iDreamPost
android-app
ios-app

“ఎగ్జైట్మెంట్” పోల్స్ : ‌టీఆర్ఎస్ కు 2.. బీజేపీకి 2…జై!

“ఎగ్జైట్మెంట్” పోల్స్ : ‌టీఆర్ఎస్ కు 2.. బీజేపీకి 2…జై!

సెంటిమెంట్ చుట్టూ తిరిగిన దుబ్బాక ఉప ఎన్నిక చివ‌రి వ‌ర‌కు కూడా ఉత్కంఠ గానే సాగింది. పోలింగ్ త‌ర్వాత కూడా ఆ ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. సాధార‌ణంగా పోలింగ్ అనంత‌రం ఓటింగ్ శాతం.. పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి ఏ పార్టీవైపు ఓట‌రు మొగ్గు చూపార‌నేది సూచాయ‌గా ఓ అంచ‌నా క‌లుగుతుంది.

అయితే దుబ్బాక ఓట‌ర్లు ఎవ‌రి అంచ‌నాల‌కూ చిక్క‌లేదు. చివ‌ర‌కు ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే తేల్చాయి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల మ‌ధ్యే హోరాహోరీ సాగిన‌ట్లు తెలుస్తున్నా. తాజాగా నాలుగు సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌గా.. రెండు టీఆర్ఎస్ కు, మ‌రో రెండు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక్క‌డ కూడా ఆ రెండు పార్టీలూ స‌రిస‌మానం అయ్యాయి. నాలుగు సంస్థ‌లూ ఒక్క‌టి మాత్రం తేల్చాయి. కాంగ్రెస్ మూడో స్థానానికి ప‌రిమిత‌మైన‌ట్లు తెలిపాయి.

ఏ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే…

పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ వెల్ల‌డించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ విజ‌యం సాధిస్తుంద‌ని తేలింది. 47 శాతం ఓట్లతో ఆ పార్టీకి గెలిచే అవ‌కాశాలు ఉండ‌గా.. 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్‌కు రెండోస్థానం ద‌క్కింది. 13 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచింది. థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) ప్ర‌క‌టించిన‌ ఎగ్జిట్‌ పోల్‌లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం సాధించింది. 51-54 శాతం ఓట్లతో దుబ్బాక స్థానాన్ని కైవ‌సం చేసుకుంటుంద‌ని తెలుస్తోంది. 33-36 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు రెండోస్థానం ద‌క్క‌నున్న‌ట్లు ఆ సంస్థ అంచ‌నా. 8-11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మూడోస్థానంలో నిలిచారు.

మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో బీజేపీకి విజయం సాధించ‌గా.. 51.82 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని, 35.67 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు రెండోస్థానంలో నిల‌వ‌నున్నారు. 12.15 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మూడోస్థానం ద‌క్క‌నుంది. ఆరా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో 48.72 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలిస్థానం, 44.64 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు రెండోస్థానం, 6.12 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మూడోస్థానం ల‌భిస్తుంద‌ని ప్ర‌క‌టించింది. ఇలా నాలుగు సంస్థ‌ల్లో రెండు బీజేపీకి, రెండు టీఆర్ఎస్ కు ప‌ట్టం క‌ట్టాయి.

ట‌గ్ ఆఫ్ వార్‌..

దుబ్బాక ఉప ఎన్నిక‌లో ట‌గ్ ఆఫ్ వార్ న‌డిచిన‌ట్లు ఎగ్జిట్ పోల్స్ మ‌రోసారి తేల్చాయి. సుజాత‌కు టికెట్ కేటాయించ‌డం, అంతా తానై హ‌రీశ్ రావు గెలుపు బాధ్య‌త భుజాన వేసుకోవ‌డంతో విజ‌యం ఖాయ‌మ‌నే సంకేతాలు మొద‌ట్లో వెలువ‌డ్డాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే మంత్రి హ‌రీశ్ రావు కూడా దుబ్బాక ను టీఆర్ఎస్ కు క‌ట్ట‌బెట్టేందుకు శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌చారం సాగించారు.

మొద‌ట్లో స‌ప్ప‌గా సాగిన బీజేపీ ప్ర‌చారంలో చివ‌ర‌కు వ‌చ్చే వ‌ర‌కు హీట్ పెరిగింది. ఒక‌దానిపై ఒక‌టి వివాదాలు చుట్టుముట్ట‌డం, దీంతో బీజేపీ పెద్ద‌లు రంగంలోకి దిగ‌డంతో ర‌ఘునంద‌న్ బ‌లం పెరిగింది. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌న్నీ టీఆర్ఎస్ కుట్ర‌లంటూ గ‌ట్టిగా మాట్లాడ‌డం, గ‌త రెండు ప‌ర్యా‌యాలు ఓట‌మి పాలైన సానుభూతి ప‌నిచేసిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. దీంతో చివ‌ర‌కు వ‌చ్చే స‌రికి ట‌గ్ ఆఫ్ వారి న‌డిచింది. దీంతో తెలంగాణలో 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల తర్వాత ఉప ఎన్నిక జరిగిన దుబ్బాక హాట్ టాపిక్‌గా మారింది. ఎగ్జిట్ పోల్స్ తో మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. ఉప ఎన్నిక అసలు ఫలితం ఏంటో తెలియాలంటే 10వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.