iDreamPost
android-app
ios-app

మాజీ సీఎం సతీమణి కన్నుమూత

మాజీ సీఎం సతీమణి కన్నుమూత

మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి కాసు రాఘవమ్మ ఆదివారం కన్నుమూసారు. వారి వయస్సు 97 సంవత్సరాలు. దాదాపు మూడు తరాలకు ప్రతినిధిగా రాఘవమ్మ సేవలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే రాఘవమ్మ భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి సేవలు ఎనలేనివని ఇప్పటిక్కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల స్థాపనకు కీలకంగా వ్యవహరించడంతో పాటు, ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రాంతాల అభివృద్ధికి ఇతోధికంగా ఆయన తోడ్పాటునందించారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో ఏర్పడ్డ అనేక ఇబ్బందులను పరిష్కరించడంలో బ్రహ్మానందరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా జరిగాయి. అలాగే మరికొన్ని కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో సైతం ఆయన చొరవ చూపించారు. బ్రహ్మానందరెడ్డి సహధర్మచారిణిగా రాఘవమ్మ సైతం వారి సేవలకు తన వంతు తోడ్పాటునందించారు. 1994 మే 20 కాసు స్వర్గస్తులయ్యారు. కాగా వారి సతీమణి రాఘవమ్మ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

కాసు రాజకీయ వారసుడు, తమ్ముడు వెంగళ రెడ్డి కుమారుడు కాసు కృష్ణారెడ్డి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసారు. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. కృష్ణారెడ్డి కుమారుడు, బ్రహ్మానందరెడ్డి వారి మూడో తరం వారసుడు కాసు మహేష్‌రెడ్డి గురజాల ఎమ్మెల్యేగా వైఎస్సార్‌సీపీ సీపీ నుంచి సేవలందిస్తున్నారు.