Idream media
Idream media
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా తెలంగాణలోని పార్టీలన్నీ రాజకీయ సమరం సాగిస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ అయితే ఓ రేంజ్ లో వాదోపవాదాలు, సవాళ్లు – ప్రతిసవాళ్లు చేసుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ విడుదలవుతుందా? ఇక్కడ సత్తా చాటి ప్రజలు తమ వైపే ఉన్నారని ఎప్పుడు చాటి చెబుదామా? అని ఎదురుచూస్తుండగా, కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో ఉప ఎన్నికను మరి కొంత కాలం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా మరో 11 రాష్ట్రాలు కూడా ఉప ఎన్నికలకు ముందుకు రాలేదు. రాని వాటిని మినహాయించి తప్పనిసరైన బెంగాల్, ఒడిషాలో ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చింది. మిగతా ఎన్నికల సంగతి ఎలాగున్నా హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా ప్రధానంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఎటువంటి ప్రభావం చూపుతుందనే చర్చ తెలంగాణలో జోరుగా సాగుతోంది.
Also Read:అమరీందర్ ,సిద్దు ముఠా గొడవలతో APP ను గెలిపిస్తారా?
హుజూరాబాద్ పాలిటిక్స్ ఇప్పుడిప్పుడే పీక్స్ కు చేరుతున్నాయి. అవమానకర రీతిలో మంత్రిగా తొలగించి పార్టీ నుంచి గెంటేశారంటూ ప్రజల్లో ఈటల పొందిన సానుభూతి పవనాలను టీఆర్ఎస్ తగ్గిస్తూ వస్తోంది. ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ గా ఉప ఎన్నిక మారిపోవడంతో ప్రభుత్వం కూడా దీన్ని ఓ సవాల్ గా తీసుకుంది. బీజేపీలో చేరిన రాజేందర్ పవర్ ను తగ్గించేలా పథకం ప్రకారం ముందుకెళ్తోంది. దళిత బంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలతో పాటు హుజూరాబాద్ ప్రజల కోసమే ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తోంది. హరీశ్‌ను రంగంలోకి దింపిన కేసీఆర్ వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారు. పథకాలతో పాటు పదవులలో కూడా ఆ నియోజకవర్గ నేతలకు ప్రాధాన్యం ఇస్తూ టీఆర్ఎస్ బలోపేతం అయ్యేలా చేస్తున్నారు.
రాజేందర్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ నుంచి మంత్రులు హోరాహోరీగా పోరాడుతున్నారు. క్షేత్ర స్థాయిలో అన్ని వర్గాలనూ గులాబీ నేతలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దళిత బంధు పథకాన్ని ప్రకటించి దళిత ఓటు బ్యాంకు తమ ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు .
Also Read: పెద్దిరెడ్డి మీద పోటీకి కొత్త “బాబు”ను సిద్ధం చేసిన చంద్రబాబు…
ఇక అభివృద్ధిలోనూ హుజురాబాద్ నియోజకవర్గాన్ని జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి కనీవినీ ఎరుగని విధంగా నిధుల వరద కురిపిస్తున్నారు. అభ్యర్థిగా బీసీ యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ పేరును ప్రకటించి బీసీల ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న హరీశ్.. కేసీఆర్ రాజేందర్ కు నాలుగు వేల ఇళ్లు ఇస్తే.. ఒక్కటి కూడా ప్రజలకు కట్టి ఇవ్వలేకపోయారంటూ ఈటల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సభలు, సమావేశాల్లో ఒంగి ఒంగి దండాలు పెడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కేసీఆర్ కాలు పట్టుకునైనా హుజూరాబాద్ కు అది తెస్తా.. ఇది తెస్తా.. అంటూ హామీలు ఇస్తున్నారు.
నియోజకవర్గంలో టీఆర్ఎస్ మరింత బలపడకుండా ఎప్పుడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలవుతుందా అని బీజేపీ ఎదురుచూస్తున్న క్రమంలో తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక ఇప్పట్లో లేదని ఈసీ వెల్లడించడం ఈటలకు షాక్ అనే చెప్పాలి. కరోనా కారణంగా చూపి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు చెప్పటం బీజేపీకి, ప్రధానంగా ఈటల రాజేందర్ కు ఇబ్బందికర పరిణామమే.
Also Read:సీఎం సీటు సేఫ్…కరోనా గిరోనా జాన్తా నై, మమత పాలిటిక్స్…!
ఒకపక్క పశ్చిమ బెంగాల్ లో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ఈసీ కేవలం తెలంగాణలో ఒక్క స్థానానికి ఎన్నిక వాయిదా వెయ్యటంపై ఇప్పుడు తెలంగాణలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల రాజేందర్ కు అనుకూలంగానే ఉన్నా, కేసీఆర్, హరీశ్ నియోజకవర్గంపై పట్టు బిగించేందుకు చేస్తున్న రాజకీయాలు టీఆర్ఎస్ కు మారే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఉండే ట్రెండ్, ఎన్నికలు జాప్యం జరిగితే ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏదేమైనా హుజురాబాద్ లో ప్రజల సానుభూతి కోసం తెగ ప్రయత్నం చేస్తున్న ఈటల రాజేందర్ కు, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక రిఫరెండంగా భావిస్తున్న బీజేపీకి ఈసీ నిర్ణయం పెద్ద షాక్ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్ గెలుస్తారని బీజేపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్న వేళ.. తాజాగా ఎన్నికల వాయిదాపై ఎటువంటి వివాదాన్ని తెరపైకి తెస్తారో వేచి చూడాలి.