iDreamPost
iDreamPost
వివిధ సాకులతో తోటి వారిని చిన్నచూపు చూడడం పలువురికి అలవాటు. కానీ కరోనా కారణంగా ఈ అలవాటు ఇంకొంచెం కొందరిలో కాస్తంత ఎక్కువైందనే చెప్పాలి. అదేదో రాకూడని జబ్బు అన్నట్లు, వస్తే ఏదో అయిపోతామన్నట్లు వారిలో ఉన్న భయాల ప్రభావాన్ని ఎదుటివారిపై చూపిస్తున్నారు. ఈ తతంగం ఎంతగా పేట్రేగిపోతోందంటే వైద్యులు, అధికారులు ఎంత మొత్తుకుంటున్నా మృత దేహాలకు అంత్యక్రియలు జరగనీయకుండా కూడా అడ్డుకుంటున్న ఘటనలు దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. మానవత్వంతో ఆలోచించే వారికి ఇది మనస్సుచివుక్కుమనే సంఘటనే.
ఏదైనా ఒక ప్రమాదాన్ని గురించి అవగాహన లేకపోతే దానిని గురించి తీవ్రంగా భయపడ్డాము అంటే అర్ధముంటుంది. ఒక పక్క ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది నేరుగా పాజిటివ్ వచ్చిన వారిని పీపీఈ కిట్లు ధరించిన తగు జాగ్రత్తలతో స్వయంగా తాకి వైద్యం అందిస్తున్నారు. మరో వైపు నిత్యం రోడ్డుమీదే అంటూ జనాన్ని కంట్రోల్ చేస్తూ తమకేం జరిగినా సరే ప్రజల్ని కాపాడాలన్య లక్ష్యంగా పోలీసులు, ఇతర శాఖల అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తూనే వీరు వీటిని సక్రమంగా నిర్వహిస్తు, తమతమ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు. దురదృష్టవశాత్తు కొందరు వ్యాధికి చిక్కుతున్నారు. కానీ ఇది సాధారణంగా వ్యాపించే దిశలోనే వ్యాపిస్తోంది. కొందరు స్వచ్ఛంధ సేవకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు రోగుల అంత్యక్రియల్లో పాల్గొని జనానికి అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. అయితే వీటన్నటినీ ఏ మాత్రం పట్టించుకోకపోగా, కోవిడ్ భారిన పడ్డవారిని వివక్షతో చూడడం అత్యంత హేయమైన చర్యగానే చెప్పాల్సి ఉంటుంది. వివక్ష చూపొద్దున్న విషయాన్ని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నాయి. కానీ కొందరికి ఇవేమీ పట్టడం లేదు.
నిజానికి వ్యాధి ఏ విధంగా మీదపడుతుందో అర్ధం కావడం లేదు. భుక్తికోసం రోడ్డున తిరగాల్సిన వారికి నిత్యం జాగ్రత్తగా ఉండేందుకు వీలు కూడా పడడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండడంతో పాటు, ఒక వేళ ఎవరైనా వ్యాధి భారిన పడితే వారి పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం ఎందుకు పదేపదే చెప్పాల్సి వస్తోంటే.. వైరస్ భారిన పడ్డాక మన ఆరోగ్య పరిస్థితిని బట్టి అది ఎటువంటి ప్రభావం చూపుతుందో వైద్య నిపుణులకే అర్ధం కావడం లేదు. ఇటువంటి పరిస్థితిల్లో ఒక వేళ వైరస్ భారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైతే పరిస్థితి క్లిష్టంగా మారే పరిస్థితులే గనుక ఉంటే.. అటువంటి సమయంలో గతంలో కోవిడ్ 19 భారిన పడిన వారి రక్తం నుంచి సేకరించిన ప్లాస్మాను ఎక్కించి మాత్రమే కాపాడేందుకు అవకాశాలు ఉంటాయి. ఒక వేళ ఆరోగ్యం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి అంతకు ముందు వైరస్ భారిన పడ్డవారిని చిన్నచూపు చూసినప్పటికే, సదరు రోగం నుంచి బైట పడ్డ వ్యక్తి మాత్రమే అతడిని కాపాడగలుగుతాడన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం.
సమాధి కట్టేటప్పుడు ‘సరిగా లేదు.. వద్దు, వద్దు.. అంటూ పక్కన పెట్టిన రాయే తలకు మూలరాయి’గా మారిందన్న ఉదాహరణను పెద్దలు అప్పుడప్పుడూ చెబుతుంటారు. అందు వల్లనే ఎవ్వరినీ చిన్నచూపు చూడొద్దు, కించపర్చవద్దని భారిన జీవన విధానం కూడా స్పష్టం చేస్తుంది. ఇప్పుడు మనం కోవిడ్ భారిన పడ్డవాళ్ళను చిన్నచూపు చూస్తే రేపు మన ప్రాణాలను కాపాడడానికి వాళ్ళ రక్తంలోని ప్లాస్మాయే దిక్కు కావొచ్చు. సో.. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండడండి, జాగ్రత్తలు పాటించండి, రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించండి!