iDreamPost
android-app
ios-app

Demonetisation-దేశం డిజిటలైజేషన్ అయిపోయిందా. చలామణిలో ఉన్న నగదు లెక్కలేంటి?

  • Published Nov 06, 2021 | 2:37 AM Updated Updated Mar 11, 2022 | 10:36 PM
Demonetisation-దేశం డిజిటలైజేషన్ అయిపోయిందా. చలామణిలో ఉన్న నగదు లెక్కలేంటి?

గంగిరెద్దులాట ఆడే వారికి డబ్బులు ఇచ్చేందుకు క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ చేస్తున్నట్టుగా ఉన్న ఓ ఫోటోని కేంద్ర ఆర్థిక మంత్రి పోస్ట్ చేశారు. దేశంలో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుందనడానికి ఇదో సంకేతమని నిర్మలా సీతారామన్ వాదించారు. డిజిటల్ పేమెంట్స్ లో ముందడగు వేస్తున్నామనడానికి ఇదే నిదర్శనమన్నట్టుగా ఆమె వెల్లడించారు. కానీ వాస్తవం ఏమిటి, అధికారిక లెక్కలు ఏమి చెబుతున్నాయన్నది పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

దేశంలో చలామణిలో ఉన్న నగదుని బట్టి డిజిటల్ పేమెంట్స్ ని అంచనా వేయవచ్చు. వాస్తవానికి గడిచిన ఆరేడేళ్లలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిన మాట వాస్తవం. కానీ అదే సమయంలో నగదు చలామణి కూడా పెరిగిందనేది అధికారిక సమాచారమే. దేశంలో నగదు చలామణీ తగ్గించి డిజిటల్ పేమెంట్స్ పెంచేందుకేనంటూ డీమోనటైజేషన్ చేశారు. కానీ అధికారికంగా అలా ప్రకటించకుండా అవినీతి, తీవ్రవాదం, నల్లధనం వంటివి అంతం చేసేందుకు డీమోనటైజేషన్ అంటూ 2016 నవంబర్ 8న హఠాత్తుగా పెద్ద నోట్ల ఉపసంహరణ చేశారు. ఆ సందర్భంగా దేశమంతా తీవ్ర గందరగోళం ఏర్పడింది. అయినా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని శంకించకుండా సామాన్యులు సైతం కేంద్రానికి అండగా నిలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించి అప్పట్లో నగదు కోసం తాము పడిన కష్టాలన్నీ విస్మరించారు.

చివరకు ఐదేళ్ల తర్వాత అనుభవం చూస్తే దేశంలో అవినీతి పెరిగింది. ఎన్నికల్లో నోట్ల కట్టల పంపిణీ పెరిగిందని హుజూరాబాద్ సాక్షిగా వెల్లడయ్యింది. ఇంకా చెప్పాలంటే రెండు వేల నోట్ల కట్టలు దాచిపెట్టేసి ఎన్నికల్లో పంచడానికే వాడుతున్నారా అనే అభిప్రాయం బలపడుతోంది. ఇక నల్లధనం అరికట్టడం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతా మంచిది. తీవ్రవాదం తగ్గించడానికి కూడా ఈ సాహసం పనిచేయలేదని శుక్రవారం నాడు కశ్మీర్ లో తీవ్రవాదుల దాడి చాటిచెబుతూనే ఉంది. అయితే అవన్నీ సాధించలేకపోయినా డిజిటల్ పేమెంట్స్ లో ఏం సాధించామన్నది కూడా ఆసక్తికరమే. దేశంలో సామాన్యులు సైతం క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ కి ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ అదే సమయంలో ఆర్బీఐ గణాంకాలు చూస్తే దేశంలో నగదు చెలామణీ పెరిగింది. ఇంకా చెప్పాలంటే రెట్టింపు అయ్యింది.

నవంబర్ 4, 2016 నాటికి దేశంలో చెలామణిలో ఉన్న డబ్బు రూ. 17.97 లక్షల కోట్లు. అక్టోబర్ 2021 నాటికి అది రూ. 28.30 లక్షల కోట్లకు చేరింది. అంటే క్యాష్ లెస్ ఎకానమీ అనేది ప్రచారానికే తప్ప వాస్తవంలో భిన్నంగా ఉందన్నది చెబుతోంది. ఇంకా పరిశీలిస్తే 2015లో రూ. 14.48 లక్షల కోట్ల నగదు చలామణీలో ఉండగా గత ఏడాది 2020 నాటికి అది రూ. 23.7 లక్షల కోట్లకు చేరింది. ఇప్పుడు మరింత పెరిగిందన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆర్బీఐ వివరాలే చాటుతున్నాయి. అయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రం భిన్నమైన ప్రకటన చేశారు. అయితే చలామణీలో ఉన్న నగదు పూర్తిగా మార్కెట్లోకి రాకుండా మళ్లీ కట్టలు కట్టలుగా కుప్పలు పెట్టేస్తున్నారనే అనుమానం చాలామందిలో బలపడుతోంది. ముఖ్యంగా 2వేల నోట్లు వంటివి దాదాపు కనుమరుగయిపోయిన వాస్తవాన్ని చూస్తే కొందరు అక్రమార్కులు నగదు పోగుబెట్టేసి ఉంటారనే అంచనా పెరుగుతోంది. దాంతో నోట్ల రద్దు ప్రక్రియ ఈ విధంగా కూడా మేలు చేయలేదనే సంకేతాలు ఇస్తోంది.

Also Read : Audisankaracharya Statue – హిందూమత దీప శిఖ ఆదిశంకరాచార్య !