దత్తాసామంత్ హత్య జరిగి 22 ఏళ్లైంది. ఈ రోజు ఎవరూ గుర్తుపట్టలేని విధంగా ఒక వార్త. ఆయన కేసుని సీబీఐకి బదిలీ చేస్తున్నట్టు ! 22 ఏళ్ల తర్వాత కూడా హంతకుడెవరో తెలియదు. అనుమానాలున్న ఛోటారాజన్ తీహార్ జైల్లో ఉన్నాడు.
ఈ దేశం ట్రేడ్ యూనియన్ల విజయానికి , వైఫల్యానికి సామంత్ ఒక ప్రతీక. 1982లో రెండు లక్షల మంది నూలుమిల్లు కార్మికులతో ఏడాది పాటు సమ్మె చేయించాడు. బొంబాయి నగరం స్తంభించిపోయింది. కానీ ఆ సమ్మె విఫలమైంది. ఫలితం మాఫియా పుట్టుక. ఆకలి, పేదరికం నుంచి నేరాలు పుట్టాయి. హత్యలు జరిగాయి. ఇదే అదనుగా మిల్లు యజమానులు తమ స్థలాలను రియల్ ఎస్టేట్‌కి అమ్మేశారు. ముంబయి మాల్స్ ధగధగల వెనుక లక్షల మంది కన్నీళ్లున్నాయి.
డాక్టర్ చదువుకున్న సామంత్ కార్మికులకి వైద్యం చేస్తూ దగ్గరయ్యాడు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే అయ్యాడు. ఇందిరాగాంధీకి సామంత్ అంటే ఎంత భయమంటే సొంత పార్టీ అయినప్పటికీ ఎమర్జెన్సీలో అరెస్ట్ చేయించారు.
1982లో వేతనాలు పెంచాలని సమ్మె చేయించిన సామంత్ విఫలమయ్యాడు. అనేక నూలుమిల్లులు మూతపడ్డాయి. కొన్ని నగర శివార్లకి తరలిపోయాయి. ఇంత జరిగినా సామంత్ 1984లో ఎంపీగా (స్వతంత్ర అభ్యర్థిగా) గెలిచాడు. ఆయనకి భయం తెలియదు. అంగరక్షకులు లేకుండా ప్రజల్లో తిరిగేవాడు.
1997, జనవరి 16న ఉదయం 11 గంటలకి టాటాసుమోలో ఆయన ఇంటి నుంచి బయల్దేరాడు. ఒక కుర్రాడు సైకిల్‌తో అడ్డం వచ్చాడు. కొందరు సుమోని సమీపించారు. ఎవరో కార్మికులనుకుని సుమో అద్దం దించాడు. మొత్తం 17 బుల్లెట్లు తలలో, ఛాతిలో. అక్కడికక్కడే మరణించాడు.
తెలంగాణ ఆర్టీసీ సమ్మె విఫలం తర్వాత ఎందుకో సామంత్ గుర్తుకొచ్చాడు.