iDreamPost
android-app
ios-app

భారత రాజకీయాల్లో… అంత:పుర రాజకీయాలకు కొదవేలేదు

  • Published Jan 22, 2022 | 10:30 AM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
భారత రాజకీయాల్లో… అంత:పుర రాజకీయాలకు కొదవేలేదు

నాటి రామాయణ, మహాభారతం నుంచి… నేటి ప్రజాస్వామ్య భారతదేశ రాజకీయాల్లో అంత:పుర రాజకీయాలకు కొదవేలేదు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు.. అధికారపీఠం కోసం వేసిన ఎత్తులు.. పై ఎత్తులు.. వెన్నుపోటు రాజకీయాలు నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. పురాణాల్లోను.. రాజుల కాలంలోను.. మొఘల్‌ పాలనలోను రాజ్యాల విభజనకు… నేడు రాజకీయ పార్టీల చీలికలకు కుటుంబ రాజకీయాలు కూడా ఒక కారణమే.

తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో కూడా అంత:పుర రాజకీయం సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ మరదలు, ములాయంసింగ్‌ యాదవ్‌ చిన్నకోడలు అపర్ణాయాదవ్‌ ఎన్నికల ముందు బీజేపీలో చేరడం సంచలనం సృష్టించింది. ములాయంసింగ్‌ యాదవ్‌ రెండవ భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ భార్య అపర్ణ తన మామ స్థాపించిన సమాజ్‌వాదీ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీలో చేరడంతో ఆ కుటుంబానికి మింగుడుపడని అంశంగా మారింది. బీజేపీలో చేరడమే కాకుండా మామ ములాయం ఆశీస్సులు కూడా తీసుకోవడం ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఈ కుటుంబ రాజకీయాలు దేశాన్ని ఏలిన ఇందిరాగాంధీ కుటుంబానికి కూడా తప్పలేదు. ఆమె చిన్నకోడలు మేనకాగాంధీ కుటుంబాన్ని ధిక్కరించి బయటకు వచ్చారు. సంజయ్‌ మరణం తరువాత ఇందిరా బ్రతికున్నప్పుడే మేనకా ఆ కుటుంబానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి పార్టీ బీజేపీలో చేరి కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆమె కుమారుడు వరుణ్‌గాంధీ సైతం బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నారు. తాతల పార్టీ కాంగ్రెస్‌ను విమర్శించే విషయంలో వారు ఎప్పుడూ వెనకాడరు. ఒక సందర్భంలో ప్రియాంక గాంధీ రెండు కుటుంబాలను కలపాలని చూసినా సోనియా అడ్డుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

దక్షిణాధి రాజకీయాల్లో కూడా అంత:పుర రాజకీయాలకు కొదవలేదు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల్లో ఇది ఎక్కువగా ఉంది. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ సైతం కుటుంబ రాజకీయాల్లో ముక్కలుగా చీలిపోయింది. కుటుంబ కలహాలను అడ్డుపెట్టుకుని ఏకంగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి.రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి దించిన విషయం తెలిసిందే. పార్టీ రెండుగా చీలి ఎన్టీఆర్‌ ద్వితీయ సతీమణి లక్ష్మీపార్వతి, చంద్రబాబు మధ్య జరిగిన పోరాటం దేశమంతా చూసింది. చంద్రబాబును కాదని అతని బావ మాజీమంత్రి హరికృష్ణ సైతం కొంతకాలం సొంత పార్టీ పెట్టుకున్నారు.

విజయనగర సామ్రాజ్య వారసులు పూసపాటి గజపతిరాజు సోదరులు సైతం రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నారు. అన్న ఆనంద్‌ గజపతిరాజు కాంగ్రెస్‌లో ఉండగా, తమ్ముడు అశోక్‌ గజపతిరాజు టీడీపీలో ఉన్నారు. ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత చిన్నాన్న అశోక్‌ గజపతిరాజుపై మాన్సాస్‌ ట్రస్టు విషయమై ఏకంగా యుద్ధమే చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేశారు. జిల్లాల రాజకీయాల వరకు వస్తే ఇలా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ప్రత్యర్థి పార్టీల్లో ఉంటూ రాజకీయాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

రాష్ట్రాలకు వస్తే తమిళనాడులో కరుణానిధి వారసుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు, అతని సోదరుడు అళగిరికి విభేదాలు చాలాకాలంగా ఉన్నాయి. అళగిరి తండ్రి ఉన్న సమయంలో కుటుంబాన్ని, పార్టీని విభేదించారు. ఇప్పుడు సొంతంగా పార్టీని పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.

మధ్యప్రదేశ్‌ విషయానికి వస్తే సింధియా కుటుంబాల్లో సైతం విభజన రాజకీయాలు చోటు చేసుకున్నాయి. దివంగత కేంద్రమంత్రి మాధవరావ్‌ సింధియా కాంగ్రెస్‌ ఉంటే అతని సోదరి రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియా బీజేపీ తరపున కేంద్రమంత్రిగాను, రెండుసార్లు రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాధవరావ్‌ సింధియా తల్లి విజయరాజే సింధియా తొలుత కాంగ్రెస్‌లోను, తరువాత బీజేపీలోనూ చేరారు.మాధవరావ్‌ సింధియా కుమారుడు జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్‌లో ఉంటూ అత్త విజయరాజ సింధియాకు వ్యతిరేకంగా నిలిచాడు. తరువాత బీజేపీలో చేరి కేంద్రమంత్రిగా ఉన్నారు. మాధవరావు సింధియా మరో సోదరి యశోధర రాజే సింధియా కూడా అన్నకు వ్యతిరేక పార్టీ బీజేపీలో రాజకీయాలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ రాజకీయాల్లో కుటుంబ కలహాల రాజకీయాలు కొత్తాకాదు… ఇప్పుడిప్పుడే ఆగేవి కాదు.