ప్రతిపాదిత కార్మిక సంస్కరణలు, చట్టసవరణను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 8న అఖిల భారత సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మిక శాఖా మంత్రి సంతోష్ కుమార్ గంగావర్ తో చర్చలు విఫలమవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. కాగా సమ్మెకు 10 జాతీయ ట్రేడ్ యూనియన్ల తోపాటు 6 బ్యాంకు యూనియన్లు మద్దతు ప్రకటించాయి. దీంతో బంద్ రోజు బ్యాంకు సేవలకు ఆటంకం ఎదురయ్యే ఆవకాశం ఉంది.
జనవరి 8న చేపట్టబోయే భారత్ బంద్ లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు పాల్గొననున్నారు. కార్మికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉక్కు, రైల్వేలు తదితర విభాగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు బంద్ కు మద్దతుగా నిలవనున్నారు. దీంతో బంద్ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. బంద్ కు ఏఐయూటీయూసీ, సిఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎంస్, ఎస్ఇడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్ పీఫ్, యూటీయూసీ, ఐఎన్ టీయూసీ, టీయూసీసీలు మద్దతు ప్రకటించాయి. కార్మిక సంస్కరణలను వెనక్కి తీసుకోవటం, కనీస వేతనాలను పెంచటం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీ కరణ నిలుపుదల తదితరాలు కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.