iDreamPost
android-app
ios-app

ఆలోచింప‌చేస్తున్న వెంక‌య్య వ్యాఖ్య‌లు

ఆలోచింప‌చేస్తున్న వెంక‌య్య వ్యాఖ్య‌లు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మాట‌ల మాంత్రికుడిగా గొప్ప పేరుంది. అన్ని అంశాల‌పైనా పూర్తి అవ‌గాహ‌న‌తో మాట్లాడ‌తారు. తాజాగా పార్టీ ఫిరాయింపుల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆలోచింప‌చేస్తున్నాయ‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌లో నేత‌లంద‌రూ ఆయ‌న సూచ‌న‌ల‌ను పాటించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ఈ విష‌యంపై మ‌రింత ప‌రిశీల‌న చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. రాజ‌కీయాల‌లో ఏ పార్టీ అయినా పిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూనే ఉన్నాయి. ప్ర‌త్యేకంగా చంద్ర‌బాబును ప్ర‌స్తావించ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయి. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పిరాయింపుల‌ను బాగా ప్రోత్స‌హించారు. కొంత మందిని బ‌లవంతంగా త‌మ పార్టీలోకి చేర్చుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను టీడీపీ చేర్చుకున్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణ లో కూడా పిరాయింపుల రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.

పిరాయింపుల‌పై వెంక‌య్య ఏమ‌న్నారంటే…

‘చర్చలు జరపడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించవచ్చని మన రాజ్యాంగం చెబుతోంది. ప్రస్తుత నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ, వాటిని అమలు చేయడం మరుస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల తీరుపై ప్రజల్లో నమ్మకం పోతుంది. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకులు శారీరక దాడులకు పాల్పుడటం దురదృష్టకరం. ప్రభుత్వం ప్రతిపాదించినా.. ప్రతిపక్షాలు వ్యతిరేఖించినా.. ఏం చేయాలన్నది చట్టసభకు వదిలేయాలి. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగంను అపహాస్యం చేస్తున్నాయి. ఫిరాయింపులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని పార్లమెంట్‌లోనే చెప్పాను. దీనిపై రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలి. అదిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ఆ విలువలు కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. తాత్కాలిక ఉపయోగం కంటే దీర్ఘకాలిక అవసరాల కోసం రాజకీయాలు చేయాలి.’ అని వెంక‌య్య‌నాయుడు సూచించారు.

నెల్లూరులో ప‌ర్య‌టించిన వెంక‌య్య ఈ వ్యాఖ్య‌లు చేశారు. అలాగే వాజ్‌పేయి గురించి మాట్లాడుతూ.. దేశంలోని సామాన్య ప్రజల అభివృద్ధి కోసం భారత మాజీ ప్రధానమంత్రి దివంగత నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఎన్నో సంస్కరణలు చేపట్టారని అన్నారు. సుదీర్ఘ పార్లమెంట్ అనుభవం గడించిన ప్రధాని వాజ్‌పేయీదని, ఆయన చరిత్రను ప్రతి యువకుడు అధ్యయనం చేయాలని సూచించారు. అటల్‌, అద్వానీ లాంటి ఇద్దరు గొప్ప నేతల మధ్య తాను కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. న్యూక్లియర్ పరీక్షల అనంతరం పార్లమెంట్‌లో ఒక్క ఓటు తేడాతో రాజీనామా చేశారని గుర్తుచేశారు.