కాంగ్రెస్ గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపిస్తుంది. గతంలో మణిపూర్, గోవా వంటి రాష్ట్రాలలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో జరిగిన తప్పిదాలు ఈసారి బీహార్‌లో పునరావృతం కాకూడదని కాంగ్రెస్ గట్టిగా సంకల్పించింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జాతీయ ఛానల్స్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ విజయం తథ్యమని తేలింది. కానీ తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నప్పటికీ మరో కొత్త టెన్షన్ కూటమి భాగస్వామ్య పక్షాల నేతలను వెంటాడుతోంది. బీహార్ అసెంబ్లీ పోరులో ఫలితాలు ప్రభుత్వ ఏర్పాటుకు అధికార, ప్రతిపక్ష కూటములకు సమాన అవకాశాలు ఉంటాయని ఎన్డీయే ధీమాగా ఉంది. దీంతో తమ కూటమి తరపున గెలిచిన అభ్యర్థులను ఎక్కడా గద్దల బీజేపీ తన్నుకు పోతుందోనని మహాఘట్‌బంధన్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇక మణిపూర్, గోవా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఈసారి బీహార్‌లో అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు కాంగ్రెస్ చేపట్టింది. మంగళవారం ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అనవసర తప్పిదాలతో అధికార ఎన్డీయేకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమ యువ ట్రబుల్ షూటర్లు రణ్‌దీప్ సూర్జేవాలా, అవినాష్ పాండేలను కాంగ్రెస్ పాట్నాకు పంపింది. నిరంతరం తమ అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతూ నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఈ ఇద్దరు నేతలు బీహార్‌లోనే ఉండనున్నారు.
బీహార్ ఎన్నికలలో పోటీచేసిన 70 మంది కాంగ్రెస్ అభ్యర్థులలో 40-45 మంది ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. గత రాజస్ధాన్, పంజాబ్ ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థులను కాపాడుకున్నట్లుగానే బీహార్‌లో కూడా క్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అధికార ఎన్డీయేలోని బీజేపీ ప్రలోభాల వలకు చిక్కకుండా ఉండేందుకు తమ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్ధులందరినీ పాట్నాలోని ఓ హోటల్‌కు తరలించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ రేపు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద క్రమశిక్షణతో నడుచుకోవాలని తమ కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ నిగ్రహం, మర్యాదతో ఆర్జేడీ కార్యకర్తలు వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ ప్రత్యర్ధులు, వారి మద్దతుదారులతో ఎలాంటి ఘర్షణలకు దిగకుండా హుందాగా ప్రవర్తించాలని తమ పార్టీ శ్రేణులకు ఆయన హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. విజయోత్సాహంతో బాణాసంచా కాల్చడం, రంగులు చల్లుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలని తమ పార్టీ నేతలకు తేజస్వీ స్పష్టం చేశారు.
ఇక మరి కొద్ది గంటలలో మొదలయ్యే బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్ధం కాగా ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొని ఉంది.