iDreamPost
android-app
ios-app

కొరోనా వ్యాప్తిలో ఎయిర్ కండిషనింగ్ విధ్వంసక పాత్ర

కొరోనా  వ్యాప్తిలో ఎయిర్ కండిషనింగ్   విధ్వంసక పాత్ర

కొరోనావైరస్ 2019 డిసెంబర్ లో బయటపడి విపరీతంగా వ్యాప్తి చెందుతున్న దశలో, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వేసవికాలం వచ్చిన తర్వాత ఈ జబ్బు దానంతటదే కనుమరుగవుతుందని చెప్పుకున్నాం. అలాగే అధిక వేడిమి గల దేశాలలో కోవిడ్ జబ్బు వ్యాపించిందని కూడా అనుకున్నాం. అయితే వేసవి కాలం లోనూ, గల్ఫ్ దేశాలలోనూ కూడా కొరోనా వ్యాప్తితో ఇంకా ఏదో ముఖ్యమైన విషయం ఈ జబ్బు వ్యాప్తికి దోహదం చేస్తుందని తెలుస్తున్నది.

నిజానికి భౌతిక దూరం, తగిన రక్షణ దుస్తులు ఉపకరణాల, మాస్క్ ల వాడకంతో సహా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనేక మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది కోవిడ్ తో మృత్యువాత పడడం తెలిసిందే. అలాగే , విమానాలు, రైలులో ఎసి ప్రయాణాలలో కూడా ఎక్కువ మంది ఈ జబ్బు బారిన పడటం మనందరకూ ఎరుకే. ఏసీ ఫంక్షన్ హాల్స్ లో విలాసవంతంగా జరిగిన పెళ్లి, పుట్టినరోజు వేడుకలతో కూడా కోరోన పేషంట్స్ తయారు కావడం తెలిసిందే.

కొరొనావైరస్ గాలిద్వారా వ్యాప్తి చెందుతుంది

కొరొనా సోకిన వారి దగ్గు, తుమ్ములు మాట్లాడటం ద్వారా గాలిలో చేరి…. వారి ఎదురుగా, సమీపంలో వున్న వారిలో నేరుగా శ్వాసలో చేరి జబ్బును కలిగించవచ్చును అని మనందరికీ తెలిసిందే …. అయితే మరికొన్ని క్షణాలలో పేషంట్ యొక్క నీటి తుంపరలు నేలమీదికి చేరతాయి అని భావించినది కాస్తా … ఇప్పుడు ఆ తుంపరల లోని క్రిములు గాలిలో కలిసి, ఎక్కువ సమయం పాటు తేలివుండి జబ్బును వ్యాప్తిచెయ్యగలవు అని తెలిసింది. మాస్క్, భౌతిక దూరం వున్నప్పటికీ… ఎయిర్ కండిషన్ సిస్టం తో మూసిన గదుల్లో … గాలి ఒకే చోట తక్కువ ప్రాంతంలో తిరగడం దీనికి ఏకైక కారణం అనేది సాధారణ జ్ఞానమే …నిజానికి సాంక్రమిక వ్యాధులు… మూసి వున్న, కొద్దిప్రాంతంలొనే గాలి తిరిగే సందర్భాలలో ఎక్కువగా వ్యాప్తిచెందుతాయి. క్షయ జబ్బు అలాగే ఇరుకు ఇళ్ళల్లో బాగా వ్యాపించడం మనకు తెలుసు. ఒకనాడు, క్షయ జబ్బు కి చికిత్స లేని రోజున పేషంట్స్ ని గాలి, వెలుతురు ధారాళం గా వుండే శానిటోరియం లో ఉంచి, పౌష్టికాహారం ఇవ్వడం పెద్ద వైద్యం.

జబ్బును కలిగించడానికి కొంత కనీసపరిమాణంలో(దీనిని శాస్త్రీయంగా ఇన్‌ఫెక్టివ్ డోస్ 50-ID50 గా సూచిస్తారు) వైరస్… శ్వాస ద్వారా చేరాల్సి వుంటుంది…గాలి నిరంతరం చలిస్తూ వుండే ఆరుబయటా, ధారాళంగా రాకపోకలు వుండే నాన్-ఎసి గదులలోనూ వైరస్ చేరినప్పటికీ, కొన్ని క్షణాలలోనే వాటి సాంద్రత వేరేవారికి జబ్బును కలగచెయ్యలేని స్థాయికి చేరుతుంది… దానికే మాస్క్స్… భౌతికదూరం…అయితే మూసి వుండే ఎయిర్ కండిషన్ గదులలో గంటకు మహా అయితే మూడుసార్లు గాలి మారుతుంది. అంటే, కొరొనావైరస్, క్షయ వంటి జబ్బులు వున్నవారు క్రిములను తమ ఊపిరితో గాలిలో వదిలితే, ఆ గదిలో వుండే వారికి కూడా… క్రిములతో కలిసి వున్న సమయం ఎక్కువ కనుక జబ్బు సోకే అవకాశాలు ఎక్కువ.

ఏతావాతా చెప్పొచ్చేది ఏమంటే… ఆఫీసులూ, బ్యాంకులూ, హాస్పిటల్స్, సినిమాహాళ్ళు, ఫంక్షన్ హాళ్ళూ, షాపులూ…వ్యవహార స్థానాలు వేటికీ ఎయిర్ కండిషనింగ్ మంచిది కాదు…. ప్రమాదకరం…ఇంత ముఖ్యమైన, చావు బతుకులను తేల్చే అంశం మీద పెద్దగా ఫోకస్ లేదు. అంటే, మన భారతదేశం వంటి వర్థమాన దేశం లో కూడా… ఎయిర్ కండిషనింగ్ లేకుంటే… అదో కొరతగా చూస్తున్నాము… సుఖ భోగాలకు ఎంతగా అలవాటు పడ్డామో కదా. అసలు, సాంక్రమిక వ్యాధులు ఎక్కువగా వుండే పేద, వర్థమాన దేశాల్లో కనీసం హాస్పిటల్స్ వరకూ, అధమం ఇన్ఫెక్షన్స్ వున్న పేషంట్ వార్డ్స్ వరకూ అయినా ఏసీ వుండకూడదు. క్లోజ్డ్ వాతావరణంలో కోవిడ్ తో సహా, అన్ని అంటువ్యాధులూ ఎక్కువగా వ్యాపిస్తాయి. జబ్బు ను కలగచెయ్యడానికి కొంత మోతాదు లో సూక్ష్మజీవి వ్యక్తి లో చేరాలి. కోరోనా జబ్బు వ్యాపించకుండా ఇతరుల నుండి మీటర్ పైగా ఎడం పాటించాలి అంటే గాలిలో ఆ వైరస్ పలచబడుతుంది అని ఇది గాలి క్లోజ్డ్ వాతావరణం లో కాక, బయట మాత్రమే సాధ్యం. ఎంత గొప్ప ఏసీ గది అయినా, 3 ACH అనగా గంటకు మూడు సార్లు ఎయిర్ చేంజ్ అయినప్పటికీ… సూక్ష్మ జీవి తగిన స్థాయిలోనే… జబ్బుని కలిగించే సాంద్రతలోనే ఉంటుంది.

అయితే, ప్రజల్లో వినిమయ లాలస (కన్స్యూమరిజం) ప్రబలి, ఆర్థిక వ్యవస్థ (మార్కెట్ ఎకానమీ) జనజీవితాలను శాసిస్తున్న ఆధునిక యుగంలో, ఏసీ లను లేకుండా చెయ్యడం అసాధ్యం. అలా చెయ్యగలిగితే, అది సహజావరణ సఖ్యంగా. భూతాపం పెరగకుండా నిలువరిస్తుంది…. ఈ భూమి మరింత నివాసయోగ్యంగ మారుతుంది… జనం గుమిగూడే పబ్లిక్ ప్రాంతాలలో థియేటర్స్, మాల్స్, హాస్పిటల్స్, ఆఫీస్, బస్, ట్రైన్ వంటివి వీలైనంత వరకూ క్లోజ్డ్ కాకుండా ఉండటం మంచిది. ఏసీ భోగాలు ఇంటి వరకూ చాలు.

డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎం.డి.,
సాంక్రమిక వ్యాధుల వైద్య నిపుణులు, కాకినాడ