iDreamPost
android-app
ios-app

మాజీమంత్రి నారాయణ మెడకు భూకుంభకోణం ఉచ్చు

  • Published Jul 04, 2021 | 9:41 AM Updated Updated Jul 04, 2021 | 9:41 AM
మాజీమంత్రి నారాయణ మెడకు భూకుంభకోణం ఉచ్చు

రాజధాని అమరావతి పేరుతో టీడీపీ హయాంలో జరిగిన భారీ భూకుంభకోణంలో విభ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై సీఐడీ జరుపుతున్న విచారణలో తాజాగా వెల్లడైన అంశాలు మాజీమంత్రి పొంగూరు నారాయణ మెడకు ఉచ్చు బిగించే స్థాయిలో ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల మాయం, రాజధాని ప్రకటన, ల్యాండ్ పూలింగ్ చట్టం అమలుకు ముందు జరిగిన తెరవెనుక వ్యవహారాలను సీఐడీ విచారణలో కీలక ఐఏఎస్ అధికారి పూసగుచ్చినట్లు వివరించడంతో.. ఆ వివరాలతో సీఐడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.

రికార్డుల తరలింపు

రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ఏర్పాటుకు ముందే అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ తుళ్లూరుకు చెందిన భూముల వివరాలు, రెవెన్యూ రికార్డులను తీసుకున్నారని అప్పట్లో సీఆర్డీఏ కమిషనరుగా పనిచేసిన ఐఏఎస్ అధికారి శ్రీధర్ సీఐడీ అధికారులకు చెప్పారు. అమరావతి భూకుంభకోణం కేసులో మాజీమంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులపై గతంలోనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఐఏఎస్ శ్రీధర్ వెల్లడించిన వివరాలు వారి పాత్రను మరింత బలపరుస్తున్నాయి. ముఖ్యంగా సీఆర్డీఏ చైర్మన్ గా నాడు చక్రం తిప్పిన నారాయణ ఇప్పుడు అదే చక్రబంధంలో చిక్కుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అప్పటి కమిషనర్ శ్రీధర్ ను సీఐడీ విచారించగా ఆయన పలు కీలక విషయాలు బయటపెట్టారు.

ల్యాండ్ పూలింగ్ చట్టం అమల్లోకి రాక ముందే 2014 ఆక్టోబరులో తుళ్లూరు రెవెన్యూ రికార్డులను మంత్రి హోదాలో నారాయణ రహస్యంగా తెప్పించుకున్నారని ఆయన చెప్పారు. వాటిని తిరిగి అప్పగించకుండా గుంటూరు కలెక్టరేట్లోనే ఉంచేశారని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ చట్టం రూపొందిస్తున్న సమయంలోనే ఎసైన్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ భూముల విషయంలో జరుగుతున్న తప్పులను తాను వివరించినా నారాయణ పట్టించుకోలేదన్నారు. రాజధాని పరిధి నిర్ణయం, సీఆర్డీఏ చట్టం గురించి సీఆర్డీఏ కమిషనర్, మంత్రుల బృందం, గుంటూరు కలెక్టర్ సమావేశమై చర్చించినా నారాయణ ఏకపక్షంగా పలు నిర్ణయాలు తీసుకునేవారని శ్రీధర్ చెప్పారు. ఆయన ఆలోచన మేరకే 2015లో సీఆర్డీఏ, ల్యాండ్ పూలింగ్ చట్టాలు అమల్లోకి వచ్చాయని వివరించారు.

జీవో 41లోనూ అతిక్రమణలే

అసైన్డ్ భూముల సేకరణకు గత టీడీపీ ప్రభుత్వం జీవో 41 జారీ చేసింది. ఈ వ్యవహారాలన్నీ నారాయణ కనుసన్నల్లోనే జరిగాయి. ఈ జీవో 1977 నాటి అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ కు విరుద్ధంగా ఉందని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లాను.. ఆయన పట్టించుకోలేదు. అలాగే 2016 ఫిబ్రవరి 16న భూసేకరణలో రిటర్నేబుల్ ప్లాట్స్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు నారాయణ ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని అంశాలు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లాను. ఆయన పట్టించుకోకపోగా నిర్ణయాధికారం అధికారులది కాదని వ్యాఖ్యానించారని శ్రీధర్ విచారణలో వెల్లడించారు. నారాయణకు వ్యతిరేకంగా కీలక విషయాలు వెల్లడి కావడంతో.. ఈ వ్యవహారం ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారి శ్రీధర్ వెల్లడించిన ఈ వివరాలతో సీఐడీ అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

Also Read : రేవంత్ వచ్చాక.. సీనియర్లు తప్పుకున్నారా? తప్పించారా?