Idream media
Idream media
మన దేశం గొప్పతనం ఏమంటే ఇక్కడ రాజకీయ నాయకుల కంటే , మాఫియా డాన్‌లకే విశ్వసనీయత ఎక్కువ.
1974లో ముఖ్యమంత్రి వసంతరావ్ నాయక్ పేరు మహారాష్ట్రలో కూడా అందరికీ తెలియకపోవచ్చు. మట్కా కింగ్ రతన్ పేరు తాడిపత్రిలో నల్లబండల గనుల్లో పనిచేసే కార్మికుడికి కూడా తెలుసు. భారతదేశమంతా పాపులర్ అయిన రతన్ చనిపోయాడు.
లక్షల మంది ఆత్మహత్యకి కారకుడైన రతన్ ఖత్రీ ఎలాంటి శిక్ష అనుభవించకుండా కూల్‌గా చనిపోయాడు. మనిషి పాపాలకి అంతకింత అనుభవిస్తాడనే మన మెట్ట వేదాంతం, ఇగోని శాటిస్‌ఫై చేయడానికి తప్ప దేనికీ పనికి రాదు. చట్టం చేతులు పొడుగు అని సినిమాల్లో అంటారు. కానీ చట్టానికి చేతులే లేవు. ఉన్నా అది తన కబంధ హస్తాలతో పేదవాళ్లు, నిస్సహాయుల్ని పట్టు కుంటుంది తప్ప బడా బాబుల్ని కాదు. రతన్ తన జీవిత కాలంలో ఎమర్జెన్సీలో కొన్ని నెలలు జైల్లో ఉన్నాడు. ఒకసారి పెరా లసిస్ స్ట్రోక్ రావడం తప్ప ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండానే 88 ఏళ్లు బతికాడు.
భోపాల్‌ని విష వాయువుతో శ్మశానం చేసిన అండర్సన్ కూడా ఎలాంటి శిక్ష లేకుండా జీవించి , మరణించాడు.
రతన్ మృతి వార్తని తెలుగు పేపర్లు సింగిల్ కాలమ్‌గా వేశాయి. అది కూడా ఏజెన్సీ వార్తకి అనువాదం. వీళ్లు సొంతంగా రాసిందేమీ లేదు. ఇంగ్లీష్ పేపర్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ముంబయ్ మిర్రర్ మాత్రం ఒక బాక్స్ ఐటమ్ రాసింది.
వాస్తవానికి రతన్‌లాల్ ఖత్రీ ఇంత కాలం బతికే ఉండడం ఒక వార్త అయితే , చావు కూడా పెద్ద వార్తే. రాజకీయ నాయకుల తర్వాత ఈ దేశ ప్రజలతో అతి పెద్ద జూదం ఆడించిన ఏకైక వ్యక్తి రతన్.
ప్రతి సంపద వెనుక ఒక నేరం ఉంటుంది అంటాడు రచయిత బాల్జాక్.
రతన్ బాల్జాక్‌ని చదువుకోలేదు. 1947 దేశ విభజనలో జీవితం అర్థమైంది. అపుడు అతని వయస్సు 13 ఏళ్లు.
వాస్తవానికి దేశ విభజనే అతిపెద్ద జూదం. మన తలల మీద బ్రిటీష్ వాడు ఆడిన జూదం.
“ప్రతి గ్రామంలోనూ , హిందూముస్లింలు కలిసి జీవిస్తున్న దేశాన్ని మత ప్రాతిపదికపై ఎలా విడదీస్తారు?” -గాంధీ అడిగిన ప్రశ్నకి ఎవరి దగ్గరా సమాధానం లేదు. విభజన రేఖలు గీస్తూ పోయారు. లక్షల మంది మృతదేహాల మీద దేశం రెండు ముక్కలైంది.
ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన సంఖ్య కంటే విభజనలో పోయిన వాళ్లే ఎక్కువ. గాంధీ కన్నీళ్లకి ఒక బుల్లెట్‌తో విలువ కట్టారు.
సరే , అదంతా చరిత్ర. నాయకుల ముసుగులో ఉన్న జూదగాళ్ల గురించి కాదు, మనం నిజమైన జూదగాడి గురించి మాట్లాడుకుందాం.
రతన్ 1947లో బొంబాయిలో కాలు పెట్టాడు. నేరం , పేదరికం, ఆకలి కలిసి జీవిస్తున్న అతిపెద్ద నగరం. పిడికెడు ముద్ద కోసం పిడికిలి బిగించి కొట్టుకునే నగరం.
1960, రతన్ యువకుడయ్యాడు. బొంబాయ్ పొట్ట నిండా మిల్లు కార్మికులు. గోర్కీ “అమ్మ” నవలలో మొదటి చాప్టర్ గుర్తుందా? అంతకంటే నికృష్టమైన పరిస్థితులు. దుర్భరమైన చాకిరీ, ఎక్కడెక్కడి నుంచో బతుకు కోసం బొంబాయి చేరిన వాళ్లు బలిపీఠాలు ఎక్కుతున్నారు.
ఆకలి ఉంటే ఆశ ఉంటుంది. పేదరికం ఉంటే జూదం కూడా ఉంటుంది.
బొంబాయిలో అప్పటికే పేకాట క్లబ్బులున్నాయి. చిన్నచిన్న జూదాలున్నాయి. గుర్రాల పందేలున్నాయి. కానీ అందరికీ అందుబాటులో లేవు.
కల్యాణ్ అనే వాడికి ఐడియా వచ్చింది. న్యూయార్క్ కాటన్ ఎక్స్ఛేంజ్‌లో కాటన్ ప్రారంభ ధర, ముగింపు ధరలపై బెట్టింగ్ చేస్తూ జూదం స్టార్ట్ చేశాడు. దీన్ని కాటన్ అని పిలిచేవాళ్లు (మట్కాని కొన్ని ప్రాంతాల్లో కాటన్ అని పిలవడానికి ఇదే కారణం).
ఈ ధరలు టెలీప్రింటర్ ద్వారా వచ్చేవి. 1962 వరకు ఇది బాగానే నడిచింది. 62 నాటికి కాటన్ ధరల బెట్టింగ్‌ని పసిగట్టిన న్యూయార్క్ ఎక్స్ఛేంజ్ వివరాలు పంపడం ఆపేసింది. దాంతో కల్యాణ్‌కి ఈ సారి సొంత బుర్ర పనిచేసింది.
00 నుంచి 99 వరకు కాగితాలపై నెంబర్లు రాసి ఒక మట్టి కుండలో వేసి, దాంట్లో నుంచి జనంతోనే ఒక నెంబర్ లాటరీ తీయించాడు. ఆ కుండని హిందీలో మట్కా అంటారు. కల్యాణీ మట్కాగా బొంబాయిలో విస్తరించింది.
నెంబర్ మీద కట్టిన వాడికి రూపాయికి 70 రూపాయలు ఇస్తారు. జనానికి ఇది నచ్చింది. మిల్లు కార్మికులు తమ లక్‌ని పరీక్షించుకోసాగారు. కల్యాణ్ దగ్గర రతన్ అప్పుడు మేనేజర్. 1970, బొంబాయ్‌లోని ఒర్లీలో కొత్త మట్కా వెలిసింది. దానిపేరు రతన్‌లాల్ మట్కా. గురువు కల్యాణ్ నుంచి రతన్ విడిపోయాడు.
ఇది సరికొత్త మట్కా. కుండలో నుంచి చీటీలు తీయరు. ప్లేయింగ్ కార్డ్స్‌లో మూడు నెంబర్లు తీస్తారు. దాన్ని కూడితే వచ్చేదే ఓపెన్. అంటే 6, 6, 7 అని నెంబర్లు వస్తే కూడిక 19, 1+9 కలిస్తే 10 అంటే 1 ఓపెన్. అదే విధంగా క్లోజింగ్ నెంబర్ 899 వస్తే కూడిక 26, రెండు, ఆరు కలిస్తే 8, అంటే రెండు కలిస్తే బ్రాకెట్ 18,
ఈ నెంబర్‌పై కట్టిన వారికి రూపాయికి 80 రూపాయలు, కల్యాణ్ కంటే 10 రూపాయలు ఎక్కువ. బొంబాయి విరగపడింది. మిల్లు కార్మికుల కష్టార్జితం మట్కా పాలైంది. కల్యాణ్ కంటే రతన్ తెలివైన వాడు. ఒర్లీ ప్రాంతంలోనే మట్కా నడిస్తే లాభం లేదు. బొంబాయి మారుమూలలకి వెళ్లాలి. నెట్ వర్క్ స్టార్ట్ అయింది. సందుసందులో బీటర్లు పుట్టారు. మట్కా కంపెనీలు వెలిశాయి.
నమ్మకం కోసం కార్డ్స్‌ని జనంతోనే తీయించేవాడు. ఆ నెంబరే ప్రామాణికం. టెలీఫోన్ ఎక్స్ఛేంజ్‌లలో డబ్బులిచ్చి సకాలంలో అందరికీ నెంబర్ చేరవేశాడు. కమ్యూనికేషన్స్ లేని రోజుల్లో రాత్రి 9 గంటలకి నెంబర్ తీస్తే పది నిమిషాల్లో బొంబాయి మొత్తం తెలిసిపోయేది (రతన్ గొప్పతనం ఏమంటే 1974కల్లా , పది నిమిషాల్లో దేశం మొత్తం తెలిసిపోయేలా చేశాడు).
అప్పటి వరకు బొంబాయిలో జూదాన్ని వ్యవస్థీకృతం చేసి ధారవిలోని గల్లీలకి కూడా పాకేలా చేసిన వాడు లేడు. ఇది పోలీసులకే కాదు, రాజకీయ నాయకులకి నచ్చింది. రెగ్యులర్‌గా అందాల్సినవి అందుతున్నాయి అన్ని స్థాయిల్లోనూ.
బొంబాయిలో జయించిన వాడు ఎక్కడైనా జయిస్తాడు. ఎక్కడైనా అదే పోలీసులు, అదే నాయకులు, అదే ఆశలు నింపుకున్న పేద ప్రజలు.
డబ్బు ఉన్న చోట ఆశతో పాటు , మోసం , నమ్మక ద్రోహం కూడా ఉంటాయి. దాన్ని ఎదుర్కోవడం ఎలా?
బొంబాయిలోని అందరూ డాన్‌లని సమావేశపరచి , ఎవడి వ్యాపారం వాడిది. కానీ మట్కా వేరు. ఇది జనం నమ్మకం మీద నడిచేది. నమ్మకం పోతే కుప్ప కూలిపోతుంది. బొంబాయిలో రోజుకి కోటి రూపాయల టర్నోవర్ ఆగిపోతుంది. 1970లో కోటి అంటే ఎంతో ఊహించుకోవచ్చు.
మట్కా స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక నెంబర్ మీద పది పైసలు కట్టినా , పది వేలు కట్టినా ఒక చిన్న కాగితం ముక్క మీద నెంబర్ , డబ్బు రాసి మనచేతికి ఇస్తారు. మరుసటి రోజు తగిలితే ఆ కాగితం ముక్క చూపిస్తే పది పైసలకి 8 రూపాయలు, పది వేలకి 8 లక్షలు ఇస్తారు, మోసం చేయరు.
బొంబాయి అంటేనే ద్రోహాలకి పుట్టినిల్లు. జరుగుతాయి. కానీ, మన చేతిలో గన్ ఉండాలి. అది గురి తప్ప కూడదు.
దావూద్ ఇబ్రహీం, అరుణ్‌గవ్లీ, చోటా షకీల్ లాంటి చిన్న నాయకులే కాదు (అప్పటికి), వరదరాజ ముదలియార్ , కరీంలాలా అందరూ కూడా మట్కా కింగ్‌కి సన్నిహితులే.
అంతా తనకే కావాలని రతన్ అనుకోలేదు. ఎవడికి చేతనైనంత బిజినెస్ వాడు చేసుకొమ్మన్నాడు. మోయలేని భారాన్ని తనకు బదిలీ చేయమన్నాడు. కానీ ప్రధాన మట్కా కింగ్ తాను మాత్రమే. ఇది రూల్.
దేశమంతా నెట్‌వర్క్ విస్తరించింది. సంసారాలు నాశనమై పోయాయి. ఆత్మహత్యలు పెరిగాయి. కూలి వాళ్లు నేరస్తులయ్యారు. వాళ్ల ఆడపిల్లలు వ్యభిచారులయ్యారు. మట్కా కింద నలిగిన వాళ్లు రతన్ దృష్టిలో లేరు. అతని దృష్టి పైకి ఎదగడంపైనే.
సినిమాలకి ఫైనాన్ష్ చేశాడు, కొన్ని సి గ్రేడ్ సినిమాల్లో నటించాడు కూడా. ఫిరోజ్‌ఖాన్ తీసిన ధర్మాత్మాలో ప్రేమ్‌నాథ్ క్యారెక్టర్ రతన్‌దే. తానే దగ్గరుండి తన మ్యానరిజం ప్రేమ్‌కి నేర్పించాడు.
కుర్తా , పైజమాలో మెడకి మప్లర్ చుట్టుకుని సాదాసీదాగా ఉండేవాడు. పాప భారం తప్పించుకోడానికి ఎంతో మంది పేదలకి సాయం చేసేవాడు.
బొంబాయ్ మత కలహాల తర్వాత మట్కాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రతన్ తప్పుకుంటే అతడి పేరుతో చాలా మంది నడిపించారు. కానీ అతని హయాంలోలా మట్కా ఎన్నడూ వెలగలేదు.
చివరి రోజుల్లో కూడా మహాలక్ష్మి రేస్ కోర్స్‌లో గుర్రాలపై పందెం కాసేవాడు. భారతదేశపు అతిగొప్ప జూదగాడు, తరచూ గుర్రాలపై ఓడిపోయేవాడు.
1947లో తెగిపడిన శవాల మధ్య , రక్తపు దారుల్లో నడిచి వచ్చిన ఒక కుర్రాడు , భారతదేశపు బెట్టింగ్ సామ్రాజ్యాన్నే శాసించాడు.
టెలీఫోన్ లేని రోజుల్లో దేశమంతా అతని నెంబర్ కోసం ఎదురు చూసింది.