iDreamPost
android-app
ios-app

పెద్ద మనసు చాటుకున్న ఏపీ డీజీపీ

  • Published Nov 03, 2020 | 2:22 PM Updated Updated Nov 03, 2020 | 2:22 PM
పెద్ద మనసు చాటుకున్న ఏపీ డీజీపీ

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటికే కరోనా సమయంలో విధులు నిర్వహించిన పోలీసులకు మజ్జిగ పంచుతున్న ఓ మహిళ వీడియో చూసి ఆయన స్పందించారు. ఆమెకు పోలీస్ శాఖ తరుపున ప్రశంసలతో పాటుగా ప్రత్యేక బహుమతి కూడా అందించారు. ప్రజలకు, పోలీసుల మధ్య దూరం తగ్గించేందుకు అలాంటి ప్రయత్నాలు ఉపయోగపడతాయని అప్పట్లో అందరూ వ్యాఖ్యానించారు.

తాజాగా ఆయన మరోసారి తన మార్క్ చాటుకున్నారు. పోలీస్ బాస్ అంటే కేవలం శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించడమే కాదు..ఉదారంగా వ్యవహరించి, అందరికీ ఆదర్శంగా నిలవాలని కూడా ఆయన నిరూపించారు. అందులో భాగంగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. పలువురికి ఉపశమనం కల్పించారు. స్వయంగా డీజీపీ కూడా గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థను సందర్శించారు. అక్కడే ఉన్న 7 సంవత్సరాల బాలిక హిమబిందుకు నూతన వస్త్రాలు,ఆటబొమ్మలు అందించారు. జులై17వ తేదీన పట్టాభిపురం పోలీసులకు దొరికిన చిన్నారి హిమబిందు ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్ లో జీవనం సాగిస్తోంది. ఆమెతో పాటుగా అక్కడే సంస్థలో ఉన్న మరో 22 మంది చిన్నారులకు పుస్తకాలు,చాక్లెట్లు కూడా అందించారు. హిమబిందును డీజీపీ దత్తత తీసుకోవడం తో రాష్ట్రమంతా పలువురు పోలీస్ అధికారులకు ఇది స్ఫూర్తిదాయకం అవుతుందని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ చిన్నారి హిమబిందు సంరక్షణ బాధ్యతలు పోలీస్ శాఖ చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆపరేషన్ ముష్కాన్ లో భాగంగా ఇప్పటి వరకు 13 వేల మంది చిన్నారులకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించామని తెలిపారు. మహిళలు, యువతులు, చిన్నారులు సురక్షితంగా నివసించే రాష్ట్రంగా ఏపీని తయారుచేస్తామని అన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్ములం చేసేందుకు రేపు వెబ్ నార్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో హోంమంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తో పాటు ఇతర స్వచ్చంద సంస్థలు పాల్గొంటాయన్నారు. చిన్నారులు సహా మహిళలకు పోలీస్ యంత్రాంగం పూర్తి భరోసాగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.