iDreamPost
android-app
ios-app

మీ నమ్మకమే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి

మీ నమ్మకమే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి

ఇండియాలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. దాంతో పాటే ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా బాగా పెరిగాయి. నోట్ల రద్దు తరువాత డిజిటలైజేషన్ లో భాగంగా యూపీఐ అప్లికేషన్ల వినియోగం బాగా పెరిగింది. వీటితో పాటే ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగాయి. ప్రజల చిన్నపాటి ఆశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి. చిన్నమొత్తంలో డబ్బు ఎరవేసి వివిధ నకిలీ ఆన్లైన్ లింక్స్ సృష్టించి ప్రజలకు పంపుతూ ప్రజల డేటాను అపహరిస్తున్నారు. డేటాతో పాటుగా బ్యాంకులో దాచుకున్న ధనాన్ని కూడా కొల్లగొడుతున్నారు. ఇలాంటి లింకుల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది.

గత కొన్నిరోజులుగా గూగుల్ పే లింక్ ఒకటి అందరి వాట్సాప్ & మెసెంజర్లలో వైరల్ అవుతుంది. ఆ గూగుల్ పే లింక్ ని క్లిక్ చేస్తే 500 నుండి 5000 వరకు స్క్రాచ్ కార్డులు వస్తాయన్న వార్తతో కొందరు ఆ లింక్ ని ఓపెన్ చేసి చుస్తే డబ్బు వచ్చినట్లు చూపిస్తుంది కానీ నగదు ఖాతాలో జమ కాలేదు. వివిధ వాట్సాప్ మెసెంజర్ గ్రూపుల్లో ఈ వార్త వైరల్ అయ్యింది. ఇలాంటి లింకులు కనిపిస్తే తక్షణమే డిలీట్ చేయాల్సిందిగా సైబర్ పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ అలాంటి లింకులను ఓపెన్ చేసి చూస్తే మన వ్యక్తిగత వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతాయని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బ్యాంకు కానీ లేదా ఏ ప్రముఖ కంపెనీ అయినా మన వ్యక్తిగత వివరాలను కానీ, ఎటిఎం పిన్ నెంబర్ ని కానీ, సీవీవీ నంబర్లను కానీ ఫోన్ కాల్స్ లో, ఆన్లైన్ లో అడగవు. ఒకవేళ ఎవరైనా వాటిగురించి అడుగుతున్నారంటే ఖచ్చితంగా అది సైబర్ నేరగాళ్ల పనే అని అర్ధం చేసుకోవాలి.

మీకు పెద్ద మొత్తంలో లాటరీ తగిలింది,మీ అకౌంట్ డీటైల్స్ అప్డేట్ చేయండని ఫోన్ కు వచ్చే మెసేజులను పట్టించుకోకపోవడం ఉత్తమం.అలాంటి వాటిని చూసిన వెంటనే డిలీట్ చేయాలి. ఎంతోమంది లాటరీ ఉచ్చులో పడి పెద్దమొత్తంలో తమ బ్యాంకు ఖాతాలో నగదును కోల్పోయారు.

ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీ ఖాతా వివరాలను ఆన్లైన్ లో అప్డేట్ చేయండి,లేకుంటే మీ ఖాతా నిలిచిపోతుందని చెప్పే మెసేజెస్ ని నమ్మకూడదు. ముఖ్యంగా ఏదైనా ఖాతా వివరాలు మార్చాలి అంటే మీ బ్యాంకు కు వెళ్లి మార్చుకోవాలి కానీ ఆన్లైన్ లో మార్చకూడదు.

కింది లింక్ ను క్లిక్ చేస్తే మీ ఖాతాలోకి నగదు వస్తుందని లేదా కింది ఆప్ ని డౌన్లోడ్ చేస్తే మీ నగదు మీకు ఉచితంగా వస్తుందని చెప్పే మెసేజెస్ కానీ లింకులను కానీ నమ్మకూడదు.
ముఖ్యంగా ఫలానా బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాం మీ ఖాతా వివరాలు చెప్పమని ఎవరైనా అపరిచితులు ఫోన్ చేస్తే స్పందించకండి. తొందరపడి మీ వివరాలు చెప్తే మొదటికే మోసం వస్తుంది.

ఏదైనా ఆన్లైన్ లో దొరికే ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో మీ నగదును కాజేయడానికి కాచుకుని కూర్చున్న సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండ ఉండాలంటే అనవసర లింకులు క్లిక్ చేయకపోవడమే ఉత్తమమని సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిజమే,ఆశతో ఏదైనా అనుమానాస్పద లింక్ క్లిక్ చేస్తే మన రహస్య డేటాతో పాటుగా మన నగదును కూడా కోల్పోయే ప్రమాదం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజల నమ్మకమే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి.