iDreamPost
iDreamPost
రాజకీయాల్లో సెంటిమెంట్లకు కొదవులేదు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి పీఠం దక్కించుకునేంత వరకు నేతలు సెంటిమెంటు చుట్టూ తిరుగుతుంటారు. పదవి చేపట్టేంత వరకు నేతలు సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లకు వెళ్లేవారు క్రమం తప్పకుండా ఏదో ఒక ఆలయానికి వెళ్లడం.. పలానా చెట్టు క్రింద కూర్చుంటే గెలుపు ఖాయమని అనుకోవడం… పలానా చోట కార్యాలయం ఏర్పాటు చేస్తే విజయం వరిస్తుందని నమ్మడం… ఆ గ్రామం నుంచే ఎన్నికల ప్రచారం ఆరంభించాలనుకోవడం వంటి సెంటిమెంట్లకు కొదవులేదు.
రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి సెంటిమెంట్లు చాలా వరకు ఉన్నాయి. ఈ సెంటిమెంట్లు తూర్పు గోదావరి జిల్లాకు మరీ ఎక్కువ. కోనసీమ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రి అయినవారు తరువాత ఎన్నికల్లో ఓటమి చెందడమో… అసలు సీటే రాకపోవడమో సెంటిమెంట్. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో రెండవ స్థానంలో నిలిచి ఓటమి చెందినవారు తరువాత ఎన్నికల్లో విజేతగా నిలవడం మరో సెంటిమెంట్. ఇటువంటి సెంటిమెంట్ తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ స్థానానికి కూడా ఉంది. చైర్మన్ పదవవి అధిరోహించినవారిలో చాలా మంది తరువాత కాలంలో ఉన్నత పదవులు పొందడం.. రాజకీయంగా అత్యున్నత స్థానాలకు వెళ్లడం పెద్ద సెంటిమెంట్.
Also Read : కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎప్పటి వరకు పదవిలో ఉంటారో తెలుసా?
తూర్పు జెడ్పీ చైర్మన్‌లుగా ఎన్నికైన తరువాత కాలంలో అత్యున్నత స్థానాలకు వెళ్లినవారిలో దివంగత లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి ప్రథముడు. 1987లో చైర్మన్ పదవికి నేరుగా జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచి చైర్మన్ అయ్యారు. జెడ్పీ చైర్మన్‌గా ఉంటూనే ఆయన 1991లో 10వ లోక్‌సభకు అమలాపురం నుంచి ఎన్నికయ్యారు. 1996లో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన బై ఎలక్షన్‌లో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రిగా నియమితులయ్యారు. ఈ పదవిలో ఉన్న సమయంలోనే ఆయన 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అమలాపురం నుంచి గెలిచి 12వ లోక్‌సభ స్పీకర్ అయ్యారు. తిరిగి 1999లో మరోసారి ఎంపిగా గెలిచి 13వ లోక్‌సభకు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. తూర్పు జెడ్పీ చైర్మన్ నుంచి దేశంలో ప్రొటోకాల్ పరంగా ఐదవ అత్యున్నత పదవిని అలంకరించారు.
బాలయోగి తరువాత పలు పదవులు అలంకరించినవారిలో కాకినాడ ప్రస్తుత లోక్‌సభ సభ్యురాలు వంగా గీత ఉన్నారు. 1995 నుంచి 2000 వరకు తొలిసారి మహిళా జెడ్పీ చైర్మన్ అయిన వంగా గీతా విశ్వనాధ్ తరువాత 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యురాలిగాను, 2009 నుంచి 2014 వరకు పిఠాపురం ఎమ్మెల్యేగాను, తాజాగా 2019లో జరిగిన ఎన్నికల్లో కాకినాడ నుంచి లోక్‌సభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. జెడ్పీ చైర్మన్‌గా ఉంటూ ఉన్నత పదవులు అధిరోహించే సెంటిమెంట్ మెట్ట ప్రాంత సీనియర్ నేత తోట రామస్వామి హాయాంలో ఆరంభమైంది. 1959 నుంచి 64 వరకు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన, జెడ్పీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే ఆయన రాష్ట్రమంత్రిగా ఎన్నికయ్యారు.
Also Read : తూర్పు జెడ్పీ పీఠంపై ‘వేణు’గానం
ఆ తరువాత జెడ్పీ చైర్మన్ అయిన కపిలేశ్వరపురం జమిందార్ ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణరావు తరువాత కాలంలో రాజమహేంద్రవరం నుంచి బీజేపీ ఎంపీగా గెలవడమే కాకుండా వాజ్‌పాయి ప్రభుత్వంలో సహాయమంత్రిగా పనిచేశారు. 1981 నుంచి 83 వరకు జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన పంతం పద్మనాభం రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రిగా పనిచేశారు. 1999-2004 జెడ్పీ చైర్మన్‌గా ఉన్న దున్నా జనార్ధనరావు ప్రస్తుతం డీసీఎంఎస్ చైర్మన్‌గా ఉన్నారు. దివంగత బొడ్డు భాస్కర రామారావు, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు జెడ్పి చైర్మన్లుగా ‘పని చేశారు. 2006 నుంచి 2011 జెడ్పీ చైర్మన్‌గా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ 2019లో రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత వై.ఎస్.జగన్ మంత్రి వర్గంలో బీసీ సంక్షేమ శాఖమంత్రిగా పనిచేస్తున్నారు. ఇలా తూర్పు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ అయినవారు తరువాత కాలంలో రాజకీయంగా ఉన్నత స్థానాలను అధిరోహించడం సెంటిమెంట్‌గా మారింది.