iDreamPost
android-app
ios-app

డ్రైవ్ ఇన్ థియేటర్ – టికెట్ 1200 /- మాత్రమే

  • Published Sep 30, 2020 | 11:42 AM Updated Updated Sep 30, 2020 | 11:42 AM
డ్రైవ్ ఇన్ థియేటర్ – టికెట్ 1200 /-  మాత్రమే

పెద్ద తెరపై వినోదానికి దూరమవుతున్నామని బాధ పడుతున్న సినిమా ప్రేమికులకు ఊరట కలిగించే మార్గాలను కంపెనీలు వెతుకుతున్నాయి. థియేటర్లలో నాలుగు గోడల మధ్య మూసి ఉన్న వాతావరణంలో వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందన్న భయం వల్ల ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. కొత్త గైడ్ లైన్స్ మీద కూడా ఇండస్ట్రీ వర్గాలు పెద్దగా ఆశలేమి పెట్టుకోలేదు. అందుకే ఇప్పుడు నగరాల్లో డ్రైవ్ ఇన్ థియేటర్ల ట్రెండ్ ఊపందుకుంటోంది. శివాజీలో రజనికాంత్ శ్రేయ ఒక ఓపెన్ గ్రౌండ్ కు కారుతో పాటు వెళ్లి బయట కాలుపెట్టకుండానే కింగ్ కాంగ్ సినిమాను చూస్తారు. ఇప్పుడిదే మెయిన్ ఆప్షన్ గా మారబోతోంది. 

గత శుక్రవారం గుర్గావ్ కు చెందిన సన్ సెట్ సినిమా క్లబ్ 2007లో వచ్చిన ఇంటు ది వైల్డ్ సినిమాను ప్రదర్శించింది. టికెట్ ధర ఒక కారుకు 1200 రూపాయలు. ఊహించని రీతిలో 50కి పైగా కుటుంబాలు టికెట్లు బుక్ చేసుకుని సినిమాను ఎంజాయ్ చేశారు. ఇదే కాదు బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ జబ్ వీ మెట్, 20 సంవత్సరాల క్రితం వచ్చిన హెరా ఫెరీ వారంలో చివరి మూడు రోజులు ఢిల్లీలో ప్రదర్శిస్తే అద్భుతమైన స్పందన దక్కింది. ఆన్ లైన్లో ఫ్రీగా దొరికే సినిమాలను కూడా ఇలా ఇంత ఖర్చు పెట్టి జనం రావడం చూసి నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముందు 30 కార్లకు సరిపడా టికెట్లు అమ్ముడైతే చాలు అనుకుంటే పబ్లిక్ డిమాండ్ దృష్ట్యా దాన్ని ఏకంగా 70కు పెంచాల్సి వచ్చిందట. ఇప్పటిదాకా ఇలా 26 షోలు వేస్తే దాదాపు 90 శాతం టికెట్లు పూర్తిగా సొల్ద్ అవుట్ కావడం గమనార్హం. 
ఈ సంస్థ 2018లోనే ఈ తరహా స్క్రీనింగ్స్ ప్రవేశపెట్టినప్పటికీ లాక్ డౌన్ తర్వాత వస్తున్న స్పందనే అనూహ్యం అంటున్నారు. త్వరలో బెంగుళూరులో ఏ స్టార్ ఈజ్ బార్న్ తో అక్కడ కూడా షోలు వేయబోతున్నారు. 1995లో వచ్చిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగేని వేయమని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారట. ఇప్పుడు కొత్తగా గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్ మెంట్ వాసుల నుంచి తమ స్టేడియంలలో ఇలాంటి షోలు వేయమని అడుగుతున్నారు. కాకపోతే గ్రౌండ్ సామర్ధ్యాన్ని బట్టి 20 నుంచి 30 కార్ల వరకే చాలా చోట్ల వసతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ వస్తేనే ఇబ్బంది. హైదరాబాద్, కోచిలోనూ ఇదే తరహా ప్రదర్శనలకు ప్లానింగ్ జరుగుతోంది. అయితే ఇవి సామాన్యులకు దూరమే. కారు ఉంటె తప్ప ప్రవేశించే అవకాశం ఉండదు. అయినా సగటు ప్రేక్షకుడు 1500 రూపాయల దాకా పాత సినిమాను ఫ్యామిలీ చూసేందుకు ఎలా ఖర్చు పెడతాడు. ప్రస్తుతానికి ఈ ఖరీదైన వినోదం ఒక పరిమిత వర్గానికి మాత్రమే.