Idream media
Idream media
బెంగాల్ ఎన్నికల్లో ఇప్పుడు కరోనా కొత్త చిచ్చు రేపుతోంది. కొవిడ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో బెంగాల్‌లో చివరి మూడు దశలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించాలని అధికార పార్టీ, వద్దని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ మారిందంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఈసీ స్పందించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల అభిప్రాయం తెలుసుకోవడానికి ఎన్నికల ముఖ్య అధికారి ఆరిజ్ అఫ్తాబ్ శుక్రవారం మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. టీఎంసీ, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. షెడ్యూల్‌ను మార్చాలంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విజ్ఞప్తిని కూడా ఈసీ కొట్టిపారేసింది.
మార్చాల్సిన అవసరం లేదు..
కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని చివరి మూడు దశలకూ ఏకకాలంలో పోలింగ్ జరపాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ కోరారు. అయితే ఈ ప్రతిపాదనను ఈసీ కొట్టివేసింది. అటువంటి ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారమే ఈ ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. తాము కూడా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకమని బీజేపీ, వామపక్షాలు తెలిపాయి. టీఎంసీ సూచించినట్లు చేస్తే ఆ దశల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు ఓటర్లకూ నష్టం వాటిల్లుతుందని ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేత స్వపన్ దాస్‌గుప్తా పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను మార్చాల్సిన అవసరం లేదని, అయితే కట్టుదిట్టమైన కరోనా నిబంధనలతో పోలింగ్ నిర్వహించాలని సీపీఎం రాజ్యసభ సభ్యుడు వికాస్ భట్టాచార్య కోరారు. కాగా పశ్చిమ బెంగాల్ లో శనివారం ఐదో దశలో 45 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
బయటివారు రాకుండా అడ్డుకోవాలి
బెంగాల్‌లో కరోనా మహమ్మారి విజృంభణకు బీజేపీయే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీల కోసం ఏర్పాట్లు చేయడానికి గుజరాత్ వంటి కొవిడ్ ప్రభావిత రాష్ట్రాల నుంచి కార్మికులను ఆ పార్టీ తీసుకువచ్చిందని, దీంతో బెంగాల్‌లో కొవిడ్ విజృంభిస్తోందని ఆమె అన్నారు. రాష్ట్రంలో బయటివ్యక్తులు అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. శుక్రవారం నదియా జిల్లాలోని నవద్విప్‌లో ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. ‘‘ప్రచారానికి ప్రధాని మోదీ, ఇతరులు వస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎన్నికల కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడానికి గుజరాత్ వంటి కరోనా ప్రభావిత రాష్ట్రాల నుంచి బీజేపీ వారు కార్మికులను ఎందుకు తీసుకువస్తున్నారు? ఇక్కడి స్థానిక కార్మికులకే ఆ పనులు అప్పగించవచ్చు కదా’’ అని ఆమె వ్యాఖ్యానించారు.