iDreamPost
iDreamPost
వైఎస్సార్ సీపీ అధినేతగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తుంగలో తొక్కారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి విమర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయంగా ఎంతగా జగన్‌మోహన్‌రెడ్డితో విభేదిస్తున్నా ఒక సీనియర్ నాయకుడిగా తులసిరెడ్డి సత్యదూరమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. తులసిరెడ్డి కడపలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు మూకుమ్మడిగా వైఎస్సార్ సీపీకి ఓట్లేశారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను, నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారని అన్నారు. పీఆర్సీతో ఉద్యోగులను సీఎం జగన్ మోసం చేశారన్నారు. పీఆర్సీ పే రివర్స్ కమిషన్‌గా మారిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదాను నీరు గార్చారని, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగ యువతను నట్టేట ముంచారని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎవరు నమ్ముతారని ఈ వ్యాఖ్యలు?
ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంతగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారన్నది రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. మేనిఫెస్టోయే తనకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ప్రకటించి అందులోని అంశాల్లో 96 శాతం అనతికాలంలోనే అమలు చేసిన ఘనత జగన్‌ది.
రాజకీయంగా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేనిఫెస్టో అమలుకు ఆయన పెద్ద పీట వేసి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని జనం గమనించబట్టే రోజు రోజుకు ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతోంది. అందుకే విపక్షం ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా జనం వైఎస్సార్ సీపీకి ప్రతి ఎన్నికల్లో బ్రహ్మరథం పడుతున్నారు. పలు సంక్షేమ పథకాల అమలు సాక్షిగా, లబ్ధిపొందిన మెజార్టీ ప్రజలకు తెలిసిన వాస్తవం ఇదైతే.. ఇందుకు పూర్తి భిన్నంగా విమర్శలు చేస్తే ఎవరు నమ్ముతారు? క్షేత్ర స్థాయిలో జనం సమస్యలపై కనీస అవగాహన లేకుండా, మీడియాలో ప్రచారం కోసం, అధిష్టానం దృష్టిలో పడడానికి తులసిరెడ్డి ఇలాంటి కామెంట్లు చేస్తుంటారని వైఎస్సార్ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
అందుకే తెలుగు కాంగ్రెస్‌గా పేరు!
టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలనే కాస్త అటూ ఇటూగా రాష్ట్రంలోని పార్టీల నేతలు చేస్తుంటారు. తులసిరెడ్డి కూడా అందుకు మినహాయింపు కాదని ఈ వ్యాఖ్యలతో రుజువైంది. టీడీపీ నేతల తరహాలోనే పీఆర్సీతో ఉద్యోగులను సీఎం జగన్ మోసం చేశారనడం, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచడాన్ని తప్పుబట్టడం గమనార్హం. 2018 నుంచి కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలో పలుకుబడి సంపాదించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీపై పెత్తనం చేస్తున్నారు. అందుకే బాబు మాదిరిగానే కాంగ్రెస్ నేతలు వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతుంటారు. అందుకే పీసీసీ తెలుగు కాంగ్రెస్‌గా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తుంటాయి.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే 1.38 లక్షల మంది గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చిందని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతున్నారు. 2.56 లక్షల మందికి వలంటీర్లుగా అవకాశం ఇచ్చిందని, 40 వేల ఉద్యోగాలు వైద్య ఆరోగ్యశాఖలో భర్తీ చేసిందని గుర్తు చేస్తున్నారు. ఇవీ కాకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించి శాఖల వారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంటే నిరుద్యోగులకు అన్యాయం చేశామనడం రాజకీయం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీతో అటు ఉద్యోగులు, జాబ్ క్యాలెండర్ అమలు విషయంలో జగన్‌పై నమ్మకంతో ఇటు నిరుద్యోగులు సంతృప్తిగా ఉన్నా.. వారిని రెచ్చ గొట్టాలని ప్రయత్నించడం దిగజారుడు రాజకీయమని వైఎస్పార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.