భారత పౌరులపై నేపాల్ బోర్డర్ పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన మరవకముందే నేపాల్ మరో దుస్సాహసానికి పాల్పడింది.ఉత్తరాఖండ్‌లోని పితోర్ గఢ్ జిల్లాలో భాగమైన వివాదాస్పద లింపియాధురా, కాలాపాని,లిపులేఖ్ ప్రాంతాలు తమవిగా చూపుతూ రూపొందించిన నూతన మ్యాప్‌ను ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
వివాదాస్పద కొత్త మ్యాప్ కోసం రాజ్యాంగంలోని షెడ్యూల్ 3 ను సవరించేందుకు అవసరమైన బిల్లును ఈనెల 10న దిగువ సభలో అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ప్రవేశపెట్టింది.రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లు ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. కాగా మొత్తం 275 మంది సభ్యుల దిగువ సభలో 258 మంది ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.
నేపాల్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన నేపాలీ కాంగ్రెస్,రాష్ట్రీయ జనతాపార్టీ (నేపాల్),రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి.ఏ ఒక్క సభ్యుడు రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయకపోవడంతో సునాయాసంగా మూడింట రెండొంతుల మెజార్టీతో దిగువ సభ ఆమోదం పొందింది.ఇక ఇప్పుడు ఈ సవరణ బిల్లును నేపాల్ జాతీయ అసెంబ్లీకి పంపుతారు.అక్కడ ఈ బిల్లులో ఏవైనా మార్పులు సూచించేందుకు సభ్యులకు 72 గంటల సమయం ఇస్తారు.జాతీయ అసెంబ్లీలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి పూర్తిస్థాయిలో మెజారిటీ ఉన్నందున బిల్లు ఆమోదం పొందడం అనేది నామమాత్ర ప్రక్రియ మాత్రమే.తర్వాతి దశలో పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లు అధ్యక్షుడి వద్దకు వెళుతుంది.ఆయన ఆమోదం పొందిన తర్వాత గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి రాజ్యాంగంలో అధికారకంగా చేరుస్తారు.
గత మే 8న ఉత్తరాఖండ్‌లోని ధార్చులాతో లిపులేఖ్ కనుమను అనుసంధానించే 80 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక రహదారిని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అయితే ఈ రోడ్డును ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.భారత్ నిర్మించిన రోడ్డు మార్గం పూర్తిగా తమ భూభాగంలోనే ఉన్నదని నేపాల్ వాదించింది.ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన లిపులేఖ్,కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు తమకు చెందినవిగా పేర్కొంటూ నూతన రాజకీయ మ్యాప్‌ను నేపాల్ రూపొందించింది.గత మే 18 వ తేదీన కొత్త మ్యాప్‌ను నేపాల్ క్యాబినెట్ ఆమోదించి మే 27 న పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.అయితే గోర్ఖా జాతీయవాదాన్ని తెరపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రధాని కేపీ శర్మ ఓలీ భావిస్తున్నారని ఆరోపించిన నేపాల్ ప్రతిపక్షాలు బిల్లుకు మద్దతు ఇవ్వలేదు.తాజాగా అన్ని ప్రతిపక్షాల మద్దతు పొందిన ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతినిధుల సభలో ఆమోదింప చేసుకున్నారు. గత నెలలో కృతిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులు చెల్లవని భారత విదేశాంగ శాఖ నేపాల్‌కు తెలియజేసిన సంగతి తెలిసిందే.
నేపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్:
భారత భూభాగాలను తమవిగా చూపుతూ నేపాల్ దిగువ సభ ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.నేపాల్ రూపొందించిన కొత్త మ్యాప్‌కు చారిత్రక ఆధారాలు లేవని,ఈ భూభాగాలు పూర్తిగా తమకు చెందినవే అని భారత్ స్పష్టం చేసింది.
భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ రూపొందించిన మ్యాప్ విషయంలో ఇప్పటికే మన వైఖరిని నేపాల్‌కు స్పష్టం చేశామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.చారిత్రక వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కృత్రిమంగా సరిహద్దులను చెరిపి మన భూభాగాలను నేపాల్ తమవిగా చెప్పుకోవడం ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి దౌత్య పరంగా చర్చించుకోవాలన్న ఒప్పందాన్ని నేపాల్ ఉల్లంఘించిందని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.