అసలు సోషల్ మీడియాలో ఒక్క రోజైనా బ్రహ్మానందం ఎక్స్ ప్రెషన్ లేని మీమ్స్ ని ఊహించుకోగలమా. వాట్సప్ లో అతని స్టిక్కర్లు లేకుండా సరదా ఛాటింగ్ చేయగలమా. రోజు టీవీలో సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్లకు ఎప్పుడైనా బ్రహ్మి మొహం కనిపించని సందర్భం వచ్చిందా. ఇప్పటి జనరేషన్లో ఈ మూడు ప్రశ్నలను ఎవరిని అడిగినా దాదాపుగా లేదనే సమాధానమే వస్తుంది. దశాబ్దాల తరబడి తరంతో సంబంధం లేకుండా ఒక కుటుంబంలో 1991లో నాన్నను 2021లో కొడుకుని ఒకే స్థాయిలో నవ్వించగలిగే సామర్ధ్యం ఎవరికుందంటే అందులో మొదటగా వినిపించే పేరు బ్రహ్మానందం.
1956వ సంవత్సరం. ఫిబ్రవరి 1వ తేదీ. ఎక్కడో గుంటూరు జిల్లాలో చాగంటిపాలెం అనే చిన్న ఊరిలో బిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మినరసమ్మ గారు బహుశా ఊహించి ఉండరు. తన కొడుకు భవిష్యత్తులో తెలుగు సినిమా హాస్యాన్ని శాశించే స్థాయికి చేరుకుంటారని. పుత్రోత్సాహంతో పొంగిపోతున్న కన్నెగంటి నాగలింగాచారి గారు ఆకాశమంత ఎత్తుకు ఎదిగే తన వారసుడి భవిష్యత్తుని ఎలా ఊహించగలరు. కానీ తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం కొద్దీ బ్రహ్మానందం మనకు దక్కారు. ఒకటి కాదు రెండు కాదు వేయికి పైగా సినిమాలు చేసి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులను తన పేరుని నవ్వుతూనూ లిఖించుకున్నారు.
80వ దశకంలో తెరంగేట్రం చేసిన బ్రహ్మానందంది మొదటి సినిమా అహ నా పెళ్ళంట అనుకుంటారు కానీ నిజానికి ఆయన పరిచయమయ్యింది శ్రీ తాతావతారం చిత్రంతో. నరేష్ హీరో. వేజెళ్ళ సత్యనారాయణ దర్శకుడు. కానీ విడుదల ఆలస్యం కావడంతో దీని కన్నా ముందు జంధ్యాల గారి అహ నా పెళ్ళంట, సత్యాగ్రహం, రాగలీల రిలీజ్ కావడంతో అలా హాస్యబ్రహ్మ పరిచయం చేసిన ఆణిముత్యంగానే బ్రహ్మానందం ప్రస్థానం మొదలయ్యింది. అక్కడితో మొదలు ఆ నవ్వుల ప్రవాహం ధారలుగా మొదలై వరదగా మారి తెలుగు తెరను ముంచెత్తుతూ ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేస్తూనే ఉంది.
చిత్రం భళారే విచిత్రం, బావా బావా పన్నీరు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, శత్రువు, అసెంబ్లీ రౌడీ, క్షణక్షణం, సీతారత్నం గారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది, రాజేంద్రుడు గజేంద్రుడు, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్ ఇవన్నీ నిన్నటి తరానికి సంబంధించి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. అదుర్స్, రెడీ, ఢీ, నాయక్, ఇంద్ర, నువ్వు నాకు నచ్చావ్, సింహాద్రి, మల్లేశ్వరి, వెంకీ, దుబాయ్ శీను, పోకిరి ఇవన్నీ ఇప్పటి ఆడియన్స్ ఠక్కున చెప్పి కొన్ని మచ్చుతునకలు. తాను ఎమోషన్ తో కన్నీళ్లు కూడా పెట్టించగలనని అమ్మ, బాబాయ్ హోటల్, సోగ్గాడి పెళ్ళాం సినిమాలతో రుజువు చేశారు బ్రహ్మి. ఈ కారణం వల్లే బ్రహ్మానందం ఎవరికీ అందనంత హాస్య శిఖరాలను అవలీలగా అధిరోహించారు. ఆయన పుట్టినరోజున సోషల్ మీడియా ఓ సంబరంలా జరుపుకోవడం కన్నా కావాల్సింది ఓ నటుడికి ఇంకేముంటుంది.