Idream media
Idream media
ఈ రోజు నేషనల్ ప్రెస్ డే అని ఆలస్యంగా తెలిసింది. కొన్ని వ్యవస్థల్ని మనం భరించలేం. అది లేకుండా బతకలేం. జర్నలిజం కూడా అంతే.
పోలీసుల్ని ఎంత విమర్శించినా మన ఇంట్లో దొంగలు పడితే మళ్లీ వాళ్ల దగ్గరికే వెళ్లాలి. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి మావోయిస్టులు అధికారంలోకి వచ్చినా ఈ పోలీసులతోనే రాజ్యం ఏలాలి.
జర్నలిజం ఎంత గొబ్బు పట్టినా (ఈ దుస్థితికి యాజమాన్యాలే ప్రధాన కారణం) మనకు ఏదైనా అన్యాయం జరిగితే ప్రెస్‌కి చెబితే తప్ప ఎవరికీ తెలియదు.
నా చిన్నతనంలో నిప్పాని రంగారావు అనే ఆయన ఆంధ్రప్రభ విలేకరిగా ఉండేవారు. ఆయన కొడుకు నా క్లాస్‌మేట్. ఈ రంగారావు సినీనటి జమునకి సొంత చిన్నాన్న కూడా. ఆయనకు ఆదాయం ఎంతో తెలీదు కానీ వాళ్లు ఎప్పుడూ బాగా బతికింది లేదు. కష్టాలే కష్టాలు.
45 సంవత్సరాల తర్వాత కూడా విలేకరుల బతుకులు మారలేదు. కార్మికుల కష్టాల గురించి పేజీల కొద్ది రాసే పత్రికలు తమ కలం కార్మికులకు మాత్రం కడుపు నిండా పెట్టవు. ఉదాహరణకు తిరుపతి లాంటి పట్టణంలో పనిచేసే కాంట్రిబ్యూటర్‌కి గట్టిగా రూ.10వేల లోపే వస్తుంది. ఆ డబ్బుతో అతను భార్యాపిల్లలతో బతకలేడు. ఈ జీతం కూడా తెలుగులో మూడు పత్రికలు మాత్రమే ఇస్తాయి. మన కమ్యూనిస్టు సోదరుల పత్రికల్లోనైతే ఉచిత చాకిరీనే.
జీతం ఇవ్వని పత్రికలు యాడ్స్ కోసం ఒత్తిడి పెడతాయి. ఆ యాడ్స్ మీద కమీషనే వాళ్ల జీతం. ఇది కాకుండా సర్క్యులేషన్ పెంచడం కూడా వీళ్ల పనే.
నేరం నాది కాదు, ఆకలిది అని సినిమా డైలాగ్ ఉంది. ఆ ప్రకారం యాజమాన్యాలు కడుపు నింపకపోగా, యాడ్స్, సర్క్యులేషన్ అని వేధింపులకు దిగడంతో వీళ్లు వేరే దారిలేక జనం మీద పడుతున్నారు.
వార్తలకి డబ్బు వసూళ్లు చేస్తున్నారు. ధర్నాకి ఒక రేటు, ఫొటోకి ఇంకో రేటు. సినిమా రిపోర్టర్లు ఐతే ఏం ఫీల్ కారు. స్పాట్‌లోనే కవర్ తీసుకుంటారు.
అందరినీ ఒకే గాట కట్టేయడం కరెక్ట్ కూడా కాదు. నిబద్ధతతో పనిచేసే వాళ్లూ ఉన్నారు. కానీ వాళ్ల శాతం తక్కువ. వసూల్ రాజాలే ఎక్కువ. ఈ రాజాల్లో కూడా అందరూ బాగా బతకరు. ఏదో ఇంటి ఖర్చుకి జరుగుబాటు చూసుకునే వాళ్లే ఎక్కువ.
కొందరు మాత్రం, వాళ్ల రూటే వేరు. ప్రభుత్వ పథకాలన్నీ ముందు వీళ్లకే చేరాలి. బ్యాంకుల రుణాలూ వీళ్లకే. పోలీస్‌స్టేషన్ల పంచాయితీల్లో వీళ్లే. రెవెన్యూ వసూళ్లు వీళ్ల చేతుల మీదే. దీనికితోడు నాయకుల పైరవీలు ఉండనే ఉంటాయి. ఇదంతా చైన్ సిస్టం. నీతులు చెప్పే యాజమాన్యాలు డబ్బులు ఇవ్వవు. ఆకలితో బతకలేడు కాబట్టి వార్తల్ని అమ్ముకోక తప్పదు. తమాషా ఏంటంటే విలేకరులు యజమానుల కోసం వార్తలు రాస్తే, యజమానులు నాయకులకి ఆ వార్తల్ని అమ్ముతారు.
న్యూస్ చానల్ష్ వచ్చిన తర్వాత మండల స్థాయిలో కూడా 25 మందికి పైగా విలేకరులు ఉన్నారు. ఒక నాయకుడు ధర్నా చేయాలంటే జనాన్ని తోలే ఖర్చు కంటే విలేకరుల ఖర్చే ఎక్కువవుతోంది.
దీంట్లో ఎవరినీ తప్పు పట్టడానికి లేదు. రాజకీయ వ్యవస్థ ఒక చెదపురుగు. అది అన్ని వ్యవస్థల్ని తినేస్తుంది.
ఇక డెస్క్ జర్నలిస్టుల పరిస్థితి ఇంకా ఘోరం. 15 ఏళ్ల సర్వీస్ నుంచి ఎడిషన్ ఇన్‌చార్జ్ హోదాలో ఉన్నవారి జీతం కూడా కొన్ని పత్రికల్లో రూ.25 వేలు దాటలేదు.
అయితే ఎంత చెడిపోయినా, కొందరు ఉంటారు. వాళ్లు ప్రాణాలకి తెగించి వార్తలు తెస్తారు. సత్యాన్ని వెలికి తీయడానికి రిస్క్ తీసుకుంటారు. కష్టాలు పడుతారు. వాళ్ల వల్లే నిజం ఇంకా బతికే ఉంది. లేకపోతే అబద్ధమే రాజ్యమేలేది.
అనివార్యంగా చెడిపోయిన జర్నలిస్టులున్నారు. ఆత్మ బలంతో కష్టాలకు ఎదురీది జర్నలిజాన్ని కాపాడే వాళ్లు ఉన్నారు. చీకట్లో దీపం వెలిగించే వాడు ఎప్పుడూ ఉంటాడు. వాడి వల్లే ఆ వ్యవస్థ బతికి ఉంటుంది.