Idream media
Idream media
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలతో పాటు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విద్యావకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా ఉద్యోగావకాశాల్లోనూ 10% రిజర్వేషన్లు కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 2019లోనే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రిజర్వేషన్ల కేటగిరీలో లేని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కానీ, రాజకీయ దురుద్దేశాలతో చంద్రబాబు అమలుకు వెనుకడుగు వేశారు. ఫలితంగా పేదలు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వారికి మేలు జరగనుంది.
నాడు మార్గదర్శకాలకు విరుద్ధంగా బాబు..
రిజర్వేషన్ల కేటగిరీలో లేని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో విధాన నిర్ణయం తీసుకుంది. అదే స్ఫూర్తితో ఆ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాల్సిన అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరించారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయించిన 10 శాతం కోటాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా విభజించారు. అందులో 5 శాతం కాపు సామాజికవర్గానికి, మిగిలిన 5 శాతాన్ని ఇతర అగ్రవర్ణాల పేదలకు కేటాయిస్తూ అప్పట్లో టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాపు సామాజికవర్గ ప్రతినిధులతోపాటు రాజ్యాంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్ల స్ఫూర్తిని చంద్రబాబు దెబ్బతీశారని స్పష్టం చేశారు.
బాబు ఉత్తర్వులను కొట్టేసిన న్యాయస్థానం
తమను బీసీల్లో చేరుస్తామని మోసం చేసిన చంద్రబాబు ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు సరికొత్త మోసానికి తెర తీయడంపై కాపు సామాజికవర్గ నేతలు భగ్గుమన్నారు. అసలు తాము బీసీలమా? ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన వారమా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లను విభజించడాన్ని సవాల్ చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను విభజించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు నిలిచిపోయింది. చంద్రబాబు నిర్వాకంతో అటు కాపు సామాజికవర్గం, ఇటు ఆర్థికంగా వెనుబడిన ఇతర అగ్రకులాలు తీవ్రంగా నష్టపోయాయి.
నేడు చిత్తశుద్ధితో జగన్
అధికారం చేపట్టిన అనంతరం రాజ్యాంగ స్ఫూర్తితో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. న్యాయ నిపుణులతో చర్చించి వివాదాలకు తావులేని రీతిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా మొదట విద్యావకాశాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై మరింత కసరత్తు అనంతరం సమగ్రంగా విధివిధానాలను నిర్ణయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో విద్య, ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అర్హతలు ఇలా..
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కేటగిరీలలోకి రాని వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా రూ.8 లక్షల లోపు ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోస్టర్ పాయింట్లను తర్వాత ప్రత్యేకంగా నిర్ణయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కల్పించే పది శాతం రిజర్వేషన్లలో మూడో వంతు ఆ వర్గాలకు చెందిన మహిళలకు కేటాయిస్తారు. అర్హులైన వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించారు.