iDreamPost
android-app
ios-app

రూపాయి ఫైన్ – ఇంజనీరు ఆత్మహత్య

రూపాయి ఫైన్ –  ఇంజనీరు ఆత్మహత్య

హర్యానా లోని కల్కా నుంచి హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నడుమ నారో గేజ్ రైలు మార్గంలో టాయ్ ట్రెయిన్ మీద ప్రయాణం ఎంతో అందంగా, ఆహ్లదకరంగా ఉంటుంది. కొండలనడుమ మెలికలు తిరుగుతూ, కొండలలో త్రవ్విన సొరంగాల గుండా సాగే ఈ రైలు ప్రయాణం యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది. ఇరవై స్టేషన్లూ, 103 సొరంగాలు, 969 బ్రిడ్జిల మీద సాగే ఈ 96 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణం 1898లో మొదలై 1903లో పూర్తి అయింది. కల్కా నుంచి మొదలుపెట్టి సొరంగాలని నంబర్లతో పిలిస్తే 33వ సొరంగాన్ని మాత్రం బారోగ్ టన్నెల్ అని పిలుస్తారు. దాని పక్కన ఉన్న స్టేషన్ కూడా బారోగ్ పేరు మీదే ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలోని రైల్వే ఇంజనీరు కల్నల్ బారోగ్ పేరు మీద ఉన్న ఈ సొరంగం వెనక ఒక విషాదం దాగి ఉంది.

బ్రిటిష్ ప్రభుత్వం వారి వేసవి రాజధాని సిమ్లాను రైలు మార్గం ద్వారా చేరుకోవడానికి కల్కా, సిమ్లా మధ్య రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ బాధ్యతను రైల్వే ఇంజనీరు కల్నల్ బారోగ్ మీద పెట్టింది. ఆ ప్రాంతం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన బారోగ్ సొరంగాలు, వంతెనలు నిర్మించాల్సిన ప్రాంతాలను గుర్తించి, ప్లాన్ రూపొందించి, ప్రభుత్వ ఆమోదం పొందాక పని ప్రారంభించాడు.

1.2 కిలోమీటర్ల టన్నెల్

అన్ని సొరంగాల పొడవు రెండు మూడు వందల మీటర్ల లోపే ఉంటే, టన్నెల్ నంబర్ 33 మాత్రం 1.2 కిలోమీటర్ల పొడవు ఉంటుందని గుర్తించి, అంత పొడవు టన్నెల్ త్రవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా, నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేయడానికి ఒక వినూత్నమైన ఆలోచన చేశాడు బారోగ్. కొండకి రెండు వైపుల నుంచి రెండు బృందాలతో త్రవ్వుకుంటూ వచ్చి, మధ్యలో కలిసేలా పని మొదలు పెట్టారు. బారోగ్ చాలా కచ్చితంగా వేసిన అంచనా ప్రకారం ఏ దిశలో త్రవ్వాలో నిర్దేశించిన విధంగా త్రవ్వసాగారు.

అంచనా ప్రకారం రెండు సొరంగాలు కలవాల్సిన సమయంలో కలవలేదు. మరోవారం త్రవ్వకాలు కొనసాగించినా ప్రయోజనం కనిపించలేదు. ఎక్కడో తప్పు జరిగిందని తెలిసింది. పని ఆగిపోయింది. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఒక విచారణ కమిటీ వేసింది బ్రిటిష్ ప్రభుత్వం. కల్నల్ బారోగ్ వేసిన లెక్క తప్పింది కానీ, అది బారోగ్ ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని కమిటీ తేల్చింది. ప్రజా ధనం వృధా అయినందుకు ఒక రూపాయి జరిమానా చెల్లించాలని బారోగ్ ని అదేశించింది కమిటీ.

మనస్తాపంతో ఆత్మహత్య

తన అంచనాలు తప్పడం, దాని వల్ల చాలా మంది పనివారి శ్రమ వృథా కావడం, తనను దోషిగా తేల్చి జరిమానా విధించడంతో బారోగ్ మానసికంగా కృంగిపోయాడు. ప్రతిరోజూ సాయంత్రం తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేస్తూ అసంపూర్తిగా ఉన్న సొరంగం దగ్గరకు వెళ్ళి, అక్కడ చాలాసేపు కూర్చుని వస్తూ ఉండేవాడు. ఒకరోజు కుక్క ఒకటే గట్టిగా అరుచుకుంటూ వెనక్కి వచ్చింది. అతని పనివారు యజమాని ఏమయ్యాడా అని వెతికి చూస్తే సొరంగంలో బారోగ్ నెత్తుటిమడుగులో ఉన్నాడు. చేతిలో తుపాకీ, తలలో తూటా చేసిన గాయం కనిపించాయి. బారోగ్ శవాన్ని సొరంగం ముఖద్వారం వద్ద ఖననం చేశారు.

బారోగ్ మరణంతో బ్రిటిష్ ప్రభుత్వం ఛీఫ్ ఇంజనీర్ హెచ్. ఎస్. హెర్లింగ్ టన్ కు బాధ్యతలు అప్పగించింది. హెర్లింగ్ టన్ కూడా బారోగ్ అనుసరించిన విధానం లోనే రెండు వైపుల నుంచి ఒకేసారి సొరంగం త్రవ్వాలని నిర్ణయించి, అంతకు ముందుగా ఆ ప్రాంతాన్ని సర్వే చేయాలని భావించాడు. అతను ఈ పనిలో ఉండగా ఆ ప్రాంతంలో ఉన్న ఒక బాబా భాల్కూ అనే సన్యాసి కనిపించాడు. చిన్నప్పటి నుంచి ఆ కొండల్లో పశువుల కాపరిగా ఉండి, ఆ తరువాత సన్యాసిగా మారిన అతనికి ఆ ప్రాంతాలన్నీ కొట్టిన పిండి అని గ్రహించిన హెర్లింగ్టన్ అతని సాయంతో పాత సొరంగానికి సరిగ్గా ఒక కిలోమీటరు అవతల కొత్త సొరంగం త్రవ్వడానికి ప్లాన్ రూపొందించి నిర్ణీత కాలంలో పూర్తి చేశాడు.

అదే మార్గంలో మరికొన్ని సొరంగాలు త్రవ్వడానికి సహాయం చేసిన బాబా భాల్కూకి వైస్రాయ్ ఒక పతకం బహూకరించాడు. 2011లో బాబా భాల్కూ రైల్ మ్యూజియంని భారత రైల్వే శాఖ సిమ్లాలో ప్రారంభించింది. బారోగ్ టన్నెల్ తర్వాత వచ్చే స్టేషన్ కి బారోగ్ పేరు పెట్టారు. బారోగ్ టన్నెల్ దగ్గర కోటు వేసుకున్న ఒక ఆంగ్లేయుడు కుక్కతో కలిసి నడుచుకుంటూ సొరంగంలోకి నడుచుకుంటూ వెళ్ళడాన్ని చూసినట్టు చాలా మంది చెప్తూ ఉంటారు.