iDreamPost
iDreamPost
దేశభాషలందు తెలుగు లెస్స అనేది పుస్తకాల్లో చదువుకోవడం వరకే పరిమితమయ్యింది కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఇప్పటి జనరేషన్ పట్టుమని ఒక తెలుగు పేపర్ కూడా అనర్గళంగా చదవలేని స్థితిలో ఉందన్న మాట చేదు వాస్తవం. పక్క రాష్ట్రాలు మాతృ బాషను కాపాడుకోవడానికి ఎంత తపిస్తున్నాయో చూస్తున్నాం. కోలీవుడ్ లో తమిళంలో సినిమా టైటిల్స్ పెట్టుకుంటేనే ప్రత్యేకంగా రాయితీలు ఉంటాయి. అందుకే ఎంత పెద్ద స్టార్ అయినా దాదాపు 90 శాతం పైగా ఆరవ చిత్రాలు అక్కడి లాంగ్వేజ్ లోనే సినిమాలకు పేర్లు పెట్టుకుంటాయి. కానీ మనదగ్గర మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ ట్రెండ్ ఉధృతంగా ఉంది.
సంక్రాంతికి రాబోతున్న రవితేజ క్రాక్, రామ్ రెడ్ రెండూ ఆంగ్ల పదాలే. అక్కినేని హీరోలు ఈ ట్రెండ్ ని ఇంకా సీరియస్ గా ఫాలో అవుతున్నారు. నాగార్జున రాబోయే సినిమా వైల్డ్ డాగ్, పూర్తయిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇవి కూడా అవే బాపతే. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే రిలీజ్ కు సిద్ధంగా ఉన్న లవ్ స్టోరీ, ప్రస్తుతం షూటింగ్ లో థాంక్ యు ఏ భాషో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఇప్పుడు మొదలైన పోకడ కాదు. చాలా ఏళ్ళ నుంచి సాగుతుంది. తమిళంలో అక్కడి భాషలో ఉండే టైటిల్స్ ని తెలుగులోకి వచ్చేటప్పటికీ రోబో, బ్రదర్స్ గా మార్చిన ఉదాహరణలు కోకొల్లలు. దీనికి కారణమేంటో నిర్మాతలే విశ్లేషించుకోవాలి.
అలా అని అందరూ ఇదే రూట్ లో వెళ్తున్నారని కాదు. అచ్చమైన తెలుగు టైటిల్స్ వాడుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. ఆచార్య, సర్కారు వారి పాట, బంగారు బుల్లోడు, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వగైరా అన్నీ మన పదాలే. ఒకరకంగా రెండు భాషలు ఇలా మిశ్రమంగా సాగుతున్నప్పటికీ తెలుగుకి ఇంకా అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మలయాళంలోనూ మన లాగే ఎక్కువగా ఇంగ్లీష్ నే టైటిల్స్ కోసం వాడుతుంటారు. కాకపోతే ఎన్ని వందల భాషలు ఉన్నా తెలుగులో ఉన్న తీయదనం వేరు. రంగస్థలం, ఒక్కడు లాంటి పొట్టి పేర్లయినా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి పొడుగాటి పేర్లయినా మన భాషలో ఉండే అనుభూతే వేరు.