత ఎక్కువైంది. గతంలో నర్సీపట్నం మున్సిపల్ కమిషనరుగా ఉన్న మహిళా అధికారిపై ఇలాగే రెచ్చిపోయారు. దాంతో ఆమె అయ్యన్నపై కేసు కూడా పెట్టారు.
అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులను, తన కిందిస్థాయి నేతలు, కార్యకర్తలను బెదిరించడం, దుర్భాషలాడటం, చెయ్యి చేసుకోవడం చింతకాయల వారికి అలవాటే. కానీ అవన్నీ ఒకెత్తు.. తాజాగా ముఖ్యమంత్రి, హోంమంత్రిపై చేసిన దారుణమైన వ్యాఖ్యలు మరో ఎత్తు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై గుంటూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలయ్యాయి.